చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ పరువు నష్టం దావా విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కానున్నానని డీఎంకే అధినేత ఎం.కరుణానిధి వెల్లడించారు. స్టే పొందేందుకు అవకాశం ఉన్నా, చట్టం మీదున్న గౌరవంతో కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సీఎం జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా సరే ఆధార రహిత ఆరోపణలు చేసినా, కథనాలు ప్రచురించినా పరువు నష్టం దావా ఎదుర్కొవాల్సిందే. ఆ దిశగా ఇప్పటి వరకు అన్ని పార్టీల నాయకులు, అనేక పత్రికలు ఈ దావాల విచారణల్ని ఎదుర్కొంటూ వస్తున్నాయి.
ఇందులో భాగంగా ఇటీవల ఓ వార పత్రిక ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకుని మురసోలి పత్రిక ద్వారా డీఎంకే అధినేత కరుణానిధి ఘాటుగా స్పందించారు. ఆ కథనంలోని ఆరోపణలన్ని ప్రశ్నిస్తున్నట్టు వ్యాఖ్యల్ని సందించారు. దీంతో ఆ వార పత్రికతో పాటు డీఎంకే అధినేత కరుణానిధిపై కూడా ప్రభుత్వ తరపున న్యాయవాదులు కన్నెర్ర చేశారు. సీఎం జయలలిత పరువుకు భంగం కల్గించే విధంగా వ్యవహరించారంటూ వేర్వేరుగా దావాలను కోర్టులో వేశారు. ఈ దావాల విచారణ చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో సాగుతున్నాయి. విచారణ నిమిత్తం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కరుణానిధికి గత వారం కోర్టు సమన్లు జారీ చేసింది.
దీంతో విచారణకు కరుణానిధి నేరుగా హాజరయ్యేనా లేదా, న్యాయవాదుల ద్వారా సమాధానం పంపించడం లేదా, కోర్టుకు హాజరు కాకుండా హైకోర్టు ద్వారా స్టే పొందుతారా..? అన్న ప్రశ్న బయలుదేరింది. అయితే, ఆ మార్గాల్ని పక్కన పెట్టిన కరుణానిధి నేరుగా కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ, తాను కోర్టు విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగాఉన్నట్టు ప్రకటించారు. చట్టం మీదున్న గౌరవంతో సోమవారం జరగనున్న విచారణకు నేరుగా హాజరయ్యేందుకు నిర్ణయించినట్టు తెలిపారు.
కోర్టు సమన్లు తనకు అందాయని, అయితే, విచారణకు హాజరు కాకుండా స్టే తీసుకుంటామని న్యాయవాదులు తనకు సలహా ఇచ్చినట్టు గుర్తుచేశారు. అయితే, ఆ మార్గాన్ని పక్కన పెట్టి కోర్టుల మీదు, న్యాయ, చట్టాల మీదున్న గౌరవంతో విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్టు వివరించారు. తన మీద దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును చట్టపరంగానే ఎదుర్కొంటానని పేర్కొన్నారు.
Post a Comment