చెన్నై: బీప్ సాంగ్ వివాదంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ కోవై రేస్ కోర్స్ పోలీసుల ముందు హాజరై రెండు పేజీల వివరణతో కూడిన లేఖను అందించారు. వివరాల్లోకెళితే శింబు రాసి, పాడిన బీప్ సాంగ్ మహిళలను అగౌరవపరిచే విధంగా ఉందంటూ రాష్ట్రంలో నెల రోజులకు పైగా పెద్ద దుమారమై చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆ పాటకు అనిరుద్ సంగీతాన్ని అందించారంటూ శింబుతో పాటు ఆయన పైనా పలు కేసులు నమోదయ్యాయి. వీరిద్దరిని అరెస్ట్ చేయడానికి కోవై, చెన్నై పోలీసులు రంగం సిద్ధం చేశారు.
నటుడు శింబు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌కు అర్హతను పొందారు. అయితే సంగీత కచేరీల కోసం కెనడా వెళ్లిన అనిరుద్ పోలీసుల ముందు హాజరు కావడానికి కాల సమయాన్ని కోరారు. దీంతో ఆయన తిరిగి రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అనిరుద్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో కోవై రేస్ కోర్స్ పోలీసుల ఎదుట హాజరై బీప్ సాంగ్ వ్యవహారంలో వివరణతో కూడిన లేఖ ఇచ్చారు.అందులో తనకు బీప్ సాంగ్ పాటకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
ఈ విషయాన్ని నటుడు శింబు కూడా వెల్లడించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పాటపై వివాదం చెలరేగినప్పుడు కెనడాలో ఉన్నానని పోలీసుల సమక్షంలో హాజరు కాలేక పోయానని చెప్పారు. తన ప్రమేయం లేక పోయినా తనపై కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. అనిరుద్ వివరణ లేఖను అందుకున్న కోవై రేస్ కోర్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సెల్వరాజ్ విచారణకు పిలిచినప్పుడు హాజరవ్వాలని అనిరుద్‌కు చెప్పారు. పోలీసుల ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని అనిరుద్ హామీ ఇచ్చారు.
Post a Comment