‘కలిసినప్పుడు మాట్లాడుకునే రోజులు కాస్తా.. మాట్లాడుకోవడానికి కలిసే రోజులుగా మారాయి..!’ ‘ఇద్దరు ప్రేమికులు మంచి భార్యాభర్తలు అవుతారో లేదోకానీ, ఇద్దరు మంచి స్నేహితులు మాత్రం మంచి దంపతులవ్వొచ్చు!’ ‘ప్రేమ.. ఓ ఆడా, మగా ఆలూమగలూ కావడంతోనే ఆగిపోకూడదు. సమాజంపై కరుణా, సేవగానూ మారాలి!’
- ఇవన్నీ మెరుపులు!
|
మీ ప్రేమకథ చెప్పండి అని ‘వసుంధర’ ప్రకటించగానే పాఠకురాళ్లు కురిపించిన లేఖల జడివానలో కనిపించిన ప్రేమాక్షర మెరుపులు!! సాధారణంగానే స్త్రీల మనసు చక్కటి భాషకి పట్టుగొమ్మ! ఆ భాషకి భావుకత జోడైతే.... తీపి గుర్తులు తోడైతే.. ఆ రెండింటినీ వలపు విమానం ఎక్కించేస్తే?! ఇలాగే ఉంటుంది. కళ్లు చెదరగొట్టేవీ, చెమర్చేలా చేసేవీ, చనువుతో చిలిపి మాటల చిట్టా విప్పేవీ, అలనాటి ఆరాటాన్ని, పోరాటాన్ని యువతరానికి పాఠాలుగా పట్టించేవీ.. ఇలా వందలాది ప్రేమకథలు!! అన్నింటికీ స్థలం చాలదు కాబట్టి.. పాఠకాసక్తికి పట్టంగట్టే కొన్నింటిని మాత్రమే ప్రచురిస్తున్నాం. ఆస్వాదించండి.. |
అచ్చం అదే సన్నివేశం!
‘‘నేను ప్లేన్‌లో వెళ్తున్నా.. చూస్తే పక్క సీట్లో ఎయిర్‌వాయిస్ ఎండీ సంజయ్ రామస్వామి. హాయ్ అన్నాడు.. నేను కూడా హాయ్ అన్నా. ఆ పరిచయమే మా మధ్య ప్రేమకు దారితీసింది..’’ అంటూ ‘గజిని’ సినిమాలో అసిన్ పాత్ర కల్పన కోతలు కోస్తుంది గుర్తుందా? అచ్చంగా అలాంటి సందర్భమే తన జీవితంలోనూ నిజంగా జరిగిందనీ.. అదే ప్రేమ పెళ్లికి దారితీసిందని చెబుతుంది అసిన్.
ఆ రోజు నాకు బాగా గుర్తు.. ‘హౌస్‌ఫుల్ 2’ సినిమా ప్రచారం కోసం నేనూ, నటుడు అక్షయ్‌కుమార్ విదేశాలకు వెళ్లాలి. అందుకోసం ముంబయిలోని విమానాశ్రయంలో ఓ ప్రయివేటు విమానం ఎక్కాలి. నేను విమానాశ్రయానికి వెళ్లేసరికే అక్షయ్ ఉన్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పా. అతని పక్కన ఓ కొత్త వ్యక్తి. సాధారణంగా నటీనటులు ఎక్కడికయినా వెళ్తున్నప్పుడు తమకు సంబంధించిన వారిని వెంట తీసుకెళ్లడం మామూలే. అక్షయ్ కూడా అలానే తన స్నేహితుడిని తీసుకొస్తున్నాడని అనుకున్నా. అప్పుడు వెంటనే అక్షయ్ ఇతను రాహుల్ శర్మ.. అంటూ పరిచయం చేశాడు. చాలా సాధారణంగా హాయ్, గుడ్‌మార్నింగ్ అని చెప్పి.. ఫ్లయిట్ ఎక్కేశా. ఆ తరవాతే తెలిసింది.. రాహుల్ శర్మ ప్రముఖ మొబైల్ సంస్థ మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడనీ.. సినిమా ప్రచార ఏర్పాట్లు అతనే చేశాడనీ. ఆ వివరాలన్నీ అక్షయ్‌చెబుతూనే.. మీ ఇద్దరి జంట చూడ్డానికి చాలా బాగుంటుంది తెలుసా.. అని ఠక్కున అనేశాడు. నాకు మొదటినుంచీ అక్షయ్ మంచి స్నేహితుడు. దాంతో ఏదో సరదాగా అంటున్నాడని నవ్వేశా తప్ప రాహుల్ గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే తరవాత ఇద్దరం ఒకరి ఫొన్‌నంబర్లు మరొకరం ఇచ్చిపుచ్చుకున్నాం.
ఇంటికొచ్చి చెప్పాడు: అప్పుడప్పుడూ ఫోనుల్లోనే కాదు, రెండుమూడుసార్లు కలిసి మాట్లాడుకున్నాం కూడా. అలాంటప్పుడు ఓసారి రాహుల్ ‘ఇంటికొచ్చి, మీ అమ్మానాన్నల్ని కలవొచ్చా..’ అన్నాడు. సరేననడంతో ఓ రోజు ఇంటికొచ్చాడు. పిచ్చాపాటీ మాట్లడుతూనే ‘మీ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నా..’అనేశాడు. నేనే కాదు, అమ్మానాన్నలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ వాళ్లు తమకే అభ్యంతరం లేదనీ.. అమ్మాయిని అడిగి తెలుసుకోవాలనీ చెప్పారు. అవన్నీ విన్నాక ‘నాకు కొంత సమయం కావాలన్నా.’ అ సమయంలో రాహుల్‌ని తెలుసుకునేందుకూ, అర్థంచేసుకునేందుకు ప్రయత్నించా. నేను పద్నాలుగో ఏట నుంచే నటించడం మొదలుపెట్టా. స్వయంకృషితో వివిధ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్నా. నాలా సొంతంగా స్వశక్తితో ఎదిగేవాళ్లంటే నాకు చాలా ఇష్టం. రాహుల్‌ని గమనిస్తే.. అతనిదీ కష్టపడే తత్వం అని అర్థమైంది. తను చిన్నవయసునుంచే వ్యాపారం చేయడం మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నాడు. తన మొబైల్ సంస్థని ఉన్నత స్థానానికి తీసుకురావడమే అతని లక్ష్యం. ఆ కష్టపడే తత్వం నాకు నచ్చింది. అయినప్పటికీ చాలా నిరాడంబరంగా కనిపిస్తాడు. అవన్నీ గమనించాక అతనే నాకు సరైన జోడీ అని నిర్ణయించుకున్నా. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. ఇంకేముంది.. మా పెళ్లయిపోయింది.. గజినిలోలా కాకుండా పెళ్లితో మా ప్రేమజీవితం ఆనందంగా మొదలైంది.
- అసిన్
ఆ అమ్మాయినే చేసుకుంటానని అనుకోలేదు..
‘గజిని’ సినిమాను చూసిన మా చెల్లెలు ‘ఆ సినిమా నీకు సంబంధించిందే. అలాంటి అమ్మాయినే పెళ్లిచేసుకోవాలి అన్నయ్యా..’ అంది. తరవాత నేనూ ఆ సినిమా చూశా. ఆ సినిమాలో ‘ఎయిర్‌వాయిస్’ మొబైల్ బ్రాండ్ రంగు కాషాయం. తరవాత మా మొబైల్ బ్రాండ్ రంగూ కాషాయంలోకి మార్చాం! ఆ సినిమాలో అమీర్‌ఖాన్ నడిపే కారే నాకూ ఉంది. నేనూ సంస్థను పైకితెచ్చే ప్రయత్నంలో ఉన్నానప్పుడు. అలాంటి సమయంలో అసిన్ పరిచయమైంది. చివరకు ఆ పరిచయం, స్నేహం ప్రేమగా మారింది. చివరకు తననే పెళ్లిచేసుకున్నా. ఇంట్లోవాళ్లు సరదాగా అలాంటి అమ్మాయిని చేసుకోమన్నారు కానీ.. నేను తననే చేసుకునేసరికి అందరూ హ్యాపీ.
- రాహుల్ శర్మ
|
|
వసుధైక కుటుంబం!
అది 1976వ సంవత్సరం.... ఆ రోజు మా నాన్న ముందు నిల్చుని ఉన్నాను. నేనైతే దోషిలా నిల్చోలేదుకానీ.. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ నన్ను అలాగే చూస్తున్నారు. సలీంని పెళ్లాడాలనుకోవడమే నేను చేసిన నేరం.
సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నేను.. ఓ ముస్లింని చేపట్టాలనుకోవడం సమాజం దృష్టిలో నేరమే కదా!! ఆ రోజు నాన్న నన్ను నిలదీశారు.
‘ఆ సాయిబుని పెళ్లాడటమంటే.. మతం మార్చుకోవడమేగా?’ అన్నాడు.
‘కాదు.. ఎవరూ మతం మార్చుకోవడం లేదు. ఎవరి మతాలు వాళ్లం అనుసరిస్తాం!’ చెప్పాం. ‘మరి పిల్లలో..’ అన్నారాయన కోపంతో. ‘మేం వాళ్లని హిందువుగానో.. ముస్లిముగానో పెంచం. భారతీయులుగా పెంచుతాం. చుట్టూ ఉన్నవారిపట్ల ప్రేమా, కరుణ కురిపించడమే మతమని నేర్పుతాం..’ - ఆ మాట చెప్పి ఇంటి నుంచి బయటకొచ్చేశాన్నేను.
చిన్నప్పటి నుంచి వైద్యురాలిని కావాలన్నది నా కల. కాలేజీలో చేరాక గుండె శస్త్రచికిత్స నిపుణురాలిని కావాలనుకున్నా. అక్కడి రాజకీయాలతో సాధ్యంకాలేదు. కానీ నా కల కూలిపోయిందని కుంగిపోలేదు. ప్లాస్టిక్ సర్జరీ వైపు అడుగులేశాను. నా కష్టాలన్నింటా తోడు నిలిచాడు సలీం. 1966లో గుంటూరు వైద్య కళాశాలలో సహవిద్యార్థిగా పరిచయమయ్యాక.. కుటుంబ, కులం, మత కట్టుబాట్లు దాటుకుని పదేళ్లకి పెళ్లి చేసుకున్నాం. అమెరికా వెళ్లిపోయాం. మమ్మల్ని కాదన్నవారి ఎదుటే గొప్పగా సాధించి చూపాలని విజయవాడ వచ్చాం. ‘సల్జా’ ఆసుపత్రి స్థాపించాం. సుమారు ముప్పై రెండేళ్ల వయసున్న మా ఆసుపత్రి ప్లాస్టిక్ సర్జరీలో దేశవ్యాప్త గుర్తింపు సాధించింది. మేం అనుకున్నట్టే పిల్లల్ని మతాలకి అతీతంగా పెంచాం! మా పాప షీనా పీడియాట్రిక్ రేడియాలజిస్టుగా డెట్రాయిట్‌లో స్థిరపడింది. మావాడు అమన్ ముంబయి ఐఐటీలో న్యూరోసైన్సెస్ చేసి లండన్‌కి వెళ్లిపోయాడు. అన్నా ఎలెనాని పెళ్లాడాడు. ఆమె పుట్టుకతో రోమన్ క్యాథలిక్ అయినా.... బౌద్ధం అనుసరిస్తుంది. ఆ మతాచారం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు!! ఇంతకీ మా ఆసుపత్రికి ‘సల్జా’ అనే పేరే ఎందుకు పెట్టాం! అంటే ‘సలీం-లక్ష్మీ జన్మ’ ఈ పదాల సంక్షిప్త రూపమిది. అంటే.. మా ఇద్దరి ప్రేమతో పుట్టిందీ అని!!
- డాక్టర్ లక్ష్మీ సలీం, విజయవాడ.
|
మౌన ప్రేమ నాది..
‘ఇదిగో అబ్బాయి ఫొటో.. దయచేసి చూడు. నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తోందికదా! వద్దూ.. కుదర్దూ అనుకోకుండా పెళ్లికి ఒప్పుకో..!’ అంది అమ్మ. ఆమె అంతగా ప్రాధేయపడ్డా నేను ఆ ఫొటో వంక చూడలేదు. అవును.. అప్పటికే పెళ్లంటేనే విసుగొచ్చేసింది మరి. నాలుగేళ్లుగా నాకు వరుణ్ని వెతికారు. అందరూ వచ్చి చూసి పోవడమే! పెదవివిరవడమే. ఈలోపు నా జీవితంలో సిల్వర్ జూబ్లీ.. అదేనండీ పాతికేళ్లలోకి వచ్చేశా. ఇక నా జీవితంలో ప్రేమా, పెళ్లీ లేవనుకున్నా. అప్పుడే నాకు అమ్మ ఆ ఫొటో తీసుకొచ్చి చూపింది. వద్దు.. వద్దనుకుంటూనే తిప్పి చూశాను. అదిరిపోయాను! నా తమ్ముడి స్నేహితుడు సూరిబాబు అప్పుడప్పుడూ ఇంటికి వస్తుండేవాడు. ఆదర్శభావాలున్న వ్యక్తి. రూపవంతుడు. అలాంటివాడు నన్ను పెళ్లాడటమా..? నమ్మలేకపోయా! ఆ ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే పెళ్లైంది. అంతకు ఏడాది కిందట్నుంచే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడట. ఆయన రాకతో నా జీవితమే మారిపోయింది. తృప్తీ, ఆనందం, సంతోషం, అన్నింటికన్నా తన ప్రేమతో మనసు నిండిపోయింది! మాకు ఒక్కడే అబ్బాయి. తను కరాటే మాస్టర్. దేశంలో అన్ని ప్రాంతాలకు వెళుతుంటాం మేము! ఓ రకంగా ఈ ప్రపంచాన్ని తన ప్రేమతో నేను కొత్తగా చూడగలిగాను! అవును.. నాకు ప్రకృతి చూపుని మాత్రమే ఇచ్చింది. నేను ఈ ప్రపంచంలో ఏ చిన్న శబ్దాన్నీ వినలేను. మాట్లాడలేను..! అవి రెండూలేని లోటుని ఆయనా, నా బాబూ భర్తీ చేశారు. నా రెండు కళ్లతో వాళ్లని గుండెల్లో నింపుకుంటున్నాను!!
- పద్మ, కర్నూలు.
|
ఆంధ్రా కేరళీయం..!
అది 1992 ప్రాంతం. నేను ఓ స్వచ్ఛంద సంస్థలో ఏఎన్‌ఎంగా చేరాను. అక్కడ ఆఫీసు అసిస్టెంటుగా చేస్తుండేవాడు అతను. ఆయనది కేరళ. అక్కడి పరిచయం.. ఐదేళ్లలో ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నాం! కానీ కులాలూ, ప్రాంతాల విభజనలూ ఒప్పుకుంటాయా. అస్సలు ఒప్పుకోలేదు. మా ఇంట్లో అయితే నన్ను ఇల్లొదిలి వెళ్లిపొమ్మన్నారు. ఆయనకూ అదే పరిస్థితి. అంతేకాదు.. మా పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ జరిగినా ఆపి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. దాంతో స్వచ్ఛంద సంస్థల వాళ్లే మాకు తోడుగా నిలిచారు. ఏ ప్రాంతంలో పెళ్లవుతుందో మాక్కూడా చెప్పకుండా.. తీసుకెళ్లారు. విద్యాధికులూ, స్వచ్ఛంద సేవకుల మధ్య, ఇరువైపులా తల్లిదండ్రులు, బంధువులెవరూ లేకుండా మా పెళ్లి జరిగింది. నేను తల్లిని కాగానే మా అమ్మ నా చెంతకొచ్చింది. ఆ తర్వాత ఆయన తల్లిదండ్రులూ వచ్చారు. మేం స్వచ్ఛంద సంస్థలో బాగా బిజీ అయిపోయామని.. మా పెద్దవాణ్ని కేరళలోనే పెంచాం. తనిప్పుడు తెలుగూ, మలయాళం రెండూ చక్కగా మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో! మేమిద్దరం కలిసి ‘ఎస్-యూత్ ఎంపవర్‌మెంట్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థని ఏర్పాటుచేశాం. ఇప్పటిదాకా దాదాపు ఐదొందల మంది నిరుద్యోగ యువతకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించి ఉద్యోగాలిప్పించాం!! ప్రేమ.. ఓ ఆడా, మగా ఆలుమగలు కావడంతోనే ఆగిపోకూడదు. అది నలుగురి కోసం కరుణగా, సేవగా మారాలి అని ఇద్దరం ప్రగాఢంగా నమ్ముతున్నాం.
- సునీత, అనంతపురం
|
కృష్ణమ్మే కలిపింది..
కృష్ణమ్మకి అప్పుడు పుష్కరాలు. 1992వ సంవత్సరం. నేనూ, అమ్మ యాత్రికులకు సేవచేసే స్వచ్ఛంద కార్యకర్తలుగా వెళ్లాం. మాది నెల్లూరు జిల్లా కావలి. నాన్న లేరు. మొదటి రోజు అక్కడ ఘాట్‌లో ఒకబ్బాయి కనిపించాడు. సన్నగా, పొడుగ్గా, ‘చిన్నపిల్లోడి’లా ఉన్నా.. చూస్తుండగానే మూడువందల మంది స్వచ్ఛంద సేవకులకు అప్పటికప్పుడే పనులప్పగించి పంపించేశాడు..! వృద్ధులకు స్నానం చేయించే బాధ్యత నాకిచ్చాడు. నాకెప్పుడూ అంతకష్టం అలవాటు లేకపోవడంతో చెట్టుచాటుకి వెళ్లి కూర్చున్నా.. కాసేపు సేదదీరుదామని! తనొచ్చి మందలించాడు. నాకు ఒళ్లుమండి గొడవపెట్టుకున్నా. నన్ను వంట సెక్షన్‌కి వేశారు. భోజనానికి అందరూ వచ్చేవారు కానీ అతను కనిపించేవాడు కాదు. ఏమిటని అడిగితే.. భోజనమే కాదు, రాత్రి నిద్రపోవడం కూడా ఘాట్‌లోనే అని చెప్పారు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడనీ.. మూడేళ్లుగా ఇలా స్వచ్ఛంద సేవకు వస్తున్నాడట. తొలిసారి అతనిపై ఆసక్తి ఏర్పడింది. ఆ తర్వాతెప్పుడో భోజనానికి వస్తే.. ఏమరుపాటున అతని చేతిపై కాలుతున్న సాంబారు పోసేశాను! ‘అప్పటి గొడవ కారణంగా ఇలా పగతీర్చుకున్నాను..’ అని అనుకోలేదు. ఏమీ అనలేదు. ఇంటికెళ్లినప్పటి నుంచి అతని ఆలోచనలే. తిండి సహించలేదు. నిద్రపట్టలేదు. భోరున ఏడ్చిన రోజులున్నాయి.. ప్రేమ బాధ అది! ధైర్యం చేసి అమ్మతో విషయం చెప్పాను. తను వెళ్లి అతణ్ని కలిసింది. ఆయనగారు బెట్టు. ‘చెల్లి పెళ్లి చేయాలి. ఉద్యోగం చూసుకుని పోషించే శక్తి వచ్చినప్పుడు ఆలోచిస్తా. అప్పటిదాకా మీ అమ్మాయికి పెళ్లి కాకపోతే చూద్దాం..’ అన్నాడు. టెక్కు అనిపించింది. కానీ ఎంత బాధ్యతగా ఉన్నాడో కదా! అని తర్వాత ముచ్చటేసింది. ఎన్నేళ్లయినా వేచి ఉంటానని ఉత్తరం రాశాను. అప్పుడప్పుడూ ఫోన్‌లోనూ మాట్లాడుకునేవాళ్లం. తన డిగ్రీ పూర్తైంది. ఇంట్లో అతడికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీంతో, నేను రాసిన లెటర్ ఒకటి.. అతను వాళ్లనాన్నకి కనిపించేలా పెట్టాడు. వాళ్లనాన్న నన్ను చూడటానికి వచ్చాడు!! - అలా ఇద్దరం దంపతులమయ్యాం. ఆయన ఉద్యోగ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. పచ్చడి మెతుకులతో గడిపిన రోజులూ, పస్తులున్న వేళలూ, హాస్పిటల్ ఫీజుకట్టలేక ఇబ్బంది పడ్డ సందర్భాలూ ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే, మా ప్రేమకు ఆ సెగ తగలకుండా కాపాడుకున్నాం. తన కష్టంతో అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడాయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో. నేనూ పిల్లలు, విజయవాడలో. ఆయన ఒక రోజు ఫోన్ చేయకపోతే కోపం, చేయగానే ఐస్. ‘అదేనోయ్.. ప్రేమంటే!’ అంటారాయన. ‘చాల్‌చాల్లేబాబూ...’ అంటా నేను సాంబారు గరిట లేకుండా!
- కామేశ్వరి, విజయవాడ.
|
సైనికుడి ప్రేమ కథ..!
నాకప్పట్లో ముమ్మరంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎంతమంది వస్తున్నా నేను వద్దుంటున్నా..! తన కోసం ఎదురు చూస్తూ ఉన్నా..! అప్పుడొచ్చాడు నాగరాజు. నేరుగా రాజస్థాన్ నుంచి. బీఎస్‌ఎఫ్ జవానుగా! తనని చూడగానే.. నా ప్రాణం లేచొచ్చింది. తను నన్ను నేరుగా పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లాడు. ‘సార్.. ఈమె నా భార్య. నేనులేని సమయంలో తనకి మరో పెళ్లి చేస్తారట!!’ అన్నాడు. నేనూ అదే చెప్పాను. అవును.. నాగరాజు నాకు ఇంటర్ చదివేటప్పుడే పరిచయం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇంట్లోవాళ్లు ముందుగా ఒప్పుకోరని తెలిసి.. గుడిలో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఇంతలో ఆయనకు బీఎస్‌ఎఫ్ నుంచి పిలుపొచ్చింది. పెళ్లయిన రెండురోజులకే శిక్షణ కోసం జోధ్‌పూర్ వెళ్లిపోయాడు. ఇవేమీ తెలియని మావాళ్లు పెళ్లి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్లు ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి ఇద్దరం అలా పోలీసుస్టేషన్‌కి వెళ్లాం. ఇదో వ్యూహం అంతే. మావాళ్లు పోలీసుల్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడే దండలు మార్చుకుని పెళ్లిచేసుకున్నాం. పెళ్లయ్యాక కూడా.. నన్ను సూటిపోటి మాటలూ అంటూ వచ్చారు. దాంతో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశారు. ఓ మెస్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాం! మాకు ముగ్గురూ ఆడపిల్లలే. మొదటి అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, రెండో అమ్మాయి బీయెస్సీ, మూడో అమ్మాయి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతోంది.
- బి. రాధ, కర్నూలు.
|
పాతికేళ్ల తర్వాత అదే బెంచీలో..!
గత ఏడాది ఫిబ్రవరి. నేనూ, మా ఆయనా విజయవాడలోని మా కాలేజీ ఆవరణకెళ్లాం. ఆ బెంచిని గుర్తుపట్టాం! అసలు మరిచిపోతేనే కదా.. గుర్తుంచుకోవడానికీ, ప్రత్యేకంగా గుర్తుపట్టడానికీ!! అది మా గుండెల్లో ఎప్పుడూ పదిలంగా ఉంది కదా! కాకపోతే కాస్త రంగు వెలసి పోయిందంతే! దానిపై కూర్చుని.. పాతికేళ్ల కిందట మేం అదే చోట.. అక్కడే తొలిసారి కలిసిననాటి సంగతులు నెమరేసుకున్నాం. అప్పట్లో నేను ఆ కాలేజీలో దరఖాస్తు చేయడానికి వచ్చా. తను మా కాలేజీ సీనియర్. ఓ స్నేహితురాలి ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఒక రోజు ‘కెమిస్ట్రీ కష్టంగా ఉంది..’ అంటే తను చదువుతున్న ట్యూషన్‌కి తీసుకెళ్లాడు. ఓ రోజు ఇంకేమైనా కోర్సులు చేస్తున్నారా? అని అడిగాడు. ‘టైపింగ్ చేస్తున్నా..’ అని చెప్పా. తర్వాతి రోజు టైప్ రైటింగ్ నుంచి వస్తుంటే గుమ్మంలోనే నిల్చున్నాడు. ఆయన్ని చూసి హడావుడిగా వెళ్లిపోయాను. తన మనసు చివుక్కుమన్నట్టుంది. సారీ చెప్పాను. అలా మాటలు పెరిగాయి. కలిసినప్పుడు మాట్లాడుకునే రోజులు కాస్తా.. మాట్లాడుకోవడానికి కలిసే రోజులుగా మారాయి! తర్వాతి ఏడాది ఆగస్టున అదే బెంచ్ దగ్గరకు తీసుకెళ్లి ‘ప్రేమిస్తున్నాను.. పెళ్లి చేసుకుందామా?’ అన్నాడు. నాకిష్టమున్నా బయటపడలేదు. హఠాత్తుగా ఓ రోజు వాళ్లమ్మ మా ఇంట్లోకి దూసుకొచ్చారు. ‘ఏమిటీ.. నువ్వూ మా అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. నీ ఫొటో వాడి దగ్గరుంది!’ అంటూ నిలదీశారు. నాకెలా వచ్చిందో తెలియదు ఆ ధైర్యం.. ‘అవును! పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాం!’ అన్నాను. ఆమె విసురుగా వెళ్లిపోయారు. చూస్తూ ఉన్న మా అమ్మానాన్నలకి నోటమాటల్లేవు. వాళ్లకి విషయం చెప్పాను. మొదట్లో ఒప్పుకోకున్నా.. ఆ తర్వాత తప్పలేదు!! తన ఇంట్లోనూ అంతే. ఆ వ్యతిరేకత మధ్యే 1992లో మా పెళ్లైంది. మాకు ఆ తేదీకన్నా.. మేం మొదట కలిసిన ఫిబ్రవరే ముఖ్యం. అందుకే ఆ రోజు ఆ బెంచి దగ్గరకెళ్లాం. ఇంకో పాతికేళ్లపాటూ మా ప్రేమ ఇలాగే నిలిచి ఉంటుందని హామీ ఇచ్చాం!!
- కల్యాణీ చౌదరి, విజయవాడ.
|
సాగర తీరాన వలపు పాట..
‘తెలుసా.. మనసా.. ఇది ఏనాటి అనుబంధమో!’ - ఆ గొంతులో ఏముంది విరహమా? విహ్వలతా? - తెలియదు. అలాగే పారవశ్యంలో ఉండిపోయాను. అక్కడ పాడేది కీరవాణో.. బాలునో కాదు.. ‘ఆది’.. అదీ అతిదగ్గరగా!! అందుకే ఆ ఆనందం. నాకిష్టమైన పాట.. తొలిచూపులోనే ఇష్టం ఏర్పడ్డ వ్యక్తి గొంతు నుంచి!! ఆ పాటకాగానే ‘విరించినై విరచించితిని..’ అందుకున్నాడు. ‘ప్రాగ్దిశ వీణియపైన..’ అంటూ ప్రతిపదానికీ అర్థం చెబుతూ పాడుతుంటే ‘అబ్బో సాహితీకారుడు కూడా!’ అనుకున్నా!! - అలా సంగీతం, సాహిత్యాలతో మొదలైంది మా పరిచయం. ఆది నా చిననాటి నేస్తం భారతి వాళ్లక్కయ్య పెళ్లి సందడిలో పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారడానికి అట్టే కాలం పట్టలేదు. నా గురించి ‘హృదయలయలు’ అనే కవితా పుస్తకమే తీసుకొచ్చేంత ప్రేమ తనది!! నన్ను పెళ్లి చేసుకుని తీరాలని.. పట్టుదలగా చదివి వాళ్ల కాలేజీలోనే ఫస్ట్ వచ్చాడు. విశాఖ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం సాధించాడు. మా అమ్మకీ తను బాగా నచ్చాడు. ఇక పెళ్లి విషయం అందరికీ చెబుదామనుకునేంతలో ఆమె గుండెపోటుతో చనిపోయింది. అమ్మపోయిన బాధ ఒకవైపు.. మా ప్రేమకి అండెవరూ అనే బాధ కుంగదీసింది. అనుకున్నట్టే అన్నయ్యా, నాన్నా పెళ్లికి వ్యతిరేకత చెప్పారు. అయితే ఆది వాళ్లింట్లో ఒప్పుకున్నారు. ఈ పన్నెండేళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలూ.. శుభాశుభాలూ చూశాం. దూరమైన నాన్నా, అన్నయ్యలకి మేమే ఇప్పుడు తలలో నాలుక!
- ఇందు, విశాఖ
|
మూడు తరాల ప్రేమ కథ..!
ఎర్రటి ఎండకూడా లేతపచ్చగా కాసే కోనసీమ మాది. ఏలేశ్వరం నా సొంతూరు. ఆ రోజు ‘మొరటోడు’ చిత్రీకరణ జరుగుతోందక్కడ. ఆ సందడి మధ్య తెల్లగా, పొడుగ్గా ఒకబ్బాయి తచ్చాడుతూ కనిపించాడు. అతనూ సినిమా నటుడేమో అనుకుని.. చూస్తూ ఉండిపోయాను. తర్వాత ఆ గోల నుంచి బయటకొచ్చి ఇంటికెళితే.. అక్కడా ఎదురయ్యాడు! అప్పుడే తెలిసింది అతను సినిమా నటుడు కాదని. మా పిన్ని వాళ్ల స్నేహితుల అబ్బాయని!! పేరు ఫజల్ ముస్తఫా(ఆబుజీ).. అవును ఆయన ముస్లిం. మేం క్రైస్తవులం. మా ప్రేమకి మతాలు అడ్డుకాలేదు. కానీ పెళ్లికి? మా ఇంట్లోవాళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అత్తింటివారి అండదండలతో పెళ్లైంది. ఇంతకీ మా మావయ్యా, అత్తయ్యలదీ ప్రేమవివాహమే! ఇద్దరూ ముస్లిములే కానీ.. అత్తయ్యవాళ్లు టర్కీ ఇస్లాములు. ఆమె ప్రోత్సాహంతోనే బీఈడీ, ఎంఏ చేశాను. మున్సిపల్ బడిలో ఉపాధ్యాయినిగా చేరి.. ఇప్పుడు ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. మా ఆయనవాళ్లు రెండుతరాలుగా సలాం ఆసుపత్రి నడుపుతున్నారు. మా వాడూ, కోడలు దాన్ని అందిపుచ్చుకున్నారు. చెప్పడం మరిచిపోయా.. మావాడు వైద్యవిద్య చదివేటప్పుడే ఓ అమ్మాయిని ప్రేమించాడు. తను హిందువు. మా కుటుంబానికి తనని కోడలిగా పంపిస్తారా? అని సందేహించాం. వాళ్లు పెద్ద మనసుతో ఒప్పుకున్నారుకానీ.. పెళ్లి మాత్రం తమ సంప్రదాయంలోనే ఉండాలన్నారు! మతాలూ, సంప్రదాయాలూ ఎలా ఉంటే ఏముంది.. ఇష్టపడ్డ జంట ఒకటి కావాలికానీ?! ఆనందంగా అంగీకరించాం. ప్రతిరోజూ నమాజు చదివే మావాడు బాసికం కట్టి పంచె చుట్టి.. హిందూ పెళ్లి మంత్రాలు చదువుతుంటే ఎంత ముచ్చటేసిందో!!
- శిరోమణి, అమలాపురం
|
చిత్తూరు చట్నీ రుచి..
‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను..’ అని ఎవరైనా అబ్బాయి అంటే అమ్మాయిలందరూ పరవశించి పోరు. ఆనందంకన్నా అలజడీ, అభద్రతా, గందరగోళం అన్నీ ఒక్కసారిగా ఏర్పడతాయి వారిలో. పదిహేడేళ్ల కిందట నా పరిస్థితీ అదే. ‘నాకు నువ్వు కావాలి..’ అంటూ ఓ లెటర్ రాసి నా చేతిలో పెట్టాడు నా బ్యాచ్‌మేట్. ఆ అలజడి నుంచి కోలుకుని ఆలోచించడం మొదలుపెట్టా. మేం ఒకటి కావడానికి ఎన్ని సమస్యలున్నా.. ప్రధాన అడ్డంకి మతమే! కాబట్టి తన ప్రతిపాదనని సున్నితంగా తిరస్కరిద్దామనుకున్నా. ‘మతాల సంగతి నేను ఆలోచించలేనా? మనం ఛేదించుకుని వెళ్లగలమనే ధైర్యం, స్పష్టతా నాకున్నాయి. నీకిష్టముంటే జీవితంలో ఒకటవుదాం. లేకపోతే స్నేహితులుగా ఉండిపోదాం!’ అని చెప్పాడు. నాకు ‘నో’ చెప్పడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదు. కాలేజీ అయ్యాక నేను ఎమ్మెస్సీ కోసం హైదరాబాద్, తను ఎంబీఏ కోసం గుజరాత్ వెళ్లిపోయాం. స్థిరపడటానికి నాలుగేళ్లుపడతాయనుకుంటే ఆరేళ్లు పట్టింది! పెళ్లికి పెద్దల్ని ఒప్పించడమే ఇక మిగిలింది. డబ్బులూ, దర్పాలూ, ఆర్భాటాలూ, టన్నుల కొద్ది ఈగోలూ ఉన్న మా పెద్దవాళ్లని ఒప్పించడానికి తను చాలానే కష్టపడ్డాడు. 2005లో పెళ్లయ్యాక.. ఆనందంగా హైదరాబాద్‌లో దిగాం. అప్పటికిగానీ మాకు గుర్తురాలేదు.. ఇద్దరం ఉండటానికి ఇల్లులేదని! వారం రోజులు ఓ హోటల్‌లో ఉండి అద్దె ఇల్లు చూసుకున్నాం. తను మూడేళ్లు ఓ ఫైనాన్స్ కంపెనీలో చేసి.. తన సీనియర్స్ పెట్టిన కంపెనీలో భాగస్వామిగా చేరతానన్నాడు. బాబు పుట్టిన వేళ.. ఇంత సాహసాలు ఎందుకని భయపడ్డా తనపై నమ్మకంతో ప్రోత్సహించా. రెండేళ్ల తర్వాత నేనూ ఓ బహుళజాతి కంపెనీలో అనలిస్ట్‌గా చేరా. మావారు లావణ్య కుమార్‌తో నాకెప్పుడూ సమస్యలేదుకానీ.. పిజ్జాలో కూడా చట్నీ వేసుకుని తినాలనుకునే చిత్తూరు అలవాటే ఒక్కోసారి చిరాకు తెప్పించి.. ఆటపట్టిస్తుంటా!! తను నాకు ప్రేమ ప్రపోజ్ చేసిన పదిహేడేళ్ల తర్వాత నాకు అనిపించే విషయం ఇదే.. ‘ఇద్దరు ప్రేమికులు మంచి భార్యాభర్తలు అవుతారో లేదోకానీ, ఇద్దరు మంచి స్నేహితులు మాత్రం మంచి దంపతులవ్వొచ్చు..!’ అని!
- అంజనా, హైదరాబాద్
|
ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉంది..
మా పెళ్లయి పది సంవత్సరాలైంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు, అనుభవాలు. రెండక్షరాల ప్రేమంటే ఆషామాషీ కాదు. రెండు మనసులు కలవడంతో పాటూ రెండు కుటుంబాలూ దగ్గరవ్వాలి. కులాల అడ్డుగోడలను తొలగించుకోవాలి. ఇందుకు మేము ఎంతగానో కష్టపడ్డాం. చివరికి అందరినీ ఒప్పించి మా ప్రేమను గెలిపించుకున్నాం.
భగవాన్ నన్ను తొలి చూపులోనే ఇష్టపడ్డాడు. చాలాకాలం నన్ను ప్రేమించాడు. నాకూ తనంటే ఇష్టమే. అలాగని మేం ఆర్థికంగా స్థిరపడకుండా పెళ్లి కోసం తొందరపడలేదు. భగవాన్‌కి ఉద్యోగం వచ్చాక మా ఇంటికొచ్చి ‘మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’ అని అడిగాడు. ‘అబ్బాయి మంచి వాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇష్టపడ్డ అబ్బాయితో అమ్మాయి సుఖంగా ఉంటుంది’ అనుకున్న అమ్మానాన్నా పెళ్లికి సరే అన్నారు. భగవాన్ తరఫు వారు మాత్రం ‘మన కులం కాదు కదా’ అంటూ మా పెళ్లికి ఒప్పుకోలేదు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకరికొకరం అండగా నిలబడి పెళ్లి పీటలెక్కాం. మా సంసారం చూసి అందరూ మెచ్చుకోవాలన్నట్టు బాధ్యతగా వ్యవహరించాం. అత్తింటి వాళ్లు ‘అమ్మాయి మనతో చక్కగా కలిసి పోయింది’ అనుకునేలా మసలుకున్నాను. మేము ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపుకోం. లోపాలు సహజం, వాటి గురించి ఆలోచిస్తే సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. మమ్మల్ని చూసి మా కుటుంబంలో చాలామంది ప్రేమ వివాహం చేసుకున్నారు. నాన్న తీసుకున్న నిర్ణయం తప్పు కాదని మేం నిరూపించగలిగాం.
కుటుంబ పోషణకు ఉద్యోగం ఉండాలి. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తట్టుకునే ఆత్మస్థైర్యం ఉండాలి. ఒకరికొకరు ఎల్లప్పుడూ అండగా ఉండాలి. తగాదాలు వచ్చినా సర్దుకుపోవాలి. అప్పుడే ప్రేమ వివాహాలు గెలుస్తాయి. మా ప్రేమ వివాహాన్ని అలాగే గెలిపించుకుని మేం ఆనందంగా ఉన్నాం. మాకిద్దరు పిల్లలు. అవనీష్, సాకేత్.
- ఎన్. లహరి భగవాన్, హైదరాబాద్.
|
మా ప్రేమని గెలిపించుకున్నాం!
అగ్రకులంలో జన్మించడం నా ప్రేమకు పెద్ద పరీక్షే అయింది. ఆర్థిక కారణాల వల్ల డిగ్రీ మధ్యలో మానేసి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నప్పుడు వాసుతో పరిచయమైంది. అది కొంతకాలానికి ప్రేమగా మారింది. ఉద్యోగం వచ్చాక, పెద్ద వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ నా ప్రేమ విషయం ఇంట్లో తెలిసి మందలించారు. ఉద్యోగం మాన్పించారు. వేరే సంబంధాలు చూశారు. కానీ నేను వాసునే పెళ్లి చేసుకుంటానని స్పష్టంగా చెప్పాను. కొన్నాళ్లకు అతడికీ టీచర్ ఉద్యోగం వచ్చింది.
నేనూ, వాసూ కలుసుకోవడానికి వీల్లేని పరిస్థితి. నన్ను బంధువుల ఇంటికి పంపించేశారు. ఇదంతా తెలిసి ‘నువ్వేం భయపడకు, మన పెళ్లి జరుగుతుంది’ అని వాసు భరోసా ఇచ్చాడు. ఆ హామీతో పట్టు వదలకుండా మా తల్లిదండ్రుల్ని ఒప్పించే ప్రయత్నం చేశాను. దగ్గరి బంధువులతో చెప్పించాను. అయినా లాభం లేకపోయింది. చివరికి 1998 మార్చిలో నాకోసం వేచి చూస్తున్న వాసుని పెళ్లి చేసుకున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... అన్నింటినీ తట్టుకుని మేం పద్దెనిమిదేళ్లుగా ఎంతో సంతోషంగా ఉంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు అద్వైత్, సాకేత్.
ఇప్పుడు మా వారి కుటుంబం, మా కుటుంబం కలిసిపోయి ఆనందంగా ఉంటున్నాం. నేను ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూనే డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేశా. 2014లో మోడల్ స్కూల్ టీచర్‌గా ఉద్యోగం సంపాదించాను. ఇద్దరం ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉన్నాం.
|
Post a Comment