2016.. బ్యాంకింగ్‌కు సవాళ్ల సంవత్సరం!
బేస్ రేటు నిర్ణయానికి నిబంధనలూ సమస్యే..!
ముంబై: పలు సవాళ్లతో బ్యాంకింగ్ రంగం 2016లోకి అడుగుపెట్టింది. అందులో మొదటిది మొండిబకాయిల సమస్య. ఈ విలువ దాదాపు 60 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిస్తున్న విధంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపుకల్లా ఈ భారాన్ని బ్యాంకింగ్ తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ ప్రధాన సవాలు... పెరగనున్న పోటీ వాతావరణం. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రెండింటికీ ఈ సమస్య ప్రధానమైదే. రెండు కొత్త తరహా బ్యాంకులు- పేమెంట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల రూపంలో ప్రధానంగా తాజా పోటీ ఎదురుకానుంది. కనీస రుణ రేటు (బేస్) నిర్ణయానికి సంబంధించి ఏకరీతి విధానం అమలు దిశలో ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాలు కూడా బ్యాంకింగ్ సవాళ్లలో ఒకటి. ఆర్‌బీఐ రెపో రేటు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ యథాతథంగా కస్టమర్‌కు బదలాయించాలన్న సిద్ధాంతం సరికాదని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య బహిరంగంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయా అంశాలపై బ్యాంకింగ్ ప్రముఖుల అభిప్రాయాలూ చూస్తే...
సేవలదే విజయం
కస్టమర్లు, వారికి అందుతున్న అత్యుత్తమ సేవలే ఈ రంగంలో పోటీలో నిలబడాలనుకునే వారికి ప్రధాన అంశాలు. ఇక దీనికి టెక్నాలజీ రంగంలో ముందడుగు వేయడం కీలకం. బ్యాంకింగ్ అంతా దాదాపు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉంది. సాంప్రదాయక బ్యాంకింగ్ విధానాలకు రానున్నది సవాలే. సేవల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం మరింత పెరగాలి.
- చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్
కొత్త బ్యాంకులకు కొన్ని సానుకూలతలు..
కొత్తగా బరిలోకి వస్తున్న బ్యాంకులకు కొన్ని సానుకూలతలు ఉన్నాయి. పరిశ్రమ స్థాయి వేతన ఒప్పందాలకు ఆయా బ్యాంకులు తక్షణం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేకపోవడం ఇక్కడ ప్రధానంగా గమనించదగింది. వ్యయ భారాల కోణంలో ఇది లాభించేదే. ఇక ఆయా బ్యాంకులు ప్రారంభంతోనే అత్యాధునిక సాంకేతిక, సేవా విధానాలను అవలంభిస్తాయి.
- అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
వేగం పెరగాలి...
ఇచ్చిన రుణాలు తగిన విధంగా వసూలు అవుతాయా లేదా? మూలధన... ఈ రెండు అం శాలూ బ్యాంకింగ్‌కు కీలకమైనవి. అయితే ఆయా అంశాల్లో ఇప్పుడిప్పుడే కొంత మెరుగుదల ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ దిశలో సంస్కరణలు కొంత నెమ్మదిగా ఉన్నాయి. సవాళ్లను ఎదుర్కొనే విషయంలో చొరవల వేగం మరింత పెరగాలి.
- విభా బత్రా, ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్
Post a Comment