హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా జీన్ ప్యాంట్ల గురించి తెలియని వారుండరు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో పిల్లలు, యువతీ యువకులతో పాటు వృద్ధులు సైతం జీన్స్ అంటే ఒక క్రేజ్ ఉంది. అందరూ ధరిస్తున్న జీన్స్ లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అందరూ సాధారణంగా గమనించేదే... కానీ అదెందుకు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఎవరైనా దర్జీ వద్ద షర్ట్, ప్యాంటు ఇంకేదైనా కుట్టిస్తే రహస్యంగా కొన్ని పాకెట్స్ కుట్టించుకునే అలవాటు ఉన్న వారు కూడా ఉంటారు.
కానీ జీన్స్ విషయంలో అలా కాదు. అదేమంటే... జీన్స్ ముందు భాగంలో ఉంటే (పాకెట్) జేబులో మరో చిన్న పాకెట్ కూడా ఉంటుంది. అది కూడా ప్యాంటు కుడివైపు ఉండే పాకెట్ లో మాత్రమే. ప్రపంచంలో ఏ జీన్స్ చూసినా ముందుండే పెద్ద పాకెట్ లో పైకి కనిపించే విధంగా ఓ చిన్న పాకెట్. అది చతురస్రాకారంలో కనిపిస్తుంటుంది. ఆ చిన్న పాకెట్ కు కూడా రెండు వైపులా బలమైన బటన్స్ తో ఉంటుంది. అది జీన్స్ ప్రత్యేకత. అయితే ఆ చిన్న పాటి పాకెట్ ఎందుకోసం. ఈ విషయం చాలా మందికి తెలియదు. దాని ఉపయోగమేంటో కూడా తెలియదు. దీనిపై లోతుగా వెళితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీన్స్ అభిమానులకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేదని తేలింది.
ఒక మిస్టరీగా మారిన ఈ చిన్న సైజు పాకెట్ పై అమెరికాకు చెందిన ఒక ఫోరం తన బ్లాగ్ ద్వారా దీనిపై ఒక సర్వేను నిర్వహించింది.
ఇంతకూ ఆ బుల్లి పాకెట్ ఎందుకో తెలుసా... అందులో గడియారం (వాచ్) పెట్టుకోవడానికట. గతంలో వ్యాపారాలు చేసే వాళ్లు తమ జాగ్రత్త కోసం, లేదా పశువుల కాపరులు, గుర్రాలపై స్వారీ చేసే పనిలో ఉండే వాళ్లు, కౌబాయ్ లా తిరిగేవాళ్ల అవసరాల కోసం తమ గడియారాన్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ప్రముఖ జీన్స్ సంస్థ లెవిస్ స్ట్రాస్ ఈ బుల్లి పాకెట్ కు శ్రీకారం చుట్టిందట.
పూర్వం 1800 శతాబ్దంలో కౌవ్ బాయ్స్ పొడవాటి చైన్ తో కూడిన వాచ్ లను వాళ్లు ధరించే కోటులోపలి పాకెట్ లో వేసుకోవడం అలవాటు. అయితే అప్పట్లో పదే పదే వాటిని తీసి చూసుకోవడంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ బుజ్జి పాకెట్ రూపకల్పన చేసినట్టు లెవిస్ తెలియజేసింది. పాత కాలంలో చైన్ కలిగి ఉండే వాచ్ లను ఈ బుల్లి పాకెట్ లో దాచుకోవడం అలవాటుగా ఉండేది. ఇప్పుడు చైన్ వాచ్ లకు కాలం చెల్లింది.
ఈ తరం వారికి ఆ విషయం పెద్దగా తెలియకపోవచ్చు... కానీ చాలా మంది కుర్రకారుకు ఇప్పుడు ఆ బుల్లి పాకెట్ మరో రకంగా ఉపయోగపడుతోంది. నాణాలను అందులో కుక్కేస్తున్నారు. భద్రంగా ఉంటుందని... కీ చైన్ లేకుండా ఉండే కీ ఉన్నా.. ఎస్డీ కార్డు, సిమ్ కార్డు, యూఎస్బీ వంటి చిన్నచిన్నవెన్నో ఆ బుల్లి పాకెట్ లో వేసుకుంటున్నారు. ఏదేమైనా... ఏళ్లు గడిచినా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఆ బుల్లి పాకెట్ మాత్రం ఉపయోగ పడుతూనే ఉంది.
Post a Comment