-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

March 03, 2016

బిట్టు బిట్టుకో బినామి..?



⇒ పెద్దల ‘భూ’మాయకు ఆధారాలెన్నో..
⇒ ఓ చిరుద్యోగి 30 ఎకరాలు కొనగలడా..? 15 ఎకరాలు కొన్న ప్రమీల ఎవరు?
⇒ బావమరిది పేరుతో 29 ఎకరాలు కొన్నదెవరు?
⇒ నారాయణ భూ దందాలో పాత్రధారులెందరో...
⇒ రూ. 425 కోట్ల హాయ్‌ల్యాండ్‌ను కొట్టేసిన ‘చినబాబు’
⇒  పీఏ పేరుతో 17.3 ఎకరాలు కొన్న కోడెల కుమారుడు
⇒ వాగు పోరంబోకును బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన ధూళిపాళ్ల
⇒ సమీకరణ నుంచి ఎమ్మెల్యే ‘వెంచర్’ తప్పించినందుకు ‘చినబాబు’కు వాటాలు
⇒ రాజధాని ఉప్పందుకున్న పయ్యావుల కేశవ్ కొన్నది 4.09 ఎకరాలు..

రాజధాని ‘భూమాయ’లు ఒకటో రెండో కాదు. తవ్విన కొద్దీ బైటపడుతున్నాయి. రకరకాల మాయోపాయాలతో రాజధాని రైతన్న పొట్టగొట్టి వేల ఎకరాలను కాజేసిన పెద్దల ‘ఘన’కార్యాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చదండు ఆడిన వికృత క్రీడకు వేలమంది రైతులు బలైపోయారు. రాజధాని ఎక్కడ అనే దానిపై గందరగోళం సృష్టించడంతో అమాయక రైతులు అయినకాడికి భూములు అమ్మేసుకున్నారు. రైతులను మోసగించి కారుచౌకగా కొట్టేసిన భూములు ఇపుడు పెద్దలకు కోట్లు కురిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆడిన ‘బినామీ’ నాటకాలు చూస్తే మనకు కళ్లు తిరగడం ఖాయం..

► రాజధానిగా ప్రకటించనున్న ప్రాంతంలో మంత్రి నారాయణ బిట్లు బిట్లుగా దొరికినచోట దొరికినట్లు భూములు కొనేశారు. అరెకరం, 45 సెంట్లు, 87 సెంట్లు ఇలా ముక్క దొరికితే చాలు కారుచౌకగా స్వాహా చేశారు. పనివాళ్లు, బంధువులు, ఉద్యోగులు ఇలా అందరి పేర్లను వాడేసుకున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోనూ మంత్రిగారు బినామీ పేర్లతో పాగా వేశారు. మంత్రిగారి దూకుడు, పనితనం గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని వ్యవహారాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యతలను ఆయన భుజస్కం ధాలపైనే పెట్టేశారు. అలా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ రాజధానిలో ఆయనే పెద్దదిక్కు అయ్యారు.

► స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు తన వ్యక్తిగత కార్యదర్శి పేరుతో 17.3 ఎకరాలు కొన్నారు..

► ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రచౌదరి రూ. 5 కోట్ల విలువైన వాగు పోరంబోకును కబ్జాచేసి బంధువు పేర రిజిస్ట్రేషన్ చేయించారు..

► రైతుల భూములు బలవంతంగా లాక్కున్న పెద్దలు.. అధికారపార్టీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రియల్‌ఎస్టేట్ వెంచర్‌ను పూలింగ్ నుంచి తప్పించేశారు.

► రాజధాని ఎక్కడ వస్తుందో ముందే ఉప్పందుకున్న ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్... తన కుమారుడి పేరుతో భూములు కొన్నారు...

►ఆ ఇంద్రుడి రాజధాని అమరావతి.. ‘అమృతం’, ‘ఐరావతం’ ‘పారిజాతం’ నిలయం.. కాగా ఈ చంద్రుడి రాజధాని అమరావతి ‘బినామీలు’, భూబకాసురులు, దొంగ జీపీఏలు, రైతుల పొట్టగొట్టి కారుచౌకగా కాజేసిన వేల ఎకరాల రిజిస్ట్రేషన్ పత్రాల వలయం...

నారాయణ.. నారాయణ!
• కొనుగోలు 3,129 ఎకరాలు
• చెల్లించినది 432 కోట్లు
• ప్రస్తుత విలువ 10,000 కోట్లకు పైగా...
రాజధాని భూసమీకరణలో ప్రధాన భూమిక పోషించిన పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. భూదందాలోనూ ముందున్నారు. రెండేళ్ల కిందటి వరకు విద్యాసంస్థల అధిపతిగానే తెలిసిన నారాయణ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా నిధులందించారనీ, అందుకు ప్రతిఫలంగానే ఎమ్మెల్సీ, మంత్రి పదవీ అందుకున్నారనేది జగమెరిగిన సత్యం. అది నిజమేనన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ మంత్రిని కాదని రాజధాని ప్రాంతంలో భూసమీకరణ బాధ్యతలను తన ప్రధాన బినామీ నారాయణకే అప్పగించారు. భూసమీకరణలో భాగంగా ఆయన రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనూ మకాం వేసి.. విస్తృతంగా పర్యటించారు, గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలోనే టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల ద్వారా అసైన్డు, లంక భూముల రైతులను గుర్తించి, వారి ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. అసైన్డు, లంక భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందంటూ తన అనుచరులతో విస్తృతంగా ప్రచారం చేయించారు. ఆందోళన చెందుతున్న దళిత రైతుల వద్దకు తన ప్రతినిధులతో బేరసారాలు సాగించారు. ఎకరం కనిష్టంగా రూ.పది లక్షల నుంచి గరిష్టంగా రూ.15 లక్షల చొప్పున 3,129 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలో కమతాలు చిన్న చిన్నవి కావడంతో కనిష్టంగా 0.25 ఎకరాల నుంచి  గరిష్టంగా 1.5 ఎకరాల వరకూ బిట్లు బిట్లుగా కొనుగోలు చేశారు.  

3,129 ఎకరాలు కొనుగోలు
భూముల కొనుగోలులో నారాయణ తన తెలివిని జాగ్రత్తగా ఉపయోగించారు. భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్సు కింద రూ.రెండు లక్షలు ముట్టజెప్పి.. తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అసైన్డు, లంక భూముల సమీకరణకు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఆ భూములపై కొనుగోలుదారులకు హక్కులు కూడా కల్పించడానికి కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో తక్కిన మొత్తాన్ని కూడా తనకు భూమిని అమ్మిన వారికి ముట్టజెప్పేశారు. ఆ రైతుల నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) తన బినామీల పేర్లపై చేయించుకున్నారు. సమీప బంధువులు, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పేరు మీద ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించారు. భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు బయటకు పొక్కకుండా  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, రిప్రజెంటేటివ్ విధానాన్ని అనుసరించారు. దీనితో భూమిని విక్రయించిన రైతు కొనుగోలుదారుణ్ణి ప్రత్యక్షంగా చూడకుండానే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది.

బినామీల పేరుతో భారీ కొనుగోళ్లు...
మంత్రి నారాయణ బినామీ వ్యవహారానికి ఆకుల మునిశంకర్, రావూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల తదితరుల భూముల కొనుగోళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెల్లూరుకు చెందిన మునిశంకర్ కోర్ కేపిటల్‌కు అతి సమీపంలో ఉన్న మందడం గ్రామంలో  సర్వే నెంబరు 126లో నూతక్కి నరసింహనాయుడుకు చెందిన 1.50 ఎకరాల భూమిని రూ.2.25 కోట్లు చెల్లించి 1.50 ఎకరాలు కొన్నాడని గ్రామస్తులు తెలిపారు. కానీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎకరం ధర రూ.6 లక్షలు ఉండగా.. మార్కెట్ విలువను కేవలం రూ.తొమ్మిది లక్షలుగా చూపించారు. అలాగే లింగాయపాలెంలో సర్వే నెంబరు 109/1లో బోడిపూడి వెంకటరమణ నుంచి 0.56 ఎకరాలు, మందడంలో సర్వే నెంబరు 15/1లో బోరుగడ్డ రాంప్రకాష్ నుంచి 0.37 ఎకరాలు, లింగాయపాలెంలో సర్వే నెంబరు 140/ఏలో కొత్తపల్లి రాధారాణి నుంచి 0.45 ఎకరాలు, సర్వే నెంబరు 188లో కొండెపాటి వెంకాయమ్మ నుంచి 0.28 ఎకరాలు, రాయపూడిలో సర్వే నెంబర్లు 119/ఏ, 119/ఎఫ్‌లలో షేక్ హస్రఫ్ ఉన్నీసా తదితరుల నుంచి 0.75 ఎకరాలు, సర్వే నెంబరు 354/1ఏ, 354/1బీలలో లంబు వెంకటేశ్వర్లు తదితరుల నుంచి 0.87 ఎకరాలు, సర్వే నెంబరు 360/1లో వెలగలేటి రమాదేవి నుంచి 0.25 ఎకరాలు ఇలా బిట్లు బిట్లుగా ఆకుల మునిశంకర్ 30 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు.

మంత్రి నారాయణకు స్వయానా బావమరిది రావూరు సాంబశివరావు తుళ్లూరు మండలం మందడంలో సర్వే నెంబరు 465/3బీలో 0.32 ఎకరాలు.. బిట్లు బిట్లుగా 29 ఎకరాలకుపైగా భూమిని కొనుగోలు చేశారు. మంత్రికి సన్నిహితురాలైన పోతూరి ప్రమీల తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సర్వే నెంబరు 51/బీ, 51/సీల్లో 0.98 ఎకరాలు, సర్వే నెంబరు 95/సీలో 0.45 ఎకరాలు, లింగాయపాలెంలో 157/2లో 0.9 ఎకరాలు, సర్వే నెంబరు 118/ఏలో 0.5 ఎకరాలు, మందడంలో సర్వే నెంబరు 26/1లో 0.88 ఎకరాలు ఇలా బిట్లు బిట్లుగా 15 ఎకరాలకుపైగా కొనుగోలు చేశారు. ఆర్థిక స్థోమత రీత్యా రావూరు సాంబశివరావు, పోతూరు ప్రమీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి పదుల ఎకరాల్లో భూమి కొనుగోలు చేసే తాహతులేదని చెబుతున్నారు. వీరే కాక, ఇలాంటి చాలామంది బంధువులు, సన్నిహితుల పేరుతో నారాయణ రాజధాని గ్రామాల్లో 3,129 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు రాజధాని వ్యవహారాలను అతి సమీపం నుంచి పర్యవేక్షించే ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.

400 ఎకరాలు ఖాయం...
తుళ్లూరు మండలం బోరుపాలెం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాదు. కాబట్టి నారాయణ ఆ గ్రామంలో అసైన్డు భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్క బోరుపాలెంలోనే 50 ఎకరాల అసైన్డు భూమిని కొనుగోలు చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి లంకల్లోని సర్వే నెంబరు 250 నుంచి 400 వరకూ వివిధ సర్వే నెంబర్ల పరిధిలోని మరో 50 ఎకరాలపైగా భూమిని కొనుగోలు చేశారు. బోరుపాలెం, రాయపూడి గ్రామాలకు చెందిన తోకల పేతురు, తోకల అంకులు, మెండెం నాగేశ్వరరావు, మెండెం కోటేశ్వరరావు, బుల్లెద్దుల చిన్నప్ప, వలపర్ల రామయ్య, లాలాది ఆదేయ్య, లాలాది సుందరరావు అనే రైతులు తమ భూములను మంత్రి నారాయణకు విక్రయించామని.. ఆ భూములకు సంబంధించిన పత్రాలన్నీ  వారికే అప్పగించామని ‘సాక్షి’తో చెప్పారు. భూసమీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. రాజధాని గ్రామాల్లో ఎక్కడ భూములు ఉన్నా.. ఒకే ప్రాంతంలో ఇంటి ప్లాట్లు, వాణిజ్య స్థలం కేటాయించేలా దరఖాస్తు చేసుకుంటే ఆ మేరకు ఇచ్చేందుకు అంగీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం వెనుక మంత్రి నారాయణ హస్తం ఉందని సమాచారం. అలా రాజధాని నగరంలో మంత్రి నారాయణ కోరుకున్న ప్రాంతం లో ఇంటి ప్లాట్లు, వాణిజ్య ప్లాట్ల రూపంలో 400 ఎకరాల భూమి దక్కనుందని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి చెప్పారు.

మంత్రి నారాయణ బినామీల్లో మచ్చుకు ముగ్గురు
ఆవుల మునిశంకర్ మంత్రి నారాయణకు దూరపు బంధువు. వరుసకు బావమరిది అవుతారు. నాలుగేళ్లపాటు నెల్లూరులో వీఆర్సీ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేశారు. నారాయణ మంత్రి పదవి చేపట్టిన నాలుగు నెలల తర్వాత తన మెడికల్ కాలేజీలో విద్యుత్ మరమ్మతుల బాధ్యతలను మునిశంకర్‌కు అప్పగించారు. అయితే అతని వేతనానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని.. మునిశంకర్‌కు అవసరమైనప్పుడు మంత్రి నారాయణ వద్ద కొంత మొత్తం తీసుకుంటుంటారని ఆ కాలేజీ వర్గాలు తెలిపాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మునిశంకర్ నారాయణ మెడికల్ కాలేజీకి సమీపంలోని ప్రైవేటు అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. రాజధాని ప్రాంతంలో కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసే స్థోమత మునిశంకర్‌కు ఉంటుందా?

రాపూరు సాంబశివరావు
మంత్రి నారాయణకు స్వయాన బావమరిది. మంత్రి నారాయణకు చేదోడువాదోడుగా వ్యవహరిస్తుంటారు. ఆయనకు సంబంధించిన వ్యవహారాలను సాంబశివరావే చక్కదిద్దుతుంటారు. రాపూరు సాంబశివరావు పేరు మంత్రి నారాయణ భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టినట్లు నెల్లూరు వాసులు చెబుతున్నారు. ఇదే రీతిలో రాజధాని ప్రాంతంలోనూ ఆయన పేరుతో భూములు కొన్నారు.

పొత్తూరి ప్రమీల
మంత్రి నారాయణకు సన్నిహితురాలు. కర్ణాటక, తమిళనాడుల్లో నారాయణ కాలేజీల వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తుంటారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రమీల ఆదాయం అంతంత మాత్రమే. సాధారణ కుటుంబానికి చెందిన ప్రమీలకు కోట్లాది రూపాయలు వెచ్చించి రాజధానిలో భూములు కొనుగోలు చేసే ఆర్థికస్థోమత ఉంటుందంటారా?

రామకృష్ణార్పణం
• రియల్ వెంచర్ 179.54 ఎకరాలు
• అసైన్డ్ భూములు 54 ఎకరాలు
రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కవడంతో అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. దళితులకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో రియల్ వెంచర్ వేసిన సంస్థనుంచి భారీగా ముడుపులు అందుకున్న సర్కారు పెద్దలు అక్రమాన్ని సక్రమం చేసేశారు. వివరాల్లోకి వెళితే... రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో పెదకాకాని మండలం  నంబూరు గ్రామ పరిధిలో కోల్‌కత-చెన్నై జాతీయ రహదారి పక్కనే, నాగార్జున విశ్వవిద్యాలయం వెనుక రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుమారు 179.54 ఎకరాల్లో ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రణాళిక రచించింది. కాజా గ్రామం లోని సర్వే నెంబర్లు 78 నుంచి 107 వరకు 94 ఎకరాలను రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేయగా మిగతా 76 ఎకరాలను నంబూరు గ్రామానికి చెందిన దళిత, పేద రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 54 ఎకరాలకుపైగా అసైన్డ్ భూ ములు ఉన్నాయి. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేకపోయినా పెదకాకాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, అధికారులకు భారీగా ముడుపులు చెల్లించి సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్టర్ అయిన భూముల్లో లే అవుట్లు వేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో వీజీటీఎం నుంచి అనుమతి లభించింది. భారీ ప్రచారం, మార్కెటింగ్ సిబ్బంది సహకారంతో అనతికాలంలోనే స్థలాలు, విల్లాల విక్రయానికి తెర తీసింది.

చినబాబుకు భారీ వాటాలు
రాజధాని ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల్లో అసైన్డ్ భూములున్నాయనీ, ఆ భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటామంటూ యాజమాన్యాన్ని బెదిరించారు. ఆ తర్వాత ఓ కేంద్ర మంత్రి మధ్య వర్తిత్వంతో రాయబేరాలు కుదరడంతో.. రియల్ దందాకు ప్రభుత్వ పెద్దలు దన్నుగా నిలిచారు. దీంతో ఆ వెంచర్‌లో చదరపు గజం రూ. 4 వేలకు ప్రారంభించి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా రూ. 25 వేల వరకు విక్రయిస్తూ సంస్థ సొమ్ము చేసుకుం టోంది. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమను మోసం చేసి అసైన్డు భూములు కొనుగోలు చేసిందని నంబూరుకు చెందిన డేవిడ్ ఆధ్వర్యంలో దళిత పేద రైతులు  గుంటూరు జిల్లా అధికార యం త్రాంగానికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారంలో చినబాబుకు భారీ ఎత్తున వాటాలు దక్కడంవల్లే గుంటూరు జిల్లా కలెక్టరు విచారణను అటకెక్కించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మంగళగిరి తహశీల్దార్ విజయలక్ష్మిని ‘సాక్షి’ వివరణ కోరగా కాలువలు పోరంబోకు భూములు ఉన్నట్టుగా గుర్తించామని చెప్పడం గమనార్హం.

పయ్యావుల వాలారు!
• కొనుగోలు 4.09 ఎకరాలు
• చెల్లించినది 12.27 లక్షలు
• ప్రస్తుత విలువ 8 కోట్లు
ప్రభుత్వ పెద్దలు, టీడీపీ నాయకులు రాజధాని ప్రాంత రైతులను మోసగించి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారనడానికి టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ భూముల కొనుగోళ్లే మరో ఉదాహరణ. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మిస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడ నిర్మిస్తారో స్పష్టంగా చెప్పకుండా ముచ్చటగా మూడు పేర్లు ప్రజలను గందరగోళానికి గురిచేశారు. కానీ తన అనుయాయులకు మాత్రం రాజధాని ప్రాంతం విషయంలో ముందుగానే స్పష్టతనిచ్చారు. ఇంకేం అనంతపురానికి చెందిన టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ రాజధాని ప్రాంతంలో వాలిపోయారు. ఎక్కడ భూములు తక్కువ ధరకు లభిస్తాయో, ఏ భూములు కొంటే ఎక్కువ లాభం చేసుకోవచ్చో దగ్గరగా పరిశీలించారు. కోర్ కేపిటల్ లోని తుళ్లూరుకు అతి దగ్గరగా ఉండే అయినవోలు గ్రామంలో 4.09 ఎకరాలు కొనుగోలు చేశారు. సర్వే నెంబరు 48/3లో 2.13ఎకరాలు, సర్వే నెంబరు 49/3లో 1.96 ఎకరాలు కలిపి మొత్తం 4.09 ఎకరాల భూమిని 2014 అక్టోబరు 13న  కేశవ్ పెద్దకుమారుడు పయ్యావుల విక్రమసింహ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎకరం 3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను 12.27లక్షల రూపాయలకే కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కానీ అయినవోలులో ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరా రూ.2కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోంది. ప్రజారాజధాని నిర్మిస్తున్నామని, ప్రజల మద్దతు ఓర్వలేకనే ప్రతిపక్షం ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు గుప్పిస్తోందని పదేపదే గగ్గోలు పెట్టే పయ్యావుల కేశవ్ మరి రైతుల భూములను మభ్యపెట్టి కొని వారికి అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆయనే చెప్పాలి.

ధూళిపాళ్ల  ‘పోరంబోకు’ కథ!
• అనధికారికంగా కొట్టేసింది 50 ఎకరాలు
• రిజిస్ట్రేషన్ చేయించుకుంది 3.89 ఎకరాలు
రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చివరకు వాగు, డొంక, చెరువు పోరంబోకు భూములను సైతం వదలడం లేదు. కన్పించిన భూమినంతా కబ్జా చేసి.. రెవెన్యూ రికార్డులను తిరగరాయించి బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారు. ఇందుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అనుచరుల తీరే తార్కాణం. రాజధాని ప్రకటనతో కోల్‌కత-చెన్నై జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వాగు పోరంబోకు భూములపై ఎమ్మెల్యే నరేంద్రకుమార్ కన్ను  పడింది.

ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్
నంబూరులో సర్వే నెంబరు 274లోని 3.89 ఎకరాల వాగు పోరంబోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. రెవిన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి రెండుమూడు చేతులు మార్చినట్లుగా చూపి డాక్యుమెంట్ నెంబర్లు 2638, 2639, 2640లలో 3.89 ఎకరాల భూమిని తమ బినామీదారుల పేర్లపై రిజిస్ట్రేషన్  చేసేసుకున్నారు. మొదటగా పుల్లయ్య కొడుకు సాంబశివరావు తన భూమిగా దీన్ని చిత్రీకరించి ఉప్పుటూరి కిరణ్‌కుమార్, అడుసుమల్లి రవికిరణ్, వెన్నా పెద అచ్చిరెడ్డిలకు జీపీ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) రిజిస్ట్రేషన్‌లు చేశారు. దీంతో లింకు డాక్యుమెంట్‌లు పుట్టించారు. ఆ తరువాత ఈ ముగ్గురితో సాంబశివరావు తండ్రి దేవర పుల్లయ్యకు విక్రయించినట్లు సృష్టించారు.  ఎమ్మెల్యే ధూళిపాళ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు సర్వే నంబరు 274ను 274/బి6, బి7, బి8 సబ్ డివిజన్లుగా విభజించి దేవర పుల్లయ్య పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు.  ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ సుమారుగా రూ. 5 కోట్ల వరకూ ఉంటుంది.

మొత్తం 50 ఎకరాల పోరంబోకు కబ్జా
ఈ భూమిని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో ఆ భూమిలో బోర్లు వేసి, సాగుచేసేందుకు సమాయత్తమవుతున్నారు. బోరు వేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ వీఆర్వోకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. ఈ భూమి వాగు పోరంబోకు అని గ్రామ ప్రజలందరికీ తెలిసినా ఏం చేయలేని నిస్సహాయ స్థితి వారిది. అడ్డుతగిలితే తప్పుడు కేసులు పెట్టించడం, లేదా దాడులు చేయించడం వంటివి చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఒక్క పెదకాకాని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంబోకు భూములు కబ్జా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొమ్మాలపాటి  కుచ్చుటోపీ!
• కొనుగోలు 42 ఎకరాలు
• చెల్లించినది రూ. 1.26 కోట్లు
• ప్రస్తుత విలువ: రూ. 210 కోట్లు
 రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి.. టీడీపీ ప్రజా ప్రతినిధుల రౌడీయిజానికి ఇదో తార్కాణం. ఏడేళ్ల కిందట మంగళగిరికి సమీపంలో నెలసరి కంతులపై మూడువేల మందికి విక్రయించిన భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ నిరాకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఆయన వినియోగదారులకు టోపీ పెట్టారు. ప్లాట్లు ఇచ్చేది లేదంటూ బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధినేతపై ఒత్తిడి తెచ్చి రూ.210 కోట్ల విలువైన 42 ఎకరాల భూమిని భూసమీకరణ నుంచి తప్పించారు. ప్రతిఫలంగా చినబాబుకు భారీ ఎత్తున వాటాలు అందినట్లు సమాచారం.

సభ్యులకు కుచ్చుటోపీ
గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో విజయవాడ, గుంటూరు కేంద్రాలుగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వెంచర్లను వేసి వాయిదాల పద్ధతిలో ప్లాట్లను విక్రయిస్తూ వస్తున్నారు. అదే సంస్థ యర్రబాలెంలో అమరావతి టౌన్‌షిప్‌ను ఆనుకుని సర్వే నంబర్ 485 నుంచి 500 వరకు 42 ఎకరాలు కొనుగోలు చేసింది.  సభ్యుడిగా చేరేందుకే రూ.25 వేల వంతున చెల్లించి, తదుపరి వాయిదాలు చెల్లించారు. 2009లో ప్లాట్ల విక్రయాలు ప్రారంభించిన సంస్థ 2012 నాటికే సభ్యుల నుంచి పూర్తి వాయిదాలను వసూలు చేసింది. ఒక్కనెల వాయిదా కట్టకపోయినా డిఫాల్టరుగా మార్చి మెజారిటీ సభ్యులకు శఠగోపం పెట్టారు. పూర్తిగా డబ్బు కట్టిన వారికి కూడా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇంతలో యర్రబాలెం గ్రామం సైతం భూ సమీకరణలోకి చేరడంతో వెంచర్‌కు అనుమతులు నిలిచిపోయాయి. దీంతో పూర్తిగా నగదు చెల్లించిన సభ్యులు సంస్థను సంప్రదించగా అధికార పార్టీ అండ ఉండడంతో సభ్యులకు నయానోభయానో విషయం బయటకు పొక్కకుండా కొంతమందికి వేరే వెంచర్‌లో ప్లాట్లను కేటాయిస్తామంటూ నమ్మబలికి.. ఆ తర్వాత మొండిచేయి చూపారు. ఈ విధంగా ఒక్క యర్రబాలెం వెంచర్‌లోనే సంస్థ సుమారు రూ.15 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిందని తెలిసింది.

సమీకరణ నుంచి తప్పించేశారు..
యర్రబాలెం గ్రామంలో అధిక శాతం మంది రైతులను బెదిరించి భూములు లాక్కోవడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కానీ..    అభినందన రియల్ ఎస్టేట్ వెంచర్‌కు చెందిన 42 ఎకరాల భూములను భూ సమీకరణకు ఇవ్వకపోగా.. డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌లో సైతం వదిలేసింది. సీఎం చంద్రబాబునాయుడు ఒత్తిడే ఇందుకు కారణమని  అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ భూములకు అన్ని మినహాయింపులు ఇచ్చి.. రాజధానిలో మెగా సిటీ రూపొందించడానికి ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది. తుది మాస్టర్ ప్లాన్ విడుదలైన  వెంటనే రాజధానిలో తొలి ప్రైవేటు రియల్ మెగా సిటీని ప్రకటించేందుకు సంస్థ సిద్ధమవుతుండగా, అందుకు సీఆర్‌డీఏ నుంచి అనుమతులు ఇప్పించేందుకు చినబాబు చక్రం తిప్పుతున్నారు. ఆ మేరకు ఆ వెంచర్‌లో చినబాబు వాటాలు పొందినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇదే అంశంపై సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ లలితకుమారి వివరణ కోరగా... 485 నుంచి 500 సర్వే నంబర్ల వరకు 42 ఎకరాలు భూసమీకరణలోనే ఉన్నాయన్నారు. అయితే ఇప్పటివరకు ఆ భూములను సమీకరణకు ఇవ్వలేదన్న అంశాన్ని ఉన్నతాధికారులకు తెలిపామంటూ దాటవేశారు. ఇదే విషయంపై సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించారు.

కోడెల తనయుడా? మజాకా?
• కొనుగోలు 17.3 ఎకరాలు
• చెల్లించినది రూ. 93 లక్షలు
• ప్రస్తుత విలువ 18.4 కోట్లు
రాజధాని ప్రాంతంలో భూములను కొల్లగొట్టడంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ రూటే సపరేటు. వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. అధికార బలాన్ని ఉపయోగించి వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి అని సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు.  రాజధానిపై ప్రకటన వెలువడిన తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రధాన రాజధానికి సమీపంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములను సొంతం చేసుకోవడా నికి కోడెల శివరామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పదమైన భూములను గుర్తించడం.. వివాదం ఎవరి మధ్య నడుస్తుందో తెలుసుకోవడం.. అందులో ఒక వర్గాన్ని కోడెల శివరామకృష్ణ వద్దకు తీసుకెళ్లడమే ప్రత్యేక బృందాల బాధ్యత. తన వద్దకు వచ్చిన వారిని బతిమాలో బెదిరించో.. నయానో భయానో తక్కువ ధరలకు వివాదాస్పదమైన భూములు కొనుగోలు చేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని తన బినామీల పేర్లతో కొట్టేయడం రివాజుగా మారింది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో సర్వే నెంబర్లు 167-1ఏ, 167-1సీ, 168-1, 168-3లో 17.3 ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఇది పసిగట్టిన కోడెల శివరామకృష్ణ ఒకరిని తన వద్దకు పిలిపించుకుని.. తన వ్యక్తిగత సహాయకుడు గుత్తా నాగప్రసాద్ మేనేజింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న శశి ఇన్‌ఫ్రా పేరుతో  ఎకరం రూ.ఎనిమిది లక్షల చొప్పున కొనుగోలు చేశారు. వాస్తవంగా ఆ ప్రాంతం ఎకరం రూ.1.50 కోట్లకుపైగా పలుకుతోండటం గమనార్హం. కోడెల తనయుడి వ్యవహారంపై ఇదే వివాదంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ.. అదేమీ పట్టని రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని గుత్తా నాగప్రసాద్‌కు కట్టబెట్టేసింది. కోడెల శివరామకృష్ణ ఇదే పద్ధతిలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీ ఎత్తున భూములు కొట్టేసినట్లు ఆ నియోజకవర్గాల ప్రజలు చెబుతున్నారు.

ఎవరీ గుత్తా నాగప్రసాద్?
గుత్తా నాగ ప్రసాద్ సొంతూరు ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం పోలూరు. సాధారణ కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్ బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) చదువుకున్నారు. కోడెల పెద్ద కుమారుడు సత్యనారాయణ ప్రమాదం మరణించినపుడు నాగప్రసాద్‌కు ఆ కుటుంబంతో సన్నిహిత బంధం ఏర్పడింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ కోడెల వ్యవహరించే సమయంలో నాగ ప్రసాద్‌ను తన వద్దకు పిలిపించుకున్నారు. ఆసుపత్రిలో కాంట్రాక్టు పనులను నాగ ప్రసాద్‌తో చేయించేవారని సమాచారం. కేడెల క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నాగప్రసాద్ ఆయన వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కోడెల స్పీకర్ పదవిని చేపట్టిన తరువాత ఆయన తనయుడు కోడెల శివరామ కృష్ణకు వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తూనే.. గుంటూరు లో హోండా షోరూంలో ప్రైవేటు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చిలుకలూరిపేటలో అద్దె ఇంట్లో నివాసముంటున్న నాగ ప్రసాద్.. కోడల తరఫున సత్తెనపల్లి, నరసరావుపేట నియో జకవర్గాల్లో పనులు చక్కబెడుతుంటారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాగ ప్రసాద్‌కు కోట్లాది రూపాయలు వెచ్చించి.. భూములు కొనుగోలు చేసే స్థోమత ఉంటుందా?

హాయ్‌ల్యాండ్.. హాంఫట్!
బేరం కుదిరింది.. రూ.425 కోట్ల విలువైన ‘అగ్రిగోల్డ్’ భూములు చినబాబు వశమయ్యాయి 
రాజధాని పేరుతో భారీ దోపిడీకి తెరలేపిన ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్‌ల్యాండ్ భూములే ఉదాహరణ. కోల్‌కోత-చెన్నై జాతీయ రహదారిపై మంగళగిరి మండలం చినకాకానిలో 85.13 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ కొనుగోలు చేసి హాయ్ ల్యాండ్ పేరుతో అభివృద్ధి చేసింది. ఎకరం రూ.4 నుంచి రూ.4.50 కోట్ల వరకూ పలికే ఈ భూమిపై ప్రభుత్వ పెద్దల కళ్లు పడ్డాయి. ఆ భూములను కొట్టేయాలన్న మందస్తు ఎత్తుగడలో భాగంగా.. వాటిని రాజధాని భూసమీకరణ నుంచి తప్పించారు. తనకు సన్నిహితుడైన ఓ పోలీసు ఉన్నతాధికారిని ప్రభుత్వ పెద్ద రంగంలోకి దించారు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న భూములు అప్పగిస్తే కేసుల నుంచి తప్పిస్తామంటూ అగ్రిగోల్డ్ యజమానులకు రాయబారం పంపారు. అప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన అగ్రిగోల్డ్ యాజమాన్యం అందుకు అంగీకరించడంతో కేసుల నుంచి తప్పించేందుకు 32 లక్షల మంది డిపాజిట్‌దారుల ప్రయోజనాలను ప్రభుత్వ పెద్ద పణంగా పెట్టారు. టీడీపీ అధికారం చేపట్టి 21 నెలలైనా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేయలేదు. ప్రతిఫలంగా రూ.425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్‌ను చినబాబు కొట్టేశారు. హైకోర్టు ఆదేశించినా సీఐడీ విచారణను ఓ కొలిక్కి తేలేకపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్ద ఒత్తిళ్లేనన్నది పోలీసు వర్గాల అభిప్రాయం.  క్విడ్ ప్రోకో అంటే ఇదీ అని టీడీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తోండటం గమనార్హం.

హైకోర్టు ఆగ్రహించినా...
అగ్రిగోల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కర్ణాటక, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర  రాష్ట్రాల్లోని 32 లక్షల ఖాతాదారుల నుంచి సుమారు రూ.6850 కోట్లను డిపాజిట్లను ఈ సంస్ధ సేకరించింది. ఆ డబ్బులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసింది. గడువు తీరిపోయినా అధిక శాతం మంది డిపాజిట్‌దారులకు నగదు చెల్లించకపోవడం వివాదాస్పదంగా మారింది. దాంతో ఏడు రాష్ట్రాలతోపాటూ మన రాష్ట్రంలోనూ 2014 నవంబర్ నుంచి  ఖాతాదారులు, ఏజెంట్లు ఆందోళనలకు దిగారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆగస్టు, 2015లో హైకోర్టులో బాధితులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఎక్కడ సీబీఐ విచారణకు ఆదేశిస్తుందోనని ఆందోళన చెందిన ప్రభుత్వ కీలక నేత.. తన చెప్పుచేతల్లో ఉండే సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తూ హడావుడిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన  మొత్తం సుమారు 16 వేల ఎకరాల భూమికి సంబంధించి కొనుగోళ్లూ, అమ్మకాలు స్థంభించిపోయాయి.

సీఐడీ దర్యాప్తు నత్తనడకన సాగుతోండటంతో ఆగస్టు, 2015లో ఉమ్మడి హైకోర్టు జోక్యం చేసుకుంది. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తులు, ఆ సంస్థ, అనుబంధసంస్థల్లో ఉన్న డెరైక్టర్లు, భాగస్వాముల వివరాలు, వారి ఆస్తులు వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థను అదేశించింది. ఒకానొక సందర్భంలో దర్యాప్తు తీరు ఎంత మాత్రం సంతృప్తికరంగా లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలని, లేని పక్షంలో తామే అందుకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి లేకుండా ఆస్తులు విక్రయించేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని హెచ్చరించింది. పక్షం రోజుల క్రితం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంలో ఎట్టకేలకు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు. కానీ.. కేసు విచారణను నీరుగార్చుతూ వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. రూ.200 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ కోసం 32 లక్షల మంది మదుపుదారుల ప్రయోజనాలను పణంగా పెట్టడంపై టీడీపీ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయినా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అగ్రిగోల్డ్‌కు చెందిన 14 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేయడం గమనార్హం.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu