‘ఈ-పోస్’లో గల్లంతయిన కుటుంబ సభ్యుల వివరాలు
ఎంట్రీలో జరిగిన పొరపాట్లతో కొత్త కార్డుదారులకు పాట్లు
రేషన్ ఇవ్వలేమంటున్న డీలర్లు.. దిద్దుబాటు చర్యలో అధికారులు
హైదరాబాద్, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్ కార్డులు వచ్చాయన్న పేదల ఆనందం ఆవిరి అయ్యింది. కొత్త కార్డు మీద సరుకులు తీసుకుందామని ఉత్సాహంగా డిపోకు వెళ్లిన కార్డుదారులు ఒక్కసారి అవాక్కు అవుతున్నారు. కుటుంబంలో నలుగురు ఉంటే ‘ఈ-పోస్’లో ఒక్కరికే రేషన చూపిస్తుండటమే దీనికి కారణం.
‘కొత్త’ ఉత్సాహం ఆవిరి
ప్రతి పేదవాడికి తెల్లకార్డు ఉండాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం 12 లక్షల కొత్త రేషన కార్డులను జన్మభూమి కార్యక్రమంలో మంజూరు చేసిన విషయం తెలిసిందే. వారందరికీ ‘చంద్రన్న సంక్రాంతి కానుక’ అందజేశారు. అయితే నిత్యావసర సరుకులు మాత్రం ఫిబ్రవరి నుంచి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కొత్త రేషన కార్డుదారులకు సంబంధించిన రేషన కూడా ప్రభుత్వం అన్ని రేషన షాపులకు పంపించింది. అయితే, కొత్తగా కార్డులు పొందిన వారికి ‘ఈ-పోస్’ చుక్కలు చూపిస్తోంది. ‘‘కొత్త కార్డులకు సంబంధించిన రేషన కోటా అంతా వచ్చింది. ఈ-పో్‌సలో మీ కార్డు నంబర్ కొడితే ఒక్కరి పేరే వస్తుంది. మేమేం చేయగలం? ఈ-పోస్ సూచించిన వ్యక్తికే రేషన ఇవ్వగలం. మిగిలిన కుటుంబ సభ్యులు గురించి మాకు తెలియదు’’ అని డీలర్లు చేతులెత్తేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాని వెళ్లి అడగండని కార్డుదారులకు సూచిస్తున్నారు.
అధికారుల నిర్వాకం వల్లే..
వాస్తవానికి, కొత్త రేషన కార్డుల జారీ, పంపిణీ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త కార్డులో విపరీతంగా తప్పులు, కార్డుల్లో ఫొటోలు లేకపోవడం, కార్డులో యజమాని పేరు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవటం లాంటి ఎన్నో విచిత్రాలు జరిగాయి. అయినా, అధికారులు ఇవేమి పట్టించుకోకుండా రేషన పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీనివల్లనే ‘ఈ-పోస్’ సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నదని చెబుతున్నారు. ‘‘పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందాలని తపన పడుతోంది. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఎంట్రీ సరిగా చేయకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయి. హడావుడిగా కుటుంబ సభ్యుల పేర్లు ఎంట్రీ చేయటం వల్ల అవే తప్పులు కొత్త రేషన కార్డుల్లోకి వచ్చేశాయి’’ అని జన్మభూమి కమిటీ సభ్యుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ సాంకేతిక సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘‘సాంకేతిక సమస్యల వల్ల కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కాలేదు. వారంతా దగ్గరిలోని తహసీల్దార్ కార్యాలయం వద్దకి వెళ్లి వాళ్ల పేర్లను నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుంది’’ అని తెలిపారు. మరో వైపు ఈ నెల 10వ తేదీలోగా రేషన సరుకులు పంపిణీ చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీనితో కొత్త గా కార్డులు పొందిన కుటుంబ సభ్యులందరికీ ఈ నెలలో రేషన్ లేనట్లేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Post a Comment