-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

January 02, 2016

ఎవరికోసం పార్టీ మారుతున్నావ్?


ఎవరికోసం పార్టీ మారుతున్నావ్?
♦ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ధ్వజం
♦ వియ్యంకుని ఆస్తులు రక్షించుకునేందుకే టీడీపీ జపం
♦ విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి ఎలా చేసుకుంటావ్?
♦ అసలు రాజకీయ పార్టీలన్నా, ప్రజలన్నా నీకు గౌరవం ఉందా?
♦ వైఎస్ కుటుంబంతో లబ్ధి పొంది వారికే వెన్నుపోటు

 జమ్మలమడుగు: ఎవర్ని ఉద్దరించడానికి పార్టీ ఫిరాస్తున్నావు..? వియ్యంకుడు కేశవరెడ్డి ఆస్తులు కాపాడుకోవడమే ఏకైక లక్ష్యం కాదా..? అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ, సోదరుడు గిరిధర్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తాళి కట్టించుకుని ఎమ్మెల్యే అయ్యావు. విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లికి ఎలా రెడీ అవుతావు?’’ అంటూ దుయ్యబట్టారు.

రాజకీయంగా ఆదరించిన వైఎస్ కుటుంబానికే ద్రోహం చేయడం నీచమని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆదినారాయణరెడ్డి గతంలో చాలాసార్లు ప్రకటించారని, ఏరోజు కూడా రాజీనామా చేసిందిలేదని ఎద్దేవా చేశారు. ‘‘2005లో మున్సిపల్ ఎన్నికల్లో మూడు కౌన్సిలర్ స్థానాలు సంపాదించుకుంటే తన పదవికి రాజీనామా చేస్తామన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయకపోతే రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఏరోజూ మాటపై నిలబడలేదు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు’’ అని విమర్శించారు.

 వియ్యంకుడి ఆస్తులు కాపాడుకునేందుకే
 ఎమ్మెల్యే ఆది వియ్యంకుడు కేశవరెడ్డి పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సుమారు రూ.800 కోట్లు డిపాజిట్లు సేకరించారని రామసుబ్బారెడ్డి తెలిపారు. ఆ తర్వాత డిపాజిట్‌దారులను మోసం చేయడంతో చట్టపరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆ కేసులో ఇరుక్కున్న వియ్యంకుడి ఆస్తులను కాపాడుకునేందుకే ఆది టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారే తప్ప జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఉద్ధరించడానికి కాదని ధ్వజమెత్తారు. అవకాశవాదంతో పార్టీలు మారుతూ విలువల్లేని రాజకీయం చేయడం సిగ్గు చేటని విమర్శించారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులు ఎవరు వచ్చినా టీడీపీలోకి ఆహ్వానిస్తామని, అదే సమయంలో చౌకబారు రాజకీయ నాయకులకు తమ పార్టీలో చోటులేదని ఆయన స్పష్టంచేశారు.

 వైఎస్ కుటుంబానికి ద్రోహం....
 వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా వారి వల్ల లబ్ధి పొందిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వారికే ద్రోహం చేశాడని రామసుబ్బారెడ్డి విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తారని అందరూ భావించారని, అయితే రాజీనామా చేయకుం డా రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల పక్షాన నిలిచారని గుర్తుచేశారు. ఆ తర్వాత టీడీపీలోకి రావాలనే ప్రయత్నం చేసి, తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి 2014లో వైఎస్సార్‌సీపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందారని చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీకి విడాకులు ఇవ్వకుండానే మరో పార్టీలోకి చేరడానికి సన్నద్ధం అవుతున్నారని ఆరోపించారు. పెండ్లికొడుకు రెడీగా ఉన్నాడు.. పెండ్లికూతురు సిద్ధంగా లేదని ఇటీవల ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu