అధికార పార్టీని ఏనాడూ నిలదీయని పవన్ కళ్యాణ్
* అమరావతి మొదలు తుని వరకూ టీడీపీకి వత్తాసు
* తుని ఘటనపై మాట్లాడేందుకు కేరళనుంచి రాక
* చంద్రబాబు స్క్రిప్టు మేరకే విలేకరుల సమావేశాలు
* గతంలోనూ సర్కారుకు మద్దతుగానే మాటలు
* అంగన్‌వాడీ, కాంట్రాక్టు ఉద్యోగులు,
* ఆరోగ్యమిత్రలపై ప్రశ్నించని వైనం
* రాజధాని రైతులకు అండగా ఉంటానంటూనే స్వరం మార్పు
* పవన్ చర్యలను సూసైడ్ నోట్‌లో తప్పుపట్టిన కాపు వ్యక్తి
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబు అమ్ముల పొదిలో ఒక అస్త్రమా?... ఇటీవలి రాజకీయ పరిణామాలు పరిశీలిస్తే అవుననే అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఆదివారం నాటి తుని ఘటనపై పవన్ మాటలు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. తుని ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలతో పాటు ఇతర మంత్రులను మంచి తర్ఫీదునిచ్చి రంగంలోకి దింపారు. తన రాజకీయ ప్రత్యర్థులే ఈ ఘటనకు కారణమని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ విలేకరుల సమావేశాలు పెట్టించి చెప్పించారు. రాత్రికి తెరపైకి వచ్చిన చంద్రబాబు వాటి ని కొనసాగించారు.
రాజకీయ ప్రత్యర్థుల వల్లే విధ్వంసం జరిగిందని బల్ల గుద్ది చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో సినిమా షూటింగ్ నిమిత్తం కేరళ వెళ్లిన తన కూటమి భాగస్వామి పవన్ కల్యాణ్‌కు తుని ఘటన గురించి సమాచారం అందించారు. ఇదే విషయాన్ని తన అనుంగు మీడియాకు ముందస్తుగా లీక్ చేశారు. ఆ మీడియా ‘అడుగో పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నాడు, మీడియాతో మాట్లాడబోతున్నార’ని ఊదరగొట్టేసింది. మీడియా ఊదరగొట్టేసినట్లే పవన్ షూటింగ్‌ను అర్ధంతరంగా ముగించుకుని సోమవారానికి హైదరాబాద్ చేరుకుని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థులపై ఏవైతే విమర్శలు చేశారో వాటినే తన మాటల్లో చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై గోబెల్స్ తరహాలో చంద్రబాబు చేసే ప్రచారంలో భాగం పంచుకున్నారు. సుమారు 40 నిమిషాల పాటు విలేకరులతో మాట్లాడిన పవన్ ఏ ఒక్క సందర్భంలోనూ... కాపులు చేసే ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నారా? అనే ప్రశ్నకు స్పందించలేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని మాత్ర మే చెప్పారు. తునిలో జరిగిన ఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కనీసం ఒక్క మాట కూడా అనలేదు. లక్షలాది మంది ప్రజలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సన్నాయినొక్కులు నొక్కారు. గతంలో పలు సందర్భాల్లోనూ పవన్ కల్యాణ్ ఇదే తీరుగా వ్యవహరించడం తెలిసిందే.
చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే...
తూర్పు గోదావరి జిల్లా తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభకు లక్షలాది మంది వచ్చినా ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు తీసుకోలేదు. పోలీసులను తగినంతమందిని కేటాయించలేదు. జాతీయ రహదారి, రైల్వేట్రాక్‌లకు మధ్యలో బహిరంగ సభ వేదికను నిర్వాహకులు ఎంచుకున్నా ఒకవేళ వారు ఆందోళనకు దిగితే తదనంతరం తలెత్తే పరిణామాలను గ్రహించటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అయినా కూడా చంద్రబాబు నేతత్వంలోని ప్రభుత్వాన్ని పవన్ పల్లెత్తుమాట అనలేదు. అనూహ్యంగా చెలరేగిన విధ్వంసంలో జరిగిన రైలు, పోలీస్ స్టేషన్ దహనాలకు విపక్షాలదే బాధ్యతన్న చంద్రబాబు ఆరోపణలకు సమర్థిస్తున్నట్లుగా మాట్లాడారు.
పవన్ కల్యాణ్ విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలోనే కాకినాడలోని తూర్పు గోదావరి కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో పవన్ వైఖరిని ఆ వ్యక్తి తన సూసైడ్ నోట్‌లో తప్పుపట్టారు. చంద్రబాబుకు అధికార ప్రతినిధిలా పవన్ విలేకరుల సమావేశం ఉందని ఓ కాపు సోదరుడు వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేందుకు ఆయన హుటాహుటిన కేరళ నుంచి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అధికారపక్షం ముందస్తుగా రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే పవన్ కల్యాణ్ నటించారని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ కులానికి అనుకూలంగా తాను జనసేన పార్టీ పెట్టలేదని పవన్ అనడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రశ్నించడం మరచిన పవన్...
పవన్ కల్యాణ్ గతంలో పలు సందర్భాల్లో కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ బీజేపీ నేతత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో చేరారు. అందులో టీడీపీ కూడా భాగస్వామి. ఈ రెండు పార్టీల తరపున పవన్ కల్యాణ్ కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నిస్తానని చెప్పారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అంగన్‌వాడీ కార్మికులపై లాఠీలు ఝళిపించినా, కాంట్రాక్టు ఉద్యోగులను పలు శాఖల నుంచి తొలగిస్తున్నా, ఆరోగ్యమిత్ర కార్యకర్తలను ఉద్యోగం నుంచి ఊడబెరికినా, మూడువేల పాఠశాలలకు మంగళం పాడినా, రాజధాని నిర్మాణం పేరుతో వేలమంది రైతుల నుంచి భూ సమీకరణ పేరుతో భూములను బలవంతంగా లాక్కున్నా... ఏ సందర్భంలోనూ కనీసం నోరెత్తి మాట్లాడలేదు.
రాజధానికోసం భూములను రైతులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవచ్చని, బలవంతంగా సేకరిస్తే తాను సహించబోనని, ఆందోళన చేస్తానని అక్కడికి వెళ్లిన సందర్భంగా పవన్ చెప్పారు. కానీ ఆ తర్వాత పవన్ స్వరం మార్చి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. రైతుల గురించి ఆందోళన చేస్తానన్న కొద్ది రోజులకే చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వె ళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ తమ కూటమిలో భాగస్వామిగా ఉన్నా పలు విషయాల్లో అటు శాసనసభ లోపల, ఇటు వెలుపలా బీజేపీ విభేదిస్తోంది, విమర్శలు చేస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ప్రభువును మించిన భక్తిని ప్రదర్శిస్తూ టీడీపీ ప్రభుత్వం ఏమి చేసినా వంతపాడుతుండటం గమనార్హం.
Post a Comment