అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో మనమే ఎక్కువ
* అక్కడి మేధావుల్లో ఆసియన్లు ఎక్కువ.. అందులోనూ భారత్ టాప్
* ఉన్నత విద్యలో నాణ్యత, ఎక్కువ సంపాదనతోనే వలసలు
వాషింగ్టన్: అమెరికన్ ఇమిగ్రేషన్ పొందుతున్న సైంటిస్టులు, ఇంజనీర్లలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని యూఎస్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌సీఎస్‌ఈఎస్) వెల్లడించింది. ఆసియా దేశాలనుంచి ఈ విభాగంలో వలస వస్తున్నవారు ఎక్కువగా ఉండగా.. అందులోనూ భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. జీవ శాస్త్రవేత్తలు, కంప్యూటర్, గణిత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లే ఎక్కువగా అమెరికాకు వలసవస్తున్నట్లు వెల్లడైంది.
ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చిన వారు ఆయా దేశాలకంటే ఎక్కువ సంపాదన అక్కడే ఉండటంతో అమెరికాలోనే సెటిల య్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు అక్కడి వర్సిటీల్లో స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్నత చదువులకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో చదువు పూర్తవగానే మంచి వేతనంతో ఉద్యోగం వస్తుండటం మరో కారణం. ఆసియా నుంచి 29 లక్షల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అమెరికాలో ఉండగా.. అందులో 9.5లక్షల మంది భారతీయులే. 2003 నుంచి యూఎస్ వెళ్తున్న భారతీయుల సంఖ్యలో 2013 వరకు 85శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది. 2013 వరకు యూఎస్‌లోని విదేశీ శాస్త్రవేత్తల్లో 57శాతం ఆసియావారేనని వెల్లడించింది.
ఐక్యరాజ్యసమితి లెక్కా ఇదే!
ప్రపంచంలో వలసల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (డీఈఎస్‌ఏ) అంతర్జాతీయ వలసదారులపై ఈ సర్వే చేసింది. భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి నివసిస్తున్న వలసదారుల జనాభా, ఇతర దేశాల వలసల కన్నా ఎక్కువగా ఉంది. 2015లో భారత్‌కు చెందిన 1.6 కోట్ల మంది ఇతర దేశాల్లో నివసిస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. దీని ప్రకారం.. 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది వలస వెళ్లారు. ఇది 2000 సంవత్సరంలో లెక్కల కన్నా 41 శాతం ఎక్కువ.
Post a Comment