లాహోర్: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి పాకిస్థానీ అభిమాని టైలర్ దారెజ్ బెయిల్ తీర్పును పాకిస్థాన్ కోర్టు వాయిదా (రిజర్వు) వేసింది. విరాట్ కోహ్లిపై ప్రేమతో భారత గణతంత్ర దినోత్సవం రోజున దారెజ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో తన ఇంటిపై భారతీయ జెండాను ఎగురవేశాడు. పాక్ శిక్షాస్మృతిలో సెక్షన్ 123ఏ ప్రకారం దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించాడని అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
పదేళ్ల జైలుశిక్ష ఎదుర్కొనే అవకాశమున్న ఈ కేసులో పోలీసుల రిమాండ్‌లో ఉన్న దారెజ్ బెయిల్ కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో కోహ్లి అద్భుత ప్రదర్శనకు ముగ్ధుడినై, అభిమానంతో ఇంటిపై జెండా ఎగురవేశానని కోర్టుకు తెలిపాడు. తనను గూఢచారిగా అనుమానించవద్దని క్షమాపణలు వేడుకున్నారు. జెండా ఎగురవేసినందుకు శిక్షిస్తారన్న సంగతి తనకు తెలియదని విచారణలో న్యాయమూర్తికి తెలిపారు. వాదనలు విన్న పంజాబ్‌లోని ఒకారా జిల్లా కోర్టు న్యాయమూర్తి అనిఖ్ అన్వర్ మంగళవారం బెయిల్ తీర్పును రిజర్వులో ఉంచారు.
దారెజ్ తరఫు న్యాయమూర్తి ఆమిర్‌భట్టి వాదనలు వినిపిస్తూ... తన కక్షిదారుడు కోహ్లిపై ప్రేమతోనే జెండా ఎగరవేశాడని అన్నారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ సమయంలో అర్జెంటీనా, బ్రెజిల్ జాతీయ పతాకాలను ఇళ్లపై ఎగరేసిన ఘటనను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోరన్నారు. దీనిని క్రీడాస్ఫూర్తిగా భావిస్తారని వాదించారు. ఇదీ అలాంటి కేసేనని అన్నారు. కాగా పాకిస్థాన్‌లోని కొందరు జర్నలిస్టులు, సామాజిక కార్యర్తలు దారెజ్‌ను క్రీడా ప్రేమికుడిగా అర్థం చేసుకొని విడుదల చేయాలని తమ గళం వినిపిస్తున్నారు.
Post a Comment