మెరిసిన కోహ్లీ, యువీ
రాణించిన బౌలర్లు
శ్రీలంకపై భారత్ ఘన విజయం
ఆతిథ్య బంగ్లాపై బోణీ కొట్టి.. చిరకాల ప్రత్యర్థి పాక్‌ను చితక్కొట్టిన టీమిండియా జోరును శ్రీలంక అడ్డుకోలేకపోయింది..! గత మ్యాచ్‌లో బంగ్లా చేతిలో భంగపడ్డ లంక ధోనీసేనకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. మన బౌలర్లు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయగా... ఆరంభంలో, ఆఖర్లో వికెట్లు పడ్డా కోహ్లీ, యువీ.. ఏ మాత్రం కంగారు పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు. లంక ఫైనల్ ఆశలు మరింత క్లిష్టంగా మారుస్తూ భారత టైటిల్ ఫైట్‌కు దూసుకెళ్లింది. గత టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇదే శ్రీలంకపై జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమికి కారణమై జట్టులో చోటు కోల్పోయిన యువీ.. లంకేయులపై మెరుపులు మెరిపించడం కొసమెరుపు..!
మిర్పూర్: ఆసియాకప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా మూడో విజయంతో ధోనీసేన హ్యాట్రిక్ కొట్టింది. దీంతో పాటు మరో మ్యాచ్ మిగిలుండానే ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగిన తమ మూడో లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకపై ఐదు వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని భారత మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఆరంభంలోనే ఓపెనర్లు శిఖర్ ధవన్ (1), రోహిత శర్మ (15) వికెట్లు కోల్పోవడంతో కాస్త కంగారు పడ్డా.. డాషింగ్ బ్యాట్స్‌మన్, ఛేజింగ్ కింగ్ కోహ్లీ (47 బంతుల్లో 7 ఫోర్లతో 56 నాటౌట్) మరో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయం కట్టబెట్టాడు. రీ ఎంట్రీలో ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపని వెటరన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. లంక బౌలర్లలో నువాన్ కులశేఖర రెండు వికెట్లు తీశాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 138 పరుగులు చేసింది. కపుగెదెర (30), సిరివర్దన (22) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (18), దిల్షాన్ (18) జట్టును ఆదుకోలేకపోయారు. చివర్లో తిసార పెరీర (6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 17) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత బుమ్రా, హార్దిక్ పాండ్యా, అశ్విన్ తలో రెండు వికెట్లు తీసి లంకను కట్టడి చేశారు. విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ విజయంతో మొత్తం ఆరు పాయింట్లతో భారత ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈతో టీమిండియా పోటీ పడనుంది.
రో‘హిట్’ జోడీ ఫెయిల్.. కోహ్లీ కమాల్..
లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం భారతకు ఎంతో సేపు నిలవలేదు. లక్ష్య ఛేదనకు దిగిన ఓపెనర్లను వరుస ఓవర్లలో అవుట్ చేసిన కులశేఖర భారతను దెబ్బ కొట్టాడు. పెద్దగా ఫామ్‌లోలేని ధవన్.. కులశేఖర వేసిన గుడ్‌లెంగ్త్ బంతిని కవర్స్ దిశగా పుష్ చేయబోగా అది ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడింది. మూడు ఫోర్లు కొట్టి జోరు మీదున్న రోహిత స్లిప్‌లో కపుగెదెరకు చిక్కాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ, రైనాతో కలిసి స్కోరుబోర్డును నడిపించాడు. కోహ్లీ సులభంగా బౌండ్రీలు రాబట్టగా, రైనా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సహకరించాడు. అయితే అప్పటిదాకా కూల్‌గా ఆడిన రైనా.. షనక బౌలింగ్‌లో భారీషాట్ ఆడబోయి కులశేఖరకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు వీరిద్దరి 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
యువీ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
రైనా నిష్క్రమణతో క్రీజులోకొచ్చిన సీనియర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ చాన్నాళ్ల తర్వాత తనలోని హిట్టర్‌ను మేల్కొలిపాడు. తానెదుర్కొన్న రెండో బంతినే బౌండ్రీకి పంపిన యువీ.. హెరాత్ వేసిన 13వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. పెరీర బౌలింగ్‌లోనూ భారీ సిక్సర్ బాదాడు. అయితే పెరీర వేసిన 17వ ఓవర్లో బౌండ్రీ కొట్టిన యువీ తర్వాతి బంతికే హుక్ షాట్ ఆడి ఫైన్‌లెగ్‌లో కులశేఖరకు చిక్కాడు. తర్వాతి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా (2)ను హెరాత బౌల్డ్ చేశాడు. చివరి రెండు ఓవర్లలో జట్టు విజయానికి 14 పరుగులు అవసరమ్యాయి. సిరివర్దన బౌలింగ్‌లో ధోనీ (7 నాటౌట్) బౌలర్ తలమీదుగా సిక్సర్ రాబట్టగా, ఐదో బంతిని బౌండ్రీకి తరలించిన కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి ఓవర్ రెండో బంతికి మరో బౌండ్రీతో విరాట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
లంక ఢమాల్: అంతకుముందు టాస్ నెగ్గిన ధోనీ లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వెటరన్ పేసర్ ఆశీష్ నెహ్రా తన రెండో ఓవర్లోనే ఓపెనర్ దినేశ్ చాందిమల్ (4)ను అవుట్ చేయగా, తర్వాతి ఓవర్లోనే బుమ్రా గుడ్ లెంగ్త్ బంతితో జయసూర్య (3)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక రెండు ఫోర్లు కొట్టి జోరందుకున్న దిల్షాన్‌ను తన తొలి బంతికే పాండ్యా అవుట్ చేశాడు. కాసేపు పోరాడిన కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌నూ క్లీన్‌బౌల్డ్ చేసి లంకను కోలుకోలేని దె బ్బకొట్టాడు. ఈ దశలో కపుగెదెర, సిరివర్దనె జట్టును ఆదుకు నే ప్రయత్నం చేశారు. అయితే సిరివర్దనను అవుట్ చేసిన అశ్విన్ ఈ జోడీని విడదీశాడు. అదే ఓవర్లో షనక (1) రనౌటయ్యాడు. ఇక బుమ్రా బౌలింగ్‌లో పాండ్యా పట్టిన మంచి క్యాచ్‌కు కపుగెదెర వెనుదిరిగాడు. అయితే క్రమంగా వికెట్లు పడగొట్టినా చివర్లో బౌలర్లు పరుగులు ఇచ్చుకున్నారు. ఆఖర్లో పెరీర వేగంగా ఆడి లంకకు గౌరవప్రద స్కోరందించాడు.
ధోనీ కీపింగ్ భళా
బ్యాట్స్‌మన్‌గా మునుపటిలా రాణించలేకపోతున్న కెప్టెన్ ధోనీ కీపింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. వికెట్ల వెనుకాల చురుగ్గా కదులుతూ.. ప్రత్యర్థులను దెబ్బ కొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన ధోనీ, ఒక రనౌట్, స్టంపౌట్ చేసి నాలుగు వికెట్లలో భాగస్వామి అయ్యా డు. ముఖ్యంగా చివర్లో భారీ షాట్లు కొడుతున్న పెరీరను మహీ స్టంపౌట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్! 19వ ఓవర్లో అశ్విన్ వైడ్ బంతికి పెరీర క్రీజు వదిలి ముందుకెళ్లి ఆడబోగా, మహీ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. ధోనీలో కాన్ఫిడెన్స్ చూసిన పెరీర అంపైర్లు చెప్పకముందే పెవిలియన్ బాట పట్టాడు. దటీజ్ ధోనీ..!
స్కోరుబోర్డు
శ్రీలంక: చాందిమల్ (సి) ధోనీ (బి) నెహ్రా 4, దిల్షాన్ (సి) అశ్విన్ (బి) పాండ్యా 18, షెహాన్ జయసూర్య (సి) ధోనీ (బి) బుమ్రా 3, కపుగెదెర (సి) పాండ్యా (బి) బుమ్రా 30, మాథ్యూస్ (బి) పాండ్యా 18, సిరివర్దన (సి) రైనా (బి) అశ్విన్ 22, షనక (రనౌట్) 1, తిసార పెరీర (స్టంప్ట్) ధోనీ (బి) అశ్విన్ 17, కులశేఖర (రనౌట్) 13, చమీర (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 138/9, వికెట్ల పతనం: 1-6, 2-15, 3-31, 4-57, 5-100, 6-104, 7-105, 8-125, 9-138.
బౌలింగ్: నెహ్రా 4-0-23-1, బుమ్రా 4-0-27-2, హార్దిక్ పాండ్యా 4-0-26-2, యువరాజ్ 1-0-3-0, జడేజా 2-0-19-0, అశ్విన్ 4-0-26-2, రైనా 1-0-9-0.
భారత్: ధవన్ (సి) చాందిమల్ (బి) కులశేఖర 1, రోహిత్ (సి) కపుగెదెర (బి) కులశేఖర 15, కోహ్లీ (నాటౌట్) 56, రైనా (సి) కులశేఖర (బి) షనక 25, యువరాజ్ (సి) కులశేఖర (బి) పెరీర 35, హార్దిక్ పాండ్యా (బి) హెరాత 2, ధోనీ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు: 1 , మొత్తం: 19.2 ఓవర్లలో 142/5; వికెట్ల పతనం: 1-11, 2-16, 3-70, 4-121, 5-125.
బౌలింగ్: మాథ్యూస్ 3-0-16-0, కులశేఖర 3-0-21-2, తిసార పెరీర 4-0-32-1, చమీర 4-0-27-0, హెరాత 3.2-0-26-1, షనక 1-0-7-1, సిరివర్దన 1-0-13-0.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment