ఎదుటి వ్యక్తి హీరో అయినా సరే.. గుణం నచ్చితేనే పోసాని చెయ్యి లేస్తుంది. సెల్యూట్ కొడుతుంది. ‘టెంపర్’లో ఆయన చేసిన కానిస్టేబుల్ పాత్ర అతని వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది. కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడే స్వభావంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. రాజీపడలేదు. రచయితగా ఒక సక్సెస్‌ఫుల్ ఇన్నింగ్స్ ఆడి.. ఇప్పుడు నటుడిగా మరో ఇన్నింగ్స్‌లో దూసుకెళుతున్నాడు పోసాని కృష్ణమురళి. ఈ ఏడాది ఏకంగా పాతిక పైగా చిత్రాల్లో చేస్తున్న ఆయనలోని పలు కోణాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది ‘నవ్య’.
ఆక్రోశాన్ని వెల్లగక్కే పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. మీతోనే ఇలాంటివి ఎందుకు చేయిస్తుంటారు?
పోసాని ఎవరి జోలికి వెళ్లడు. కాళ్ల మీద పడడు. లంగా పనులు చేయడు. చీప్‌గా బిహేవ్ చేయడు. రాంగ్‌రూట్‌లో వెళ్లడు. సినిమాకు కథ రాయమంటే రాస్తాడు, డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. యాక్టింగ్ చేయమంటే చేస్తాడు, డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. అంతే తప్ప మోసం చేయడు. ముప్పయి ఏళ్ల నుంచి నా వ్యవహారశైలి ఇండసీ్ట్రవాళ్లకు తెలుసు. అందుకని కొన్ని పాత్రలు కృష్ణమురళికి సూటవుతాయని ఇస్తున్నారు. రియల్ లై్‌ఫలో అంతో ఇంతో సిన్సియారిటీ ఉంటేనే.. తెరమీద సిన్సియారిటీ కలిగిన పాత్రలు చేసినప్పుడు ప్రేక్షకులకు నచ్చుతాయి.
‘టెంపర్’లో మీరు చేసిన పోలీసు కానిస్టేబుల్ పాత్ర తాను చేసుంటే ఇంకా అద్భుతంగా ఉండేదని జగపతిబాబు అన్నారు?
అది ఆయన అభిప్రాయం, తప్పులేదు. ఆ సినిమాలో హీరో ఎన్టీఆర్‌ను కానిస్టేబుల్ పాత్ర వేసిన పోసాని తిడితేనే పండుద్ది. స్టార్ ఇమేజ్ కలిగిన ఎన్టీఆర్‌ను తిట్టే పాత్ర ఒక నటుడు చేయాలంటే.. అతనికొక ఇమేజ్ ఉండాలి. రియల్‌లై్‌ఫలోను ఒక నిజాయితీపరుడై ఉండాలి. అప్పుడే సినిమాలో చేసిన ఆ క్యారెక్టర్‌కు జీవం వస్తుంది. కానిస్టేబుల్ పాత్రను చేస్తే పోసాని కృష్ణ మురళి మాత్రమే చేయాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ ఫిక్స్ అయ్యాడు. ఎవరు చెప్పినా వినలేదు. నా పాత్ర ఎన్టీఆర్‌కు ఎంత నచ్చిందంటే - సినిమా ఎడిటింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడికి రమ్మని నాకు ఫోన్ చేశారు. ఇంత రాత్రిపూట కబురు పెట్టారేమిటని హడావుడిగా వెళ్లాను. ‘‘పోసాని గారు మీరు కానిస్టేబుల్‌గా అదరగొట్టారు. ఐ లవ్ యు’’ అంటూ ఎన్టీఆర్ నన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. సినిమా రిలీజైన తరువాత కూడా ఎంతో మంది పోలీసు ఆఫీసర్లు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి అభినందించారు. నా పర్సనల్ క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్‌కు హెల్ప్ అయ్యింది.
ఇలాంటి క్యారెక్టర్లకు మీరు బాగుంటారని గుర్తించిన దర్శకులు..?
‘పోసాని ఏడుపు సీన్లు ఇస్తే ఏడిపిస్తాడు. విలన్ చేయమంటే భయపెడతాడు. కామెడీ చేయమంటే నవ్విస్తాడు. ఏ వేషమైనా సిన్సియర్‌గా చేస్తాడు. అతని ఫేసు ఏ క్యారెక్టర్‌కు అయినా నప్పుతుంది..’ అని నమ్మారు దర్శకులు. నేను రైటర్‌గా ఉన్నప్పుడు.. హీరోలకు డైలాగులతో సహా కథ చెప్పడం నాకు అలవాటు. ఇప్పటి దర్శకుల్లో చాలామంది అప్పట్లో సహాయదర్శకులుగా నన్ను చూశారు. నా భావోద్వేగాలు వాళ్లకు తెలుసు. ఇప్పుడు వాళ్లందరూ దర్శకులు అయ్యారు. నాకు అవకాశాలు ఇస్తున్నారు. నన్ను ఎంతోమంది గుర్తించారు కానీ పూర్తిస్థాయిలో గుర్తించింది మాత్రం పూరీ జగన్నాథ్. ‘టెంపర్’లో నాకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారాయన. అంతకుముందు నేను తీసిన ‘మెంటల్‌కృష్ణ’ నాకు అడ్వాంటేజ్ అయ్యింది. ‘నాయక్’ హిట్ అయినప్పుడు దర్శకుడు వినాయక్ మా ఇంటికి వచ్చాడు. ‘నాకు మంచి పాత్ర ఇచ్చావు. ధన్యవాదాలు’ అన్నాను. ‘నాకు ఎందుకు చెప్పడం మురళిగారు. మెంటల్‌కృష్ణతో నీకు నువ్వే ప్రమోట్ చేసుకున్నావు. ఆ సినిమా చూసి నీకు ఎవరైనా వేషాలు ఇవ్వగలరు’ అన్నారు. అందుకే ‘మెంటల్‌కృష్ణ’ నా పెట్టుబడి. దాని ఫలితాలే ఇప్పుడొస్తున్న అవకాశాలు.
మీది చిన్నప్పటి నుంచి ప్రశ్నించే స్వభావమేనా? సినిమాల్లోకి వచ్చాక అలవడిందా?
చిన్నప్పటి నుంచి ఇదే స్వభావం. నేను మారలేదు. అప్పటికీ ఇప్పటికీ ఒకేలాగ ఉన్నాను. కాలేజీ రోజుల్లో గుంటూరులోని నాజ్ థియేటర్‌లో నేను, స్నేహితుడు బోయపాటి రమేష్ బుకింగ్‌లో టికెట్లు అమ్మేవాళ్లం. ఆ థియేటర్ యజమాని ముస్లిం. హాల్‌లోకి ఆయన వస్తూనే అందరూ లేచి నిల్చుని నమస్కారం పెట్టేవాళ్లు. నేను పైకి లేచి పెట్టలేదు. కనిపించినోడికల్లా ఊరికే నమస్కారం పెట్టడం, ఇష్టం లేకపోయిన వంగి విష్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అలాగని నేను అమర్యాదగా ఉండను. సిన్సియర్ అయితే ఆఫీస్ బాయ్‌కి కూడా తలొంచి నమస్కారం పెడతా. వెయ్యి కోట్ల ఆస్తి కలిగిన ధనవంతుడు వెధవ అయితే వాడికి నమస్కారం పెట్టను. నా చెయ్యి చచ్చినా పైకి లేవదు. ‘టెంపర్’లో హీరోకు సెల్యూట్ చేయని కానిస్టేబుల్‌లాగ. థియేటర్‌లో ఆ ఓనర్‌కు సెల్యూట్ చేయలేదని మరుసటి రోజు మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసిపారేశారు. ఓనర్‌ను కలిస్తే ఉద్యోగంలోకి మళ్లీ తీసుకోవచ్చు. కానీ కలవలేదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి మనకు పూర్తిగా తెలియకపోయినా.. ఆ వ్యక్తి బాహ్యస్థితిగతులు చూసి నమస్కారం పెట్టే తత్వం కాదు నాది. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా గుణవంతుడు అయితేనే మనస్ఫూర్తిగా గౌరవిస్తాను.
చదువుకునే రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా వచ్చాయా?
నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు ఫస్ట్‌ఇయర్ చదువుతున్నప్పుడు జరిగిందీ సంఘటన. క్లాస్‌రూంలోకి ప్రొఫెసర్ బొడ్డుపల్లి పురుషోత్తం వస్తున్నాడంటే మిలటరీ సైన్యంలాగ అందరూ లేచి నిల్చునేవాళ్లు. బెంచిలో కూర్చున్న నేను లేవలేదు. ఆయన చెప్పే పాఠాలతో, ఆయన మంచితనంతో మనకు ప్రేమ పెరగాలి కానీ.. ఊరికే నమస్కారం ఎందుకు పెట్టడం అని అలాగే ఉండిపోయాను. నన్ను చూసిన ప్రొఫెసర్ నా వద్దకు వచ్చి.. ‘‘నేను రాగానే అందరూ లేచి నిల్చుంటే నువ్వు మాత్రం అలాగే కూర్చున్నావేంటి? నీలాంటి వాళ్లను చాలామందిని చూశాను. బయటికి వెళితే బొచ్చలు మోస్తావు. జాగ్రత్త!’’ అన్నాడు. ఈగో మనిషిని ఎంతైనా చేస్తుంది అనేందుకు ఆ సంఘటన నిదర్శనం. నా ముందు అంతటి ప్రొఫెసరే ఈగో దెబ్బతిని నాకంటే చిన్నపిల్లవాడైపోయాడు. ‘మీకు ఎందుకు నమస్కారం పెట్టాలి. యూనివర్శిటీ అప్లికేషన్‌లో ఆ విషయం రాయలేదే. ఏ వ్యక్తికి నమస్కారం పెట్టాలి? ఏ వ్యక్తికి పెట్టకూడదో నాకు తెలుసు. బొచ్చలు మోసినా ఫర్వాలేదు. నీకు పెట్టనుపో’ అన్నాను. ఆచార్య దొణప్ప గారొస్తే బెంచిలో నుంచి లేచేవాణ్ణి. ఆయనకు విద్యార్థులకు చదువు చెప్పాలన్న అంకితభావం ఉంది. అందుకే అలాంటి వాళ్లంటే నాకు గౌరవం.
మీ తోటి మనుషులతో మీ ఉద్వేగాలు ఎలా ఉంటాయి?
ఇండసీ్ట్రలో నాకు మిత్రులు లేరు. శత్రువులు లేరు. అందరూ ట్రావెలర్సే! పూజ్యులు, గౌరవనీయులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ఉన్నారంతే! మనుషులు లేరు. మంచివాడంటే మాట్లాడతా. చెడ్డవాడంటే మౌనంగా ఉంటా. గుడ్ హ్యూమన్ బీయింగ్‌గా బతకడం నాకు ఇష్టం. ఏడుపొస్తే ఏడవాలి. నవ్వు వస్తే నవ్వాలి. నిద్ర వస్తే పడుకోవాలి. ఆకలేస్తే అన్నం తినాలి. కోపమొస్తే కోపగించుకోవాలి. అంతే నాకు తెలిసింది. వీడు నక్కలాంటోడు, వీడు కుక్కలాంటోడు, వీడు పులి, వాడు సింహం.. మనిషికి జంతువుల బిరుదులు?. అలాంటివి నాకొద్దు. నాలాగ నేను ఉండటమే నాకిష్టం. నాలాగ అంటే మనిషిలాగ. ఆ మనిషి లక్షణాలు ఉన్నోళ్లతో ప్రయాణిస్తుంటాను. ఫ్రెండ్స్ అని పులుముకోవడాలు ఉండవు. రోజూ ఫోన్లలో మాట్లాడుకుని ‘నువ్వులేక నేను లేను’ లాంటివి అస్సలు ఉండవు. అందుకే నేను ఎవ్వరినీ నాకు స్నేహితులు అని, శత్రువులు అని భావించను.
అందర్నీ మీరు క్వశ్చన్ చేస్తుంటారు? మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా? అలాంటి సందర్భం?
నన్ను క్వశ్చన్ చేసి దోషిగా నిలబెట్టిన సందర్భం ఇంతవరకు రాలేదు. నా భార్య నన్ను కొన్నిసార్లు క్వశ్చన్ చేసింది. వాటిని సమాధానాలు చెప్పాను. కన్విన్స్ అయ్యింది. పెళ్లి అయిన కొత్తలో ఒకసారి.. ‘ఏవండీ ఈ అమ్మాయి ఎవరు? నలభై నిమిషాలు మీతో మాట్లాడింది?’ అనడిగింది. ‘నువ్వు ఏమైనా చెక్ చెయ్, కానీ మనిషిని ఎప్పుడూ చెక్ చెయ్యకు. ఆ అమ్మాయి అడ్రస్ ఇస్తా వెళ్లు. అనుమానం ఉంటే ఎందుకు మాట్లాడానో తెలుసుకో’ అని చెప్పాను. ఆ తరువాత మెల్లమెల్లగా నా భార్యకు నా వ్యక్తిత్వం తెలిసింది. అర్థం చేసుకుంది. మా కాపురం నమ్మకం మీద నడవడం లేదు. కేవలం ప్రేమతో నడుస్తున్నది. మా ఇద్దరి మధ్య ఏ మాత్రం అట్రాక్షన్ లేదు. అనుబంధం మాత్రమే ఉంది. అట్రాక్షన్ జీవితకాలం చాలా స్వల్పం. బంధం చచ్చే వరకు మనతో నడుస్తుంది. మా ఇద్దరు మనసులు కలవడానికి కొన్నేళ్లు పట్టింది. నా బెస్ట్ గర్ల్‌ఫ్రెండ్ నా భార్యే!
ఒకప్పటి సినిమా రచయితగా సంతృప్తి ఉందా? ఇప్పటి నటుడిగా హ్యాపీగా అనిపిస్తోందా?
రైటింగ్‌లో చాలా మజా ఉంటుంది. చాలా స్ట్రగుల్ పడాల్సి వస్తుంది. ఒక మంచి కథ, పేలిపోయే డైలాగ్ రాసినప్పుడు మనసు సంతోషపడుతుంది. మనకు ఒక బిడ్డ పుడితే ఎంత ఆనందం కలుగుతుందో రాసినప్పుడు అంత ఆనందం కలిగేది. కానీ నటనలో మజా లేదు. అంతా తెలిసినట్లే ఉంటుంది. అయితే రాతలో కంటే నటనలో లగ్జరీ ఉంది. సౌకర్యాలు సమకూరుతున్నాయి. డబ్బులు వస్తున్నాయి. దానికీ దీనికీ ఇదే వ్యత్యాసం. రైటర్‌గా వంద సినిమాలు రాశాను. ఆ తరువాత రైటర్‌ను మించి.. నాలోని ఆ రైటర్‌ను మరిచిపోయేలా డామినేట్ చేసింది నటన. రైటర్‌గా విమానంలో మామూలు క్లాస్‌లో వెళ్లేవాణ్ణి. ఇప్పుడు నటుడిగా బిజినె్‌సక్లా్‌సలో వెళ్లగలుగుతున్నా. అందుకని రైటింగ్‌ను వదులుకున్నా నాలోని రైటర్ ఏ రోజు బాధపడలేదు. ప్రస్తుతానికి ఆ రైటర్‌కు అనస్తీసియా ఇచ్చి అలా బెడ్డు మీద పడుకోబెట్టాను. పూర్తిగా చంపేయలేదు. అవసరం అనుకుంటే మళ్లీ నిద్ర లేపుతాను.
మీకు కోపం వచ్చినా మౌనంగా చూస్తూ ఉండిపోయేదెప్పుడు?
