-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 15, 2016

పండుగ చుట్టాలు 20 లక్షలు...?


- పల్లెకు తరలివచ్చిన పట్నం
- జంట నగరాల నుంచే రెండు రోజుల్లో 14.5 లక్షల మంది అతిథుల రాక
- గోదావరి జిల్లాలకు అత్యధికం
- ఆ తర్వాత స్థానాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలు
- అతిథులను ఆకర్షిస్తున్న కోడి పందాలు


సాక్షి, విజయవాడ బ్యూరో:
 పల్లెలన్నీ బంధుజనంతో కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు చేరినవారితో సందడి నెలకొంది. ఏడాది ఆరంభంలో పెద్ద పండగైన సంక్రాంతి కోసం ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెలకు 20 లక్షల మందికి పైగా చేరుకున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 12, 13 తేదీల్లో 16 లక్షల మందికి పైగా ప్రయాణించారని ఆర్టీసీ, రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే ఈనెల 11 నుంచి సెలవులు కనుక 10వ తేదీ రాత్రి నుంచే ప్రయాణాలు మొదలయ్యాయి. 10, 11 తేదీల్లో దాదాపు 4 లక్షల మంది వరకు ప్రయాణించారని అంచనా. అంటే మొత్తంగా 20 లక్షల మందికి పైగా ఊళ్లకు వెళ్లారన్నమాట.

జంటనగరాలతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు, కొల్‌కతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం కుటుంబాల సమేతంగా సొంతూళ్లకు చేరుకున్నారు. పిండివంటలు, కొత్తబట్టలు, రంగవల్లులు, హరిదాసులతో పల్లెల్లో పండగ హడావిడి కనిపిస్తోంది. కోడిపందాల జోరుతో ఉభయగోదావరి జిల్లాలు హోరెత్తుతున్నాయి. భోగి రోజు ప్రారంభమైన కోడిపందాలలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోంది. ఇతర ప్రాంతాలలోని సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కోడిపందాల కోసం పల్లెబాట పడుతున్నారు.
 

‘పశ్చిమ’కే ప్రథమ స్థానం
రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే పశ్చిమగోదావరి జిల్లాలోనే ఎక్కువ మంది బంధువుల ఆగమనం కనిపిస్తోంది. సుమారు రెండున్నర లక్షల మంది చుట్టాలు జిల్లాకు చేరినట్లు సమాచారం. ప్రధానంగా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఉండి, ఏలూరు, దెందులూరు, తణుకు, నిడదవోలు ప్రాంతాల్లోని గ్రామాలన్నీ పండగ చుట్టాలతో కళకళలాడుతున్నాయి. రెండోస్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. రావులపాలెం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, రాజోలు, మండపేట ప్రాంతాల్లోనూ బుధవారం నుంచే పండగ సందడి కనిపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ఏటా సంక్రాంతికి కోడిపందాల జాతర కోలాహలంగా సాగుతుంది. వీటిని చూసేందుకే లక్షలాది మంది ఉభయగోదావరి జిల్లాలకు చేరుతుంటారు.

దూరప్రాంతాల్లో ఉండే జిల్లావాసుల బంధువులు కోడిపందాలను చూసేందుకు, పందాలు కాసేందుకు ముందుగానే వచ్చి ఆయా ఊళ్లల్లో బస చేస్తుంటారు. ఈవిధంగా వచ్చిన పండగ జనంతో ఉభయగోదావరి జిల్లాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. వీటి తర్వాత స్థానాలు కృష్ణా, గుంటూరు జిల్లాలకు దక్కుతుంది. ఈ రెండు జిల్లాల్లో కోడిపందాల హడావుడి పెద్దగా ఉండదు గానీ.. సంక్రాంతి పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు.

10 నుంచే ప్రయాణాల హడావుడి...
నిజానికి ఈ నెల పదో తేదీ నుంచే పండగ ప్రయాణాలు మొదలయ్యాయి. 11 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో అందరూ ఊళ్లకు ప్రయాణమయ్యారు. అప్పటినుంచి మొదలైన సొంతూళ్ల ప్రయాణాలు 13వ తేదీ రాత్రి వరకూ కొనసాగాయి. రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడాయి. ఏపీలో మొత్తం 12 వేల ఆర్టీసీ బస్సులుండగా, ఇందులో 5 వేల ఆర్డినరీ బస్సులున్నాయి. పండగ ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ఈసారి హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 2,698 ప్రత్యేక బస్సులను నడిపారు.

ఈ బస్సులన్నింటికీ నాలుగు రోజుల ముందే టిక్కెట్లు రిజర్వ్ అయ్యాయి. ఇవికాకుండా రెగ్యులర్‌గా తిరిగే బస్సులు కూడా 12వ తేదీ నుంచే కిటకిటలాడాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటుచేసినా ఏ మాత్రం చాలక జంటనగర వాసులు కార్లలో ప్రయాణమయ్యారు. ఏపీఎస్ ఆర్టీసీ, రవాణా, రైల్వే ఇతర మార్గాల్లో సేకరించిన వివరాల ప్రకారం గురువారం ఉదయం నాటికి రాష్ట్రానికి చేరిన పండగ బంధువులు 20లక్షల మంది పైగానే ఉన్నారు. 12, 13 తేదీల్లో జంట నగరాాల నుంచి 14.40 లక్షల మంది పల్లెలకు పయనమయ్యారని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. కుటుంబ సమేతంగా ప్రయాణించేవారిలో ఎక్కువమంది ఈ ఏడాది సొంత కార్లను ఎంచుకున్నారు.

రైల్వే ప్రయాణికుల సంఖ్యను కమర్షియల్ విభాగం అధికారులు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ, వివిధ ప్రదేశాలకు వెళ్లే నిర్ధిష్టమైన రైళ్లు, బోగీలు, సీట్ల సంఖ్యను బట్టి 12, 13 తేదీల్లో గుంటూరు, విజయవాడ, విశాఖతోపాటు రాయలసీమ వైపు వెళ్లిన ప్రయాణికుల సంఖ్య సుమారుగా తెలిసింది.  హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, చెన్నై రహదారుల్లో ఉన్న టోల్‌ప్లాజాల దగ్గర నమోదైన వాహనాల సంఖ్య ఆధారంగా, ఆర్టీసీ అధికారుల గణాంకాల ప్రకారం రాష్ట్రానికి వచ్చిన పండగ బంధువుల వివరాలు అటూ ఇటుగా తెలిశాయి.
 
తగ్గిన రైళ్లు.. పెరిగిన ఇక్కట్లు
దక్షిణమధ్య రైల్వే  గత సంవత్సరం 50 రైళ్లను అదనంగా నడపగా ఈ సారి వాటి సంఖ్యను 27కు తగ్గించారు.  రద్దీ మార్గాల్లో పలు  ప్రధాన రైళ్లకు అదనపు  బోగీలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ  ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోయారు. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు  తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వ చ్చింది. హైదరాబాద్ నుంచి వైజాగ్ మార్గంలో, శ్రీకాకుళం వైపు  ప్రత్యేక రైళ్లు నడపడంలో  దక్షిణమధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్‌ల మధ్య సమన్వయం కొరవడడంతో  అదనపు రైళ్లు అందుబాటులోకి రాలేదు. దాంతో ప్రయాణి కులు చాలా ఇబ్బంది పడ్డారు. రైళ్లల్లో రిజర్వేషన్‌లు  లభించకపోవడంతో  చాలా  మంది దూరప్రాంతాలకు సైతం ప్యాసింజర్ రైళ్లల్లో  కిటకిటలాడుతూ  బయలుదేరారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu