ఏడాదికి ఒక్క చిత్రం కూడా చేయని అజిత్ ఇకపై స్పీడ్ పెంచనున్నారా? అవునే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అజిత్ ఇటీవల వరుస విజయాలతో మంచి జోరు మీదున్నారు. ఆరంభం నుంచి ఇటీవల విడుదలైన వేదాళం చిత్రం వరకూ ప్రేక్షకాదరణను పొందాయన్నది గమనార్హం. అయితే ఆరంభం చిత్రం సమయంలో అజిత్ కాలికి బలమైన గాయలయ్యాయి. అప్పుడు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించినా తాత్కాలిక చికత్స తీసుకుని చిత్రాలు చేస్తూ వచ్చిన అజిత్ ఎట్టకేలకు ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
వైద్యుల సలహా మేరకు ఆరు నెలలు విశ్రాంతికి సిద్ధమైన అజిత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన మేలో చెన్నైకి తిరిగి రానున్నారు. ఆయన కోసం రెండు చిత్రాల కథలు ఎదురు చూస్తున్నాయి. వేదాళం చిత్ర దర్శకుడు శివకు అజిత్ వెంటనే మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం.ఈ చిత్రానికి కథను పక్కాగా సిద్ధం చేసే పనిలో శివ నిమగ్నమయ్యారని తెలిసింది. దీనితో పాటు అజిత్‌తో బిల్లా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు విష్ణువర్ధన్ మరోసారి ఆయన్ని డెరైక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన చారిత్రకథను సిద్ధం చేస్తున్నారన్నది తాజా సమాచారం.
విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాల్ని అజిత్ ఏకకాలంలో చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. కాలుకు శస్త్ర చికిత్స విజయవంతం అవడంతో సంతోషంగా ఉన్న అజిత్ ఇకపై తన చిత్రాల స్పీడ్ పెంచనున్నారన్న వార్త ఆయన అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అజిత్ చెన్నైకి రాగానే ఈ రెండు చిత్రాల పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Post a Comment