టీవీల్లో ప్రవచనాలు చూసినప్పుడు. ఇవి ఎవరికి పనికొస్తున్నాయి? స్వాములు జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? అబద్దం చెప్పకూడదు, మాకు తెలీదా! మందు తాగకూడదు, మాకు తెలీదా! దొంగతనం చేయకూడదు, మాకు తెలీదా! వ్యసనాలకు బానిస కాకూడదు, మాకు తెలీదా! బియ్యంలో రాళ్లు తీసేయకపోతే పంటి కింద పడుతుందని మాకు తెలీదా! ఎవడికి తెలీదు? ఏది మంచి ఏది చెడు అన్నది చదువు వచ్చినోళ్లకు, రానోళ్లకు అందరికీ తెలుసు. మీరు చెబితే జనాలు కొత్తగా నేర్చుకుంటారా? మెడలో పూలదండలు వేసుకుని, చొక్కాలు విప్పుకుని, అత్తరు చల్లుకుని, ప్రవచనాలని నీతులని చెవులు చిల్లులుపడేలా టీవీల్లో మోత మోగిస్తున్నారిప్పుడు. ఒత్తులు వెలిగిస్తే పాపాలు పోతాయట. నూనె పోస్తే పాపాలు పోతాయట. కుంకుమ చల్లితే పాపాలు పోతాయట. ఏ టీవీ ఆన్ చేసినా ఇదే రొద. వినేవాడు లేక కాదు చేసేవాడు లేక మన దేశం చెడిపోతోంది. టీవీల్లో ప్రవచనాలు మానేసి ఇలా రోడ్ల మీదికి రండి. చెత్తను ఊడ్చండి. మురుగును శుభ్రం చేయండి. మీరు మంచి పనులు చేస్తే ప్రజలు కూడా అనుసరిస్తారు. ఆ మురికిని మాత్రం మీరు ఎత్తరు. ఈ మురికి మనుషులను మాత్రం బాగు చేస్తారా? అప్పట్లో గాంధీ ఏ ప్రవచనాలు చెప్పాడని. మురికివాడల్లోకి దూసుకు వచ్చాడు. ఆయనను చూసి వెనక పదిమంది వచ్చారు. ఉద్యమం బయలుదేరింది. మార్పు వచ్చింది. అంతేకానీ ‘కొత్తా దేవుడండీ’ అంటూ రోజుకొక స్వామి టీవీల్లో ప్రవచనాలు చెబుతుంటే నాకు కోపం వస్తుంటుంది. కానీ నిస్సహాయుణ్ణి. ఏమీ చేయలేను. బాధ పడటం తప్ప! నేను దేవుణ్ణి పూజిస్తా. కానీ మూఢవిశ్వాసంతో పూజించను. భక్తిని సొమ్ము చేసుకునే వాళ్లను గౌరవించను.
మీ ముక్కుసూటి తత్వం వల్ల కెరీర్‌లో అడ్డంకులు ఏమైనా ఎదురయ్యాయా?
ఒకసారి రామానాయుడుగారితో కూడా నాకు గొడవ అయ్యింది. ఆయన సినిమాకు కథ రాస్తున్నానప్పుడు. ఖర్చు ఎక్కువ పెట్టించి డబ్బు మింగేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు పోసాని అని ఎవరో ఆయనతో చాడీలు చెప్పారట. అది నమ్మిన ఆయన నన్ను పిలిచి ‘పోసానీ నువ్వు నాకు అక్కర్లేదు’ అన్నాడు. నేను కూడా వెంటనే ‘నువ్వు కూడా నాకు అక్కర్లేదు. ఈ సినిమా నేను రాయను’ అనేసి వచ్చేశాను. దర్శకుడు సదాశివరావు నా వద్దకు వచ్చి ‘నాయుడు గారు సినిమా ఆపేశారు మురళీ’ అన్నారు. ‘పోనీలెండి సార్, అనుమానపు మొగుడుతో ఎన్నాళ్లు కాపురం చేస్తాం. వదిలేయండి’ అని చెప్పాను. ఆ తరువాత సరిగ్గా ఐదు నెలలకు రామానాయుడుగారికి అసలు విషయం తెలిసింది. వెంటనే ఈవీవీ సత్యనారాయణకు ఫోన్ చేసి ‘ఏమయ్యా, ఆ మురళిని నా దగ్గరికి పంపించు’ అన్నారు. ఈవీవీ నాకు ఫోన్ చేసి.. ‘నాయుడు గారు ముందు నువ్వేమీ మాట్లాడకు. ఆయన ఇండసీ్ట్రకి తండ్రిలాంటి వాడు. ఎంతోమందికి అన్నం పెట్టాడు’ అన్నాడు. అప్పుడు నేను ‘‘తండ్రిలాంటి వాడు అయితే మరి బిడ్డను ఎందుకు అపార్థం చేసుకుంటాడు’’ అన్నాను. మరుసటిరోజున వెళ్లి నాయుడుగారిని కలిశాను. ‘ఇదిగో అడ్వాన్సు. నా సినిమాకు నువ్వే కథ రాయాలి’’ అన్నారు. రామానాయుడు గారిలో ఎంత గొప్ప క్వాలిటీస్ ఉన్నాయంటే.. చేసిన పొరపాటును దిద్దుకునే వ్యక్తి ఆయన. అహానికి వెళ్లరు. ఎదుటి వ్యక్తి మీద అపోహలు తొలగిపోయిన తరువాత రెట్టింపు ప్రేమను అందిస్తారు. మనసులో ద్వేషం ఉంచుకోరు.
మీ స్వభావం వల్ల సినిమా అవకాశాలను పోగొట్టుకున్న సందర్భాలు?
ఒక పెద్ద దర్శకుడు అయితే ‘‘మురళీని కాలి కింద వేసి తొక్కేస్తాను. నలిపేస్తాను ఏమనుకుంటున్నాడో’’ అన్నాడట. ఎందుకంటే నేను ఆయనకు ఒకసారి ఎదురుతిరిగాను. నేను చేసిందల్లా కథ, మాటలు రాసినందుకు డబ్బులు అడగటం. ‘గురువుగారు ఇచ్చినప్పుడు తీసుకోండి’ అన్నారు అసిస్టెంట్లు. ‘ముందు నా ఫైలు నాకు ఇచ్చేయండి’ అన్నాను. ఆ సినిమా అంతటితో ఆగిపోయింది. అయినా నేను లెక్కచేయలేదు. మళ్లీ క్వశ్చన్ చేయడానికి ఆయన వద్దకు వెళ్లాను. అప్పుడాయన రియలైజ్ అయ్యారు. నా మనసుకు నచ్చే జవాబు చెప్పడంతో అంతటితో వదిలేశాను. అయితే ఆయనంటే ఇప్పటికీ నాకు అమితమైన గౌరవం. ఆ తరువాత చాలామంది అన్నారు ‘ఆయనతో పెట్టుకుంటే తొక్కేస్తాడు’ అని. ‘ఒక వేళ తొక్కేస్తే కారుపార్కింగ్ వద్ద కాపలా ఉంటా. గుమస్తా పని చేస్తా. ఏమీ లేకపోతే చిన్నపిల్లలకు ట్యూషను చెప్పుకుంటా. రోడ్డు మీద నిలబడి వీధి నాటకాలు వేస్తా. గారడీ కూడా చేస్తా. పెళ్లాం పిల్లలను పోషించుకుంటా. అంతేకాని రాజీపడను’ అన్నాను. అదే నీతి మీద ఇప్పటికీ బతుకుతున్నాను. చివరికి పరిశ్రమ నా స్వభావాన్ని అర్థం చేసుకుంది. ఆదరిస్తున్నది.
మీ సక్సె్‌సకు పుస్తకజ్ఞానం పనికొచ్చిందా? సమాజపరిశీలన ఉపయోగపడిందంటారా?
మనిషి పరిపూర్ణుడు కావాలంటే దేశాన్ని అయినా చూడాలి. కోశాన్ని (పుస్తకజ్ఞానం) అయినా చదవాలి. రెండూ ఉంటే పరిపూర్ణుడు అవుతాడు. నేను దేశాన్ని ఎక్కువగా చూశాను. పేకాట ఆడే మా నాన్నను చూశాను. పేకాట వ్యసనం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చూశాను. హఠాత్తుగా భర్తపోతే కుటుంబాన్ని ఎలా నెట్టుకొచ్చేది దేవుడా అని ఏడ్చే నా తల్లి కన్నీళ్లని చూశా. అన్యాయంగా చచ్చిపోయిన మా మేనమామను చూశా. ఆయనకు పురుగుమందులను కలిపి చావుకు కారణమైన వెన్నుపోటుదారుణ్ణి భరించా. తప్పు చేసి చలాయించుకునే మనుషుల్ని చూశా. ఈ పాపాలు, ఘోరాలు నాకు ఎన్నో నేర్పించాయి. ఈ కోణంలోనే నా మనస్తత్వం సంఘర్షణలకు గురయ్యేది. అందులోని మంచి నుంచే ఒక్కో ఇటుక పేర్చుకుని వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నాను. మనం సిన్సియర్ అయితే మన జోలికి ఎవడూ రాడు. అందుకు నేనే సాక్ష్యం. రాజకీయం, కులం, గాడ్‌ఫాదర్లు.. ప్రభావాలు లేకుండా ఎదగలేము అనుకునే సినిమారంగంలో ఇవేవీ లేకుండా నేను ఎదిగాను.
సరదాగా......
మీరు పోలీసు ఆఫీసర్ అయ్యుంటే..
ఏ నక్సల్స్ ఏరియాలోనో పడేసుండేవారు. ఈ పాటికి చచ్చిపోయుండివాణ్ణి.
మీరు ఎవరి వద్ద మౌనంగా ఉంటారు?
ఎవడైతే మూర్ఖుడో, ఎవడైతే వెధవో వాడి దగ్గర నోరు మూసుకుని కూర్చుంటా. దేవుడు దిగొచ్చి చెప్పినా వినని మూర్ఖుడు పోసాని చెబితే వింటాడా.. వినడు. కాబట్టే ఆ మౌనం.
మీరు ఎమ్మెల్యే అయితే కడిగేసుండేవారా?
ప్రజాస్వామ్యంలో ప్రథమ ముద్దాయిలు ప్రజలే. వాళ్లు మేల్కొనే వరకు ఏమీ చెయ్యలేము. డబ్బు పంచనందుకే ఎమ్మెల్యేగా నేను ఓడిపోయాను.
ఎన్నికల వేళ మీకు గుర్తున్న మాట..
పోటీ చేస్తున్న మన ముగ్గురం ఒకే జీపు ఎక్కుదాం. మీ సిద్దాంతం మీరు చెప్పండి. నా సిద్దాంతం నేను చెబుతా. మందు పోయం. డబ్బులు పంచం. కేవలం ఓట్లు అడుగుదాం. గెలుపు ఓటమి ప్రజల ఇష్టం.. అన్నాను. వినలేదు. వింటే రాజకీయనేతలు ఎలా అవుతారు. నేను కాలేకపోయా. వచ్చి ఇంట్లో కూర్చున్నా.
మౌనంగా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తుంటారు..
నన్ను నేను మరిచిపోతా. మౌనం అంటే మన గురించే కాదు, ఇంకెవ్వరి గురించి ఆలోచించకపోవడం. ఆ మౌనం నాకిష్టం. ఏకాంతంలో నేను అద్వితీయ ఆనందాన్ని అనుభవిస్తుంటా.
ఎప్పుడైనా చచ్చిపోవాలి అనిపించిందా..
చచ్చిపోబోయే బతికాను. ఊర్లో ఉన్నప్పుడు ఆత్మహత్యాయత్నం చేశాను. హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బతకను అన్నారు. అదృష్టం బావుండి బతికా. అంతకు ముందు మా కుటుంబంలో నాన్నతో సహా ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేసుకుని చనిపోయారు. బతికింది నేనొక్కణ్ణే!
మీరు ఎవరికీ చెప్పని మీ రహస్యాలు..
నేను రోడ్డు మీద వెళుతుంటే అందమైన ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి బావుందని మా ఆవిడకు చెప్పను. చెబితే ‘మీ భార్యను కూడా ఎదుటి వాళ్లు అలాగే అనుకుంటే’ అంటుంది కాబట్టి (నవ్వుతూ) చెప్పను. రోజుకు వంద రకాల ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటా.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment