-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 02, 2016

కొత్త ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు!

కొత్త ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు!
 ► 10-30% వేతనాల వృద్ధి
 ►  నియామక ప్రణాళికల
 ►  రూపకల్పనలో కంపెనీలు
 ►  ఆర్థిక వృద్ధి అంచనాలు, ప్రభుత్వ చర్యలే కారణం

 న్యూఢిల్లీ:
 నూతన సంవత్సరంలో జాబ్ మార్కెట్ కళకళలాడనున్నది. అటు నిరుద్యోగులకు, ఇటు ఉద్యోగులకు ఇద్దరికీ కొత్త సంవత్సరం కలసిరానుంది. 2016లో కంపెనీలు దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అలాగే ఉద్యోగ వేతనాలు కూడా 10-30 శాతం పెరగనున్నాయి. 2015లో జాబ్ మార్కెట్ బుల్లిష్‌గానే ఉందని, అదే ట్రెండ్ కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతుందని హెచ్‌ఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు అనుకూలముగా ఉండటం, ఫైనాన్స్, రిటైల్, టెక్నాలజీ రంగాల్లో స్టార్టప్ అనుకూల పరిస్థితుల కల్పన వంటి అంశాలు కారణాలుగా నిలువనున్నాయి.

 ఉద్యోగాల సృష్టి
 కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు దేశంలో ఉద్యోగాల సృష్టికి దోహదపడనున్నాయి.అంతర్జాతీయ కంపెనీలు భారత తయారీ రంగం సహా ఇతర ఎఫ్‌డీఐ అనుకూల రంగాల్లోకి ప్రవేశించడం జాబ్ మార్కెట్ వృద్ధికి ఊతమిచ్చే అంశం. ప్రభుత్వపు డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా కార్యక్రమాలు వల్ల టెక్నాలజీ, తయారీ రంగాల్లో ఉద్యోగ సిబ్బంది డిమాండ్ పెరుగుతుందని టైమ్స్‌జాబ్స్.కామ్ సీవోవో వివేక్ మధుకర్ తెలిపారు. జాబ్ మార్కెట్ వృద్ధిలో ఈ-కామర్స్, స్టార్టప్స్ కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తాయని చెప్పారు. భారత వ్యవస్థీకృత  రంగంలో ఈ ఏడాది 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరగవచ్చని మైహైరింగ్‌క్లబ్.కామ్, జాబ్‌పోర్టల్.కో.ఇన్ సీఈవో రాజేశ్ కుమార్ తెలిపారు.

 ఇక టైమ్స్‌జాబ్స్.కామ్ నిర్వహించిన ఓ సర్వేలో దాదాపు 60 శాతం కంపెనీలు నియామక ప్రక్రియకు సానుకూలంగా ఉన్నట్లు తేలింది. కొత్త ఏడాది అన్ని రంగాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ పేర్కొన్నారు.

 వేతనాలు పెరుగుతాయ్..
 ప్రస్తుత ఏడాదిలో ఉద్యోగుల వేతనాల వృద్ధి సగటున 12-14 శాతంగా ఉండొచ్చని, అదే అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఉద్యోగుల వేతనాలు 25-30 శాతంమేర పెరగవచ్చని గ్లోబల్‌హాంట్ మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ గోయెల్ తెలిపారు. కన్సూమర్ వ్యయ సామర్థ్యం పెరగడం, అనుకూల ఆర్థిక వృద్ధి అంచనాలు వంటి పలు అంశాల కారణంగా కొత్త ఏడాదిలో ఉద్యోగుల వేతనాల్లో 10-12 శాతం వృద్ధి నమోదుకావచ్చని టీమ్‌లీజ్ మేనేజింగ్ డెరైక్టర్ విశ్వాసం వ్యక్తంచేశారు. 7వ వేతన సంఘం సిఫార్సులు కూడా వేతనాలు పెంపు అంశాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్‌ఆర్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

 త్రైమాసిక సర్వేలు అదే చెబుతున్నాయి..
 త్రైమాసిక ఉద్యోగ నియామక సర్వేలు కూడా కొత్త ఏడాదిలో జాబ్ మార్కెట్ బాగుంటుందని పేర్కొం టున్నాయి. 2016లో 88 శాతం భారతీయ కంపెనీలు ఉద్యోగ నియామక ప్రణాళికలను కలిగి ఉన్నాయని గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ సంస్థ స్నాప్‌షాట్ వెల్లడించింది. కొత్త ఏడాది తొలి 3 మాసాలకు సంబంధించి 42 దేశాల కన్నా భారత్ లో పరిస్థితులు ఆశావహంగా ఉన్నాయని మ్యాన్‌పవర్ త్రైమాసిక ఎంప్లాయ్‌మెంట్ సర్వే పేర్కొంది.

 స్టార్టప్స్ కూడా కారణం
 స్టార్టప్స్‌లోకి నిధుల ప్రవాహం వల్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని కోక్యూబ్స్ టెక్నాలజీస్ సీఈవో హర్‌ప్రీత్ సింగ్ తెలిపారు. దేశంలో వంద స్మార్ట్ సిటీల ఏర్పాటు, మేకిన్ ఇండియా వల్ల తయారీ, వాహన పరిశ్రమ రంగాల్లో నియామకాలు పెరుగుతాయని మ్యాన్‌సర్ కన్సల్టింగ్ సంస్థ సీఈవో సత్య డి సిన్హా పేర్కొన్నారు. ఉపాధి కల్పనలో టెక్నాలజీ సంబంధిత రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని స్పెక్ట్రమ్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సహ వ్యవస్థాపకుడు విదూర్ గుప్తా చెప్పారు.

  కొత్త ఏడాదిలో బయో-సెన్సైస్ విభాగంలో కూడా నియామకాల జోరు ఉండొచ్చని జీహెచ్‌సీఎల్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ త్రిపాఠి అన్నారు. ఐటీ రంగం దాదాపు 2.7 లక్షల మందికి, ఈ-కామర్స్ రంగం 1.5 లక్షల మందికి, డిజిటల్ మార్కెటింగ్ 1.5 లక్షల మందికి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సింగ్ రంగం 3 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ రీతూపర్ణ చక్రవర్తి తెలిపారు. అన్ని రంగాల్లోని పరిశ్రమల్లోనూ వృద్ధి నమోదు అవుతుండటంతో నియామకాల జోరు పెరుగుతుందని క్లిక్‌జాబ్స్. కామ్ డెరైక్టర్ సౌరభ్ గుప్తా చెప్పారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu