భోపాల్: 'బీఫ్' వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ఓ ముస్లింజంటపై గో రక్షణ సమతి సభ్యులు దాడికి దిగడం ఆందోళన రేపింది. బ్యాగులో బీఫ్ ఉందని ఆరోపిస్తూ రైల్లో ప్రయాణిస్తున్న ముస్లిం దంపతులపై సమితి కార్యకర్తలు దాడి చేసి ఘోరంగా అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని హర్డా జిల్లాలో ఖిర్కియా రైల్వే స్టేషన్‌లో ఈనెల 13న ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మహమ్మద్ హుస్సేన్ (43), అతని భార్య నసీమ్ బానో (38) కుషినగర్ ఎక్స్ ప్రెస్ లో తమ సొంత గ్రామం హర్దాకి బయలుదేరారు. ఇంతలో కొంతమంది కార్యకర్తలు రైల్లోకి చొరబడి ఈ దంపతుల బ్యాగులను తనిఖీ చేయడం మొదలు పెట్టారు. దీన్నిఅడ్డుకున్న నజీమాను నెట్టేశారు. ఆవుమాంసం వున్న బ్యాగ్ ఏదంటూ గలాటా సృష్టించారు. అక్రమంగా గోమాంసం తీసుకెడుతున్నావంటూ ఆరోపించారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన తోటి ప్రయాణికులు కూడా అడ్డుకున్నారు. దీంతో వారు మరింత రెచ్చిపోయి ఆ దంపతులను చావ బాదారు. వారి బ్యాగులను విసిరి పారేశారు. చివరికి రైల్వే పోలీస్ ను కూడా తోసేసి బీభత్సం సృష్టించారు. ఒక నల్లబ్యాగును దొరకబుచ్చుకుని అందులో గో మాంసం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు హుస్సేన్ కూడా తమ బంధువులకు సమాచారం అందించాడు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఖిర్కియా రేల్వే స్టేషన్ లో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. సుమారు పదిహేనుమంది ప్లాట్ ఫాం దగ్గరకు చేరుకోని సమితి సభ్యులను ప్రశ్నించడంతో ఘర్షణ వాతారణం నెలకొంది.
దీంతో రంగంలోకి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పరీక్షల నిమిత్తం బ్యాగును ల్యాబ్ కు పంపారు. అయితే సదరు బ్యాగులో గో మాంసం లేదని పరీక్షల్లో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ముస్లిం జంట ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజపుత్, సంతోష్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసామని, మరో అయిదుగురి కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు గుర్తు తెలియని బ్యాగ్ యజమానులపై కూడా కేసులు నమోదు చేశారు. తన భార్యను విచక్షణా రహితంగా కొట్టుకుంటూ తోసేసారని, అడ్డుకున్న తనపై దాడిచేశారని మొహమ్మద్ వాపోయాడు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నాడు. వారు చెపుతున్న బ్యాగు తమది కాదని హుస్సేన వాదిస్తున్నాడు.
Post a Comment