-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 11, 2016

నీళ్ల సీసాలపై మీ పేర్లు...!


ఓ తరం కిందట.. చదువుకునే అమ్మాయిలు ఉద్యోగాలకుపