► బరీందర్ ఊరిలో
► తొలి మ్యాచ్ సంబరం
సిర్సా (హర్యానా): ఎక్కడి పన్నీవాలా మోరికా... ఎక్కడి పెర్త్ మైదానం... 23 ఏళ్ల భారత పేస్ బౌలర్ బరీందర్ శరణ్ జీవితంలో మంగళవారం అత్యంత సంతోషకరమైన రోజు. వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 207వ ఆటగాడిగా అతని పేరు రికార్డులకెక్కింది. ఈ క్షణాలను అతని స్వగ్రామం పన్నీవాలా కూడా వేడుకగా జరుపుకుంది.
కేవలం 2 వేల జనాభా గల ఈ ఊరిలో మ్యాచ్ రోజు తెల్లవారుజామునుంచే సందడి మొదలైంది. తాను మ్యాచ్ ఆడబోతున్నట్లు బరీందర్... తన తల్లి జస్‌ప్రీత్ కౌర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అంతే...శరణ్ మిత్రులు అన్ని ఏర్పాట్లూ చేసేశారు. ఆ గ్రామం చౌరస్తాలో ఒక పెద్ద ఎల్‌సీడీ టీవీ ఏర్పాటు చేసి అందరూ మ్యాచ్ చూడాలంటూ పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా పన్నీవాలాలో శరణ్ సన్నిహితులు అతను విజయవంతం కావాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
తొలి వన్డేలో భారత్ ఓడినా... తమ కుర్రాడు మాత్రం నిరాశపర్చలేదని వారు ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇక్కడ టీవీలో అతడిని చూస్తుంటే మాకు దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. బాక్సింగ్ ఆడుతున్నప్పుడు దెబ్బలు తగులుతాయని భయపడేవాళ్లం. ఇప్పుడు వాడి కొత్త జీవితం మొదలైంది’ అని శరణ్ తండ్రి బల్బీర్ సింగ్ ఉద్వేగంగా అన్నారు.
టీవీలో మ్యాచ్ చూస్తున్నంత సేపు ఊరి పెద్దలకు ఆట గురించి అతని చెల్లెలు రూపీందర్ కౌర్ సందేహాలు తీరుస్తూ వచ్చింది. ‘ఆస్ట్రేలియానుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకు రావాలని అన్నయ్య అడిగాడు. వీలైనన్ని వికెట్లు అని జవాబిచ్చా. అతను మరిన్ని వికెట్లు తీస్తాడని నమ్ముతున్నా’ అని కౌర్ తన సంతోషాన్ని పంచుకుంది. తమ గ్రామ కుర్రాడు బరీందర్ భవిష్యత్తులో ఇంకా బాగా ఆడాలని తాము కోరుకుంటున్నట్లు ఆ గ్రామ ప్రజలు చెప్పారు.
Post a Comment