అందం, నటన, గాత్రం అన్నీ ఉన్న అమ్మాయిలో పొగరు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్శనం నిత్యామీనన్. ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పే నిత్యా అంటే దర్శకనిర్మాతలకు కొద్దిగా భయమే! తన నటనతో కుర్రకారు గుండెల్ని టచ్ చేసిన నిత్యాకు రావలసిన సంఖ్యలో సినిమాలు రావడం లేదు. ఆ వివరాలేమిటో ఆమె మాటల్లోనే....
దర్శకనిర్మాతలను భయపెడుతున్నారట నిజమేనా? నా కండిషన్లు నేను చెబుతాను. దానికి సిద్ధ పడినవారే నాతో సినిమా చేస్తారు. ఎవరి కోసమో నా పద్ధతి మార్చుకోను. నేనింతే!
కండిషన్లంటే....
కథలో హీరోతో సమానంగా నాకూ ఇంపార్టెన్స్ ఉండాలి. రెమ్యునరేషన్ కూడా అంతే! ఇవి రెండూ ఓకే అయితే కథ చెప్పమంటాను. వాటికి సిద్ధపడిన వారే నాకు అవకాశాలు ఇస్తున్నారు.
మిమ్మల్ని సౌందర్యతో పోలుస్తుంటే ఎలా ఫీలవుతారు?
నేను ఎవరి స్టయిల్‌ని ఫాలో అవను. నా స్టయిల్లో నేను నటిస్తాను. ఒకరిలా మరొకరు నటించడం అంటే కష్టం. ఎక్కడో పోలికలు ఉంటే ఉండవచ్చు అంతే! ఎవరిలాగానో నటిస్తే నా కెరీర్‌లో ఎదుగుదల ఉండదు. నేను నా పద్ధతిలో నటిస్తేనే కెరీర్‌ని డెవలప్ చేసుకోగలను.
మిగతా వారితో పోల్చుకుంటే చాలా తక్కువ సినిమాలు చేస్తారెందుకు?
అవకాశాల కోసం నేను ఎవరినీ అడగను. ఎవరి దగ్గరకూ వెళ్ళను. నా గురించి తెలిసిన వారు మాత్రమే నాతో సినిమాలు చేస్తారు. అందుకే నా సినిమాల సంఖ్య తక్కువగా ఉంటుంది.
పాటలు కూడా పాడతారట కదా?
పాటలంటే ఇష్టమే కానీ, ట్రైన్డ్ సింగర్‌ని కాను. నాకు పాటల మీద ఉన్న ఇంట్రస్ట్ విని ‘అలా మొదలైంది’లో నందినిరెడ్డిగారు నా చేత పాటలు పాడించారు. ఆ తరువాత అడపా తడపా పాడుతున్నాను కానీ, దాన్ని కెరీర్‌గా తీసుకోలేదు.
పెళ్ళి కన్నా సహజీవనమే నయం అని అన్నారు కదా? ఎందుకలా అనిపించింది?
ఓ ఇరవై సంవత్సరాల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు ఏమాత్రం పరిచయం లేని ఓ అమ్మాయి, అబ్బాయి పెళ్ళి చేసుకుని హాయిగా జీవించేవారు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. ఒకరికొకరు బాగా తెలుసుకుని పెళ్ళి చేసుకున్నా మనస్పర్థలతో విడిపోతున్న రోజులు. అందుకే పెళ్ళి కన్నా సహజీవనమే నయం అన్నాను తప్ప పెళ్ళి మీద మంచి అభిప్రాయం లేక కాదు. కాలంతో పాటు మనమూ మారాలి కదా!
దక్షిణాది తప్ప ఉత్తరాది సినిమాలు చేయడం లేదు ఎందుకు?
నిజం చెప్పాలంటే నా కెరీర్‌లో ఎక్కువ సక్సెస్‌లు దొరికింది తెలుగులోనే. పరభాషా అమ్మాయినే అయినా తెలుగు ప్రేక్షకులు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే పట్టు పట్టి తెలుగు నేర్చుకున్నాను. ఇక బాలీవుడ్ అంటారా! అక్కడి నుంచి కూడా అవకాశాలు వచ్చాయి కానీ, వాళ్ళు చెప్పిన స్టోరీలు నాకు నచ్చలేదు. అందుకే అక్కడ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎవరైనా నాకు నచ్చే కథతో వస్తే అక్కడ చేయడానికి నేను రెడీ!
మిమ్మల్ని పొగరుబోతు అంటుంటే బాధగా ఉండదా?
బాధ ఎందుకు? నా ప్రవర్తన బట్టి నా మీద ఆ ముద్ర వేశారు. వాస్తవానికి నేనేమీ పొగర బోతునుకాదు. గతంలో ఒకసారి చెప్పాను. షూటింగ్‌లకి నా వెంట ఎవరూ రారు. ఒంటరి గానే వస్తాను. అలాంటప్పుడు ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే వెంటనే తిట్టేస్తాను. దాంతో నన్ను పొగర బోతు అనేస్తున్నారు. అలా చేయడం నా స్వీయ రక్షణ! దానికి ఎవరు ఏ పేరుపెట్టినా నాకు అభ్యంతరం లేదు.
పెళ్ళి ఎప్పుడు?
చాలామంది ఇదే అడుగుతున్నారు. నా మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడాలి. అతనితో నా జీవితం బాగుంటుంది అన్న నమ్మకం నాకు కలగాలి. అప్పుడే పెళ్ళి చేసుకుంటాను. అయినా నాకూ, మా కుటుంబ సభ్యులకు లేని తొందర మిగతావారికి ఎందుకు?
Post a Comment