1) ఈపీఎఫ్ మదుపులో 60 శాతం మొతాన్ని నెలవారీ స్థిర ఆదాయ(యాన్యుటీ) ఫండ్‌లలో పెట్టుబడిగా పెట్టకపోతే ఈపీఎఫ్ మదుపు మొత్తంపై వచ్చే వడ్డీ మీద పన్ను వేయాలని, ఈపీఎఫ్‌లో దాచుకున్న ‘అసలు’ మీద వేయొద్దని విజ్ఞప్తులు అందాయి.
2) జాతీయ పెన్షన్ పథకంలో యాజమాన్య వాటా మీద ఎలాంటి పరిమితులు లేనందున ఈపీఎఫ్‌లో యాజమాన్య వాటా మీద కూడా పరిమితులు విధించరాదని వినతులు అందాయి.
ఈ రెండు అంశాలను ఆర్థిక మంత్రి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని ఆర్థిక శాఖ తెలిపింది.
దిల్లీ: ఈపీఎఫ్ మదుపు మొత్తాల ఉపసంహరణ మీద పన్ను విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవడంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ అంశంపై తాజా బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించాలని వస్తున్న డిమాండ్లను పరిశీలిస్తామని ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పీపీఎఫ్ పొదుపు మొత్తాలకు ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది. వడ్డీపైనే పన్ను వేస్తామని సూత్రప్రాయంగా తెలిపింది. 2016 ఏప్రిల్ 1 తర్వాత ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) ఉద్యోగి ఖాతాకు జమ అయ్యే మొత్తాల్లో 60 శాతం సొమ్ము ఉపసంహరణ సమయంలో పన్ను పరిధిలోకి వస్తుందని తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రైవేటు ఉద్యోగుల్లో అధికాదాయ వర్గాలు ఈపీఎఫ్ నుంచి అత్యధికంగా లబ్ధి పొందకుండా చూసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నామని, 3.7 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారుల్లో అత్యధికులకు తాజా నిర్ణయం ప్రభావం ఏమీ ఉండదని చెప్పింది. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, రెవెన్యూ కార్యదర్శి హష్‌ముఖ్ ఆధియాలు విడివిడిగా వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 1 తర్వాత జమ అయిన సొమ్ముపై వడ్డీకి మాత్రమే పన్ను నిబంధన వర్తిస్తుందని, ఈపీఎఫ్ పొదుపును పన్ను పరిధిలోకి తెచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో మాత్రం... ‘వడ్డీపై మాత్రమే పన్ను’ వేయాలని పలువురు ప్రతిపాదించారని, ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. రూ.15 వేల లోపు జీతం వచ్చే వారిపై ఎలాంటి భారం పడదని, అయినా ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని జయంత్ సిన్హా తెలిపారు. ఎక్కువ మంది నిరసన వ్యక్తం చేసినందున ప్రభుత్వం పునః పరిశీలిస్తోందని, నిర్ణయం కోసం ఎదురు చూద్దామని వ్యాఖ్యానించారు.
ఈపీఎఫ్ వడ్డీపై మాత్రమే పన్ను విధించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని, ఇతర డిమాండ్లను తోసిపుచ్చవచ్చని రెవెన్యూ కార్యదర్శి అభిప్రాయపడ్డారు. రెవెన్యూ కార్యదర్శి ఉదయం విలేకరులతో మాట్లాడినపుడు ఈ విషయాన్ని ఏకంగా ధ్రువీకరించారు. సాయంత్రం ఇది తన అభిప్రాయం మాత్రమేనన్నట్లు చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో ఉన్న నేపథ్యంలో వడ్డీపై మాత్రమే పన్ను అనే తాజా నిర్ణయాన్ని బయట అధికారికంగా చెప్పడం లేదని భావిస్తున్నారు. మొత్తం మీద ఏప్రిల్ 1 తర్వాత ఈపీఎఫ్‌లో మదుపు చేసిన మొత్తంపై వచ్చే వడ్డీలో 60 శాతం పన్ను పరిధిలోకి వస్తుందన్నది రెవెన్యూ కార్యదర్శి వ్యాఖ్యల సారాంశం. ఏప్రిల్ 1కి ముందు ఈపీఎఫ్‌లో జమ అయిన అసలు, వడ్డీలకు డబ్బులు వెనక్కి తీసుకొనే సమయంలో ఎలాంటి పన్నూ వర్తించదని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెవెన్యూ కార్యదర్శి పేర్కొన్నారు. బడ్జెట్‌లోని ప్రతిపాదన ఉద్యోగులను జీవిత కాల స్థిర ఆదాయాన్నిచ్చే యాన్యుటీ ఫండ్‌ల వైపు మళ్లించే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇందులో ప్రభుత్వానికి ఆదాయ ఆర్జన ఉద్దేశం లేనేలేదన్నారు. ఈపీఎఫ్‌లో మొత్తం 3.7 కోట్ల మంది చందాదారులు ఉండగా, అందులో 3 కోట్ల మంది రూ.15 వేలలోపు జీతం వచ్చేవారేనని, వారిపై ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రభావం శూన్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈపీఎఫ్ మొత్తాలను యాన్యుటీకి మళ్లిస్తే ఉద్యోగి మరణించినా యాన్యుటీ స్థిరాదాయం అతని జీవిత భాగస్వామికి, తదనంతరం వారసులకు యాన్యుటీ మొత్తం ఎలాంటి పన్ను లేకుండా బదిలీ అవనుందని వివరించింది. ఈపీఎఫ్‌లో యాజమాన్య వాటా ఏడాదికి రూ.1.5 లక్షలు దాటితే ఈపీఎఫ్ పన్ను రాయితీ వర్తించదని ఆర్థిక మంత్రి తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో పనిచేసే బీఎంఎస్ సహా కార్మిక సంఘాలన్నీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ద్వంద్వ పన్నుతో కార్మికులపై ప్రభుత్వం దాడి చేస్తోందని దుమ్మెత్తి పోశాయి.
పింఛను కోసమే పన్ను
ఈపీఎఫ్‌పై పన్ను ప్రతిపాదనను సరిగా అర్థం చేసుకోలేదని జైట్లీ వివరణ
దిల్లీ: ఉద్యోగుల ఈపీఎఫ్ మొత్తాలకు సంబంధించిన పన్ను ప్రతిపాదనలపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వివరణ ఇచ్చారు. ప్రతిపాదిత పన్నును ఉపసంహరించాలని మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ ఎంపీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అయితే.. సదరు నిర్ణయం వెనకున్న ఉద్దేశం, లక్ష్యం వివరిస్తూ జైట్లీ ఎంపీలకు నచ్చజెప్పేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. పాశ్చాత్య దేశాల మాదిరిగా భారత్‌ను పింఛనుతోకూడిన సమాజంగా మార్చాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. భారత్‌లో ప్రైవేటు రంగం పింఛనురహిత సమాజమనీ, ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు తమ ఈపీఎఫ్ డబ్బులన్నీ తీసేసుకుని ఇల్లు, వివాహం, వాహనాల కొనుగోలు, ఇతరత్రా ఖర్చులకు వెచ్చిస్తున్నారనీ, నిర్లక్ష్యపూరిత వ్యయాల్ని పరిహరించేందుకే ప్రభుత్వం పన్ను ప్రతిపాదన తీసుకొచ్చిందనీ, దీనితో ఆ డబ్బుల్ని ఎవరూ ముట్టుకోరని జైట్లీ వివరణ ఇచ్చినట్లు సమాచారం. 40 శాతం డబ్బులు ఉపసంహరించిన తర్వాత మిగతా 60 శాతం బ్యాంకులోనే ఉంచుతారనీ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మంచి వడ్డీ వస్తుందనీ, అది పింఛనులా ఉపయోగపడుతుందనీ, ఆ పింఛను వారి పిల్లలకూ కొనసాగుతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పంటబీమా పథకంలోకి గరిష్ఠంగా రైతులు... ప్రధాని: సాధ్యమైనంత ఎక్కువ మంది రైతుల్ని కొత్త పంటబీమా పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్డీఏ ఎంపీలను కోరారు. గంటకుపైగా జరిగిన ఎంపీల సమావేశంలో మోదీ మధ్యలో జోక్యం చేసుకుని.. కొత్తగా ప్రకటించిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకం ప్రయోజనాల్ని రైతులకు చేర్చాలని ఎంపీలను కోరారు. తమ నియోజకవర్గాల్లో దీన్నొక సవాలుగా తీసుకోవాలని సూచించారు. సమావేశానికి హాజరైన భాజపా అధ్యక్షుడు అమిత్‌షా స్పందిస్తూ.. బడ్జెట్ రైతులకు, పల్లెలకు అనుకూలంగా ఉందని ప్రశంసించారు.
స్మృతికి వెంకయ్య ప్రశంసలు: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జేఎన్‌యూ, హెచ్‌సీయూ ఉదంతాల్ని ప్రస్తావించి, విపక్షాల ఆరోపణల్ని ఖండించాలని సభ్యులను కోరారు. పార్లమెంటులో హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతి ఇరానీ ఇచ్చిన స్ఫూర్తిదాయక సమాధానాన్ని ప్రశంసించగా, సభ్యులంతా చప్పట్లతో అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ లోక్‌సభలో బుధవారం సమాధానం ఇస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు వ్యవసాయ రంగం, ఆర్థిక సమ్మిళితం, సామాజిక భద్రత, పంటబీమా, ముద్రా బ్యాంకు, భారత్‌లో తయారీ, దళితులు, మహిళలు,యువత సాధికారత, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన 60 కొత్త కార్యక్రమాలకు సంబంధించిన గణనీయ ఫలితాలను వివరించి మరో 60 అంశాలపై తదుపరి సమావేశంలో వివరించనున్నట్లు పేర్కొన్నారు. జన్‌ధన యోజన కింద భారీ సంఖ్యలో తెరిచిన బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయని విపక్షాలు చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ.. 20.72 కోట్ల ఖాతాలు తెరవగా, 10 కోట్ల ఖాతాలు మహిళల పేరిటే ఉన్నాయన్నారు. మొత్తం డిపాజిట్లు రూ.33,379 కోట్ల మేర ఉన్నాయని వివరించినట్లు సమాచారం. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను కాంగ్రెస్, వామపక్షాలు అకారణంగా లక్ష్యంగా చేసుకున్నాయనీ, పేదలు, బలహీనవర్గాలకు ఆయన రెండు దశాబ్దాలుగా చిత్తశుద్ధి, అంకితభావంతో సేవలందిస్తున్నారన్నారు.
* శివసేన ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. సమాచార లోపం ఉందని ఆ పార్టీ ఎంపీ ఆనందరావు అడ్సుల్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ విలేకరులతో మట్లాడుతూ.. బడ్జెట్ పల్లెలు, రైతులు, యువతను సాధికారత పరిచేదిగా ఉండటంతో ఎంపీలంతా ఉత్సాహంగా ఉన్నారన్నారు.తొలిసారిగా వ్యవసాయరంగానికే అంకితమిచ్చిన బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. భాజపా సభ్యులు కూడా కొంతమంది విపక్ష నేతలపై సభాహక్కుల తీర్మానం ఇవ్వనున్నట్లు తెలిపారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment