చేతనబడి
దెయ్యాన్ని దేనికోసమైనా వాడుకోవచ్చు. మంత్రగాళ్లు నాలుగు రాళ్లు వెనకేసుకోడానికీ... మామిడి కాయలు రాలకుండా ఉండడానికీ...మైండ్ గేమ్ ఆడుకోడానికీ, పాడుకోడానికీ... దెయ్యాన్ని వాడుకోవచ్చు. కానీ ‘మారాల’ ఊరి యువత.. దెయ్యం మాయలో పడలేదు. దారి కాశారు... మాటు వేశారు. అసలు దెయ్యం ఎవరో కనిపెట్టారు.
అది అనంతపురం జిల్లా మారాల గ్రామం. ఊరికి దూరంగా ఉంటూ, ఊరితో సంబంధం ఉన్నట్లే ఉంటాయి తండాలు. బోడే నాయక్ తండా కూడా అలాంటిదే. తండాలో మంచిబావి, తండాకు ఆనుకుని తోటలు, అందరికీ చేతిలో పని ఉంటుంది. ఒక హ్యాబిటేషన్‌లో జనం ప్రశాంతంగా జీవించడానికి అనువైన వాతావరణమనే చెప్పాలి. ఏ ఉపద్రవాలూ లేకపోతే ఏదో ఒక ఉపద్రవాన్ని మనమే సృష్టించుకుంటాం. అది మనుషుల నైజం. పగలంతా పని చేసుకుని రాత్రి భోజనం చేసి మంచాల మీద పడుకున్న తర్వాత నిద్ర వచ్చే వరకు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. అది గాసిప్ అయినా ఫరవాలేదు.
కిష్టప్ప భోజనం చేసి మంచం మీద పడుకున్నాడు. ఎండాకాలం ఉక్కపోత. ఎంతకీ నిద్రరావడం లేదు. ‘రే య్! నువ్వు ఇయ్యాల బాలమోళ్ల తోపులోకి పనికిపోయావంట’ అంటూ మరో మంచం మీదున్న తమ్ముడిని పలకరించాడు. ‘ఆ’ అంటూ అటు తిరిగి పడుకున్నాడు మారెప్ప. ‘ఇంకెప్పుడూ అటెల్లకు, రాత్రయితే అసలే ఎల్లకు. దెయ్యం తిరుగుతోందక్కడ’ అనేసి పక్కకు తిరిగి నిద్రకుపక్రమించాడు. నిద్రలోకి జారుకుంటున్న మారెప్ప దిగ్గున లేచి కూర్చున్నాడు. నిద్ర గాలికెగిరిపోయింది. పగలంతా ఆ తోపులోనే పనిచేసి వస్తిని... ఏమౌవుతుందో ఏమో! మంచం దిగాడు, తనతోపాటు ఆ రోజు తోపులోకి పనులకొచ్చిన వాళ్లను నిద్రలేపడానికి వెళ్లాడు. అంతా కలిసి బాలమోళ్ల తోపు కనిపించేటట్లు ఒక చోట మాటు వేశారు. ‘అదుగో వెళ్తోంది’ అంటూ చేయి చూపించారొకరు. జుట్ట ‘విరబోసుకుని ఉంది’ మరొకరు తాను గమనించిన విశేషణాన్ని తెలియచేశారు. ‘మీ అన్న చెప్పింది నిజమేరా!’ అంటూ వణికిపోయాడు అసలేమీ చూడని ఓ కుర్రాడు.
‘తోపులో దెయ్యం తిరుగుతోంది’ అని ఊరంతా పొక్కిపోయింది. దాదాపుగా అందరిలో లీలగా ఉన్న అనుమానం బలపడింది. ఆ తోటల వాళ్లకూ భయం పట్టుకుంది. ఎవరికీ చెప్పుకోకుండా ఎవరి తోటను వాళ్లు రాత్రిళ్లు కాపలా కాసుకోసాగారు. ఓ రోజు విరూపాక్షరెడ్డి దెయ్యం తన తోటలోకి పోవడాన్ని చూశాడు. మరో రోజు ఎల్లప్ప తోపులోకి వెళ్లడాన్ని కూడా చూశాడు. ఆ సంగతిని ఎన్నో రోజులు మనసులో దాచుకోలేక ఓ రోజు ఎల్లప్పతో చూచాయగా బయటపెట్టాడు. తానూ చూశానన్నాడు ఎల్లప్ప. తోటల యజమానులకు దెయ్యం పెద్ద సవాల్‌గానే అనిపించింది మొదట్లో. మెల్లగా ఆ దెయ్యం భయాన్ని పెంచి పోషించారు. ఆ పుకారుతో కాపును దొంగలబారి నుంచి కాపాడుకోవచ్చనేది వారి వ్యూహం. ప్రతి చర్యకూ ఓ ప్రతి చర్య ఉన్నట్లే... ప్రతి పనికీ ఎవరి లెక్కలు వారికుంటాయి. దెయ్యం తిరుగుతుందన్న భయంతో చీకటి పడితే తోటల పరిసరాల్లో మనుషులు మెదలడం లేదు. ఇక ఆ తండాలో రాత్రి ఎనిమిది అవుతుందో లేదో అన్ని ఇళ్ల తలుపులూ బిగించుకుంటున్నాయి. అప్పటి వరకు అర్ధరాత్రి తర్వాత కనిపించిన దెయ్యం, తొమ్మిదింటికే కనిపించసాగింది. తోటల్లో తిరిగే దెయ్యం ఆ తండా ఆచారి ఇంటి పరిసరాల నుంచి వస్తోందని, కాదు కాదు గుడిలో ఉంటోందని ఒకరు, ఊరి దిగుడు బావిలో నుంచి అర్ధరాత్రి బయటకొస్తోందని ఒకరు చెప్పసాగారు. తెల్లవారు జామున బావికెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే భయం, తోటల్లో, పంట పొలాల్లోకి పనులకెళ్లాలంటే భయం, మిట్టమధ్యాహ్నం అయినా భయమే, కనుచూపు మేరలో మనిషి కనిపించకపోతే చాలు... దెయ్యం కనిపిస్తుందేమోనని భయం. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే భయపడుతున్నారు తండా వాసులు..
ఇలాగైతే లాభం లేదు. ఊరు ఊరంతా ఏ పనీ చేయకుండా చేతులు ఒళ్లో పెట్టుకుని భయంతో వణికిపోతూ ఉంటే కడుపులోకి అన్నం వెళ్లేదెలాగంటూ తండా పెద్దలు కార్యరంగంలోకి దిగారు. ‘దెయ్యాన్ని తరిమేయాలి’ తీర్మానించారంతా. ఒక్కొక్కరు తమకు తెలిసిన మంత్రగాళ్ల పేర్లు చెప్పసాగారు. అరివీరభయంకర మంత్రగాడు, దెయ్యాలకు సింహస్వప్నం లాంటి మంత్రగాడనే పేరున్న ఓ మంత్రగాడిని పిలిపించారు. ఈ విషయంలో ఊరంతా ఐకమత్యంతో పని చేసింది. సామూహికంగా జాతర చేశారు. మేకపోతును బలి ఇచ్చి ఊరి చుట్టూ ధార పోశాడు మంత్రగాడు. ఆకాశంలోకి చూస్తూ ‘అష్టదిగ్బంధనం చేశాను. ఇక ఈ గీత దాటి ఊళ్లోకి రావడానికి వీల్లేద’ంటూ కళ్లు ఉరుముతూ దెయ్యాన్ని ఆజ్ఞాపించాడు. తనకు రావాల్సిన డబ్బు, వాయనాలందుకుని వెళ్లిపోయాడు. ఊరంతా హాయిగా నిద్రపోయింది. అదీ రెండు రోజులే. మూడో రోజు మళ్లీ జుట్టు విరబోసుకున్న దెయ్యం తోటల్లో తిరుగుతోంది.
ఇంతకీ ఏం జరుగుతోంది?
