-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 14, 2016

‘నాన్‌వెజ్ మిల్క్’పై తేల్చండి..?


♦ 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు పశుసంవర్థక శాఖ ఆదేశం
♦ రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తనిఖీలు
♦ ఏజెంట్ల సూచనలతో హోటల్ వ్యర్థాలు కనబడకుండా చేసిన రైతులు
♦ పాలను ప్రయోగశాలలో పరీక్షించేందుకు సిద్ధమైన అధికారులు
♦ పాలు తాగిన బాలలకు అనారోగ్యం అంటూ సుమోటోగా నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాడైపోయిన కూరలు, కుళ్లిపోయిన కూరగాయలు, కంపుకొట్టే మాంసాహార వ్యర్థాలు, సాంబారును గేదెలకు ఆహారంగా ఇవ్వడంపై పశుసంవర్థక శాఖ తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్ శివార్లు సహా రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో హోటల్ వ్యర్థాలను వినియోగిస్తున్న ప్రాంతాల్లో తనిఖీ చేసి 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  గేదెలకు హోటళ్లలోని వ్యర్థాలను ఆహారంగా పెడుతుండడంపై బుధవారం ‘నాన్‌వెజ్ మిల్క్’ పేరిట ‘సాక్షి’ పతాక శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో హోటల్ వేస్ట్ తరలించే ఏజెంట్లు అప్రమత్తమై వ్యర్థ పదార్థాలను కనపడకుండా చేయాలని రైతులకు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో అధికారులు తనిఖీలు చేయగా.. హోటల్ వ్యర్థాలు దొరకకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, హోటల్ వ్యర్థ పదార్థాలు తింటున్న గేదె నుంచి వచ్చే పాలను ప్రయోగశాలకు పంపి పరీక్షలు చేయించాలని పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా ఆధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

 చర్యలు తీసుకుంటాం: అధికారులు
 వ్యర్థాలను తరలించే ఏజెంట్లు, వాటిని నిల్వ చేసి విక్రయిస్తున్న హోటళ్లను గుర్తించి చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ శానిటరీ విభాగం అధికారులు వెల్లడించారు. సైఫాబాద్ ప్రాంతంలో ఇలా పాడైన ఆహార పదార్థాలను నిల్వ చేసి తరలిస్తున్న రెండు హోటళ్లను గుర్తించారు. పటాన్‌చెరు, కీసర ప్రాంతాల్లో దాదాపు 50 మంది రైతులు వెయ్యి పాడి గేదెలకు హోటల్ వ్యర్థాలను ఇస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. గేదెలకు పచ్చగడ్డి, ఎండు గడ్డి, తవుడును మాత్రమే ఇవ్వాలని అధికారులు ఈ సందర్భంగా రైతులకు సూచించారు. హోటల్‌లో మిగిలిన వ్యర్థ పదార్థాలను వినియోగిస్తే పశువుల ఆయుఃప్రమాణం తగ్గుతుందని వివరించారు.

 లూసన్ గడ్డి పెంచండి..
 పాడి గేదెల కోసం 18 రోజుల్లో కోతకు వచ్చే లూసన్ గడ్డి పెంచాలని అధికారులు సూచిస్తున్నారు. కిలో లూసన్ విత్తనాలకు రూ.750 ఖర్చు అవుతుందని, గుజరాత్‌లో నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయని తెలిపారు. విత్తనాలు వేసిన 18వ రోజు నుంచే కోసి గేదెలకు ఆహారంగా వేయొచ్చని, ఒక్కో గేదెకు రోజూ ఐదు లేదా ఆరు కిలోల గడ్డిని మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఒకసారి విత్తనాలు వేస్తే మూడేళ్ల పాటు ప్రతి 18 లేదా 20 రోజులకోసారి కోసి గేదెలకు ఆహారంగా ఇవ్వొచ్చు. పెద్దగా నీటితో పని లేకుండానే ఈ గడ్డిని పెంచవచ్చు. గుజరాత్‌లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఇదే ముఖ్యమని చెబుతుంటారు. ఈ విత్తనాలు ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రగతిశీల రైతు పాడి సమాఖ్య అధ్యక్షుడు కందాల బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్
 హోటళ్లలో మిగిలిపోయిన వ్యర్థాలను పాడి పశువులకు మేతగా ఇవ్వడంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ఈ అంశంపై వచ్చేనెల 5కల్లా నివేదిక అందజేయాలని పశుసంవర్థక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. హోటల్ వ్యర్థాలను తినే గేదెల పాలు తాగితే పిల్లల ఆరోగ్యంపైనా ప్రభావం ఉంటుందని కమిషన్ సభ్యుడు అచ్యుతరావు పేర్కొన్నారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu