హైదరాబాద్ : అవసరమైనప్పుడు ఆపద్భాంధవుడిగా వచ్చి అధికార తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు లేకుండా వ్యవహరించే జనసేన నాయకుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రయోగం ఫలించిందా... అంటే ఈసారి ఆ ప్రయోగం అంతగా ఫలించలేదన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. కాపు ఉద్యమం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో రాజకీయంగా ఎదురుదాడికి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత క్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరి మద్దతు కూడగట్టే పనిలో పడినట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే టీడీపీ అధినేత రాజకీయ ఎత్తుగడగా పవన్ కల్యాణ్ తో మాట్లాడించారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గతంలో అమరావతి రాజధాని భూ సమీకరణ విషయంలో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైన నేపథ్యంలో కూడా పవన్ కల్యాణ్ ఆ ప్రాంతాల్లో పర్యటించడం, ఆ తర్వాత ఆయన చంద్రబాబును కలుసుకోవడం తెలిసిందే. బలవంతంగా భూ సేకరణ చేస్తే ప్రతిఘటిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు చెప్పిందాంతో సంతృప్తి చెంది మళ్లీ అటువైపు వెళ్లలేదన్న విషయం అందరికీ తెలిసిందే.
కాపు రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేయటంతో మిత్రపక్షమైన జనసేన నాయకుడు పవన్ ను హడావిడిగా రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు. తునిలో చోటుచేసుకున్న ఘటనపై షూటింగ్ నుంచి హైదరాబాద్ చేరుకుని మీడియాతో మాట్లాడారు. సాధారణంగా షుటింగ్ షెడ్యూలు ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వాటిని రద్దు చేసుకున్న దాఖలాలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పంపించినప్పుడు కూడా షూటింగ్ లేకుండా ఉన్నట్టయితే పాల్గొంటానని చెప్పిన విషయం విదితమే. అయితే ఈసారి అందుకు ఆస్కారం లేనివిధంగా ఆయనపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఆ కారణంగానే ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారని పవన్ సన్నిహితులు చెబుతున్నారు.
తునిలో చోటుచేసుకున్న సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే ఆ ఘటనల వెనుక అసాంఘిక శక్తులు ఉన్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఆయన మాట్లాడిన తీరంతా అధికార పార్టీ నేతలకు మద్దతుగా ఉన్నప్పటికీ ఉద్యమకారులకు పవన్ తగిన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోయారని టీడీపీ నేతలు పెదవి విరిచారు. ఇదే అంశంపై కొందరు నేతలు విజయవాడలో చంద్రబాబు చెవిలో వేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఇలావుండగా మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పవన్ సూటిగా సమాధానం ఇవ్వకపోవడం, చివరకు కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి మద్దతునిస్తున్నారా అన్న ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడం పవన్ సన్నిహితులను ఇరకాటంలో పెట్టింది.
Post a Comment