ఇది ఆ తండాలో అభ్యుదయకోణంలో ఆలోచించే యువకులకు వచ్చిన ప్రశ్న. ‘యంగ్ ఇండియా’ ప్రాజెక్టు చురుగ్గా పని చేస్తున్న యువకులు ఏకమయ్యారు. దెయ్యం మిస్టరీ చేధించాలనుకున్నారు. వారి ప్రణాళిక అమలు చేయడానికి వేదిక కావాలి. ఆ ఊరి మొత్తానికి ఒకటే మిద్దె ఇల్లు. ఆ ఇంటి వారిని ఒప్పించి యువకులంతా రాత్రి అక్కడే మకాం వేశారు. మధ్య రాత్రిలో భాస్కర్ చేతులు చరుస్తూ ‘అదిగో వెళ్తోంది’ అని ఒక్కసారిగా అరిచాడు. మిగిలిన వారంతా అప్రమత్తం అయ్యారు. ‘ఆచారి శేషయ్య ఇంట్లో నుంచి వచ్చి, దిగుడుబావి దగ్గరకు వెళ్తోంది’ అన్నాడు భాస్కర్. అంతా చూస్తూనే ఉన్నారు, కొంతసేపటికి బావిలో నుంచి బయటకొచ్చి చీనీ తోటలోకెళ్లింది దెయ్యం. ‘వెనుకే వెళ్లి చూద్దాం’ అన్నాడో యువకుడు. అనుసరించడానికి కొందరికి ధైర్యం చాలడం లేదు. ఈ మీమాంసలో దెయ్యం మాయమైంది.
మిస్టరీ వీడింది!
మరుసటి రోజు రాత్రి కూడా నిఘా వేశారు. మళ్లీ అదే ఇంటి నుంచి మొదలైంది. ఈ రెక్కీ నాలుగు రోజులు సాగింది. ఓ రోజు బావిలో నుంచి వచ్చి నేరుగా గుడిదారి పట్టింది. నిశ్శబ్దంగా అనుసరించారు యువకులంతా. గుళ్లో కెళ్లగానే యువకులంతా ఆశ్చర్యంగా నోరు తెరిచారు. ఆచారి ఇంటికి వెళ్లి చెప్పారు. ఆ సంగతి అతడికీ ఆశ్చర్యమే. బాధను తమాయించుకుని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాడు. ఊళ్లో అందరికీ చెప్పి అల్లరి చేయవద్దని బతిమలాడాడు. ఆ తర్వాత మారాల గ్రామం, బోడేనాయక్‌తండాలో ఎవరికీ దెయ్యం కనిపించలేదు.
గుళ్లో ఏం కనిపించింది?
ఆచారి శేషయ్యకు మానసిక పరిణతి లేని ఓ చెల్లెలు, పేరు నీలమ్మ. యువకులు అనుసరిస్తూ వెళ్లి చూసేటప్పటికి ఆమె గుళ్లో తులసికోట ముందు కూర్చుని ఉంది. దగ్గరకు వెళ్లి ‘నీలమ్మా!’ అని పిలవగానే ఉలిక్కిపడింది. భయంతో బిగుసుకుపోయింది. ఆమెకు ఇంటికి వెళ్దాం అని నచ్చచెప్పి ఇంటికి తీసుకెళ్లి అన్నావదినలకు అప్పగించారు యువకులు.
ఆకలి తీరకనే!
నీలమ్మను ఇంట్లో ఎవరూ పట్టించుకునే వారుకాదు. ఆమె ఆలయానికెళ్లి పూజారులు పళ్లేలలో పెట్టిన బెల్లం పొంగలి, కొబ్బరి, అరటి పండ్లు తిని ఆకలి తీరాక ఇల్లు చేరేది. గుళ్లో ప్రసాదాలు దొరక్కపోతే తోటల్లోకెళ్లి కాయలు కోసుకుని తినేది. మధ్యలో ఎక్కడ ఫిట్స్ వస్తే అక్కడే పడిపోయేది. తెలివి వచ్చాక ఇంటికెళ్లేది. మేమంతా మిద్దె ఇంటి మీద ఒక్కొక్కరు రెండు గంటలు నిద్రమేల్కొని కాపలా కాసి మిస్టరీ ఛేదించాం. - ఎస్. శంకర శివరావు కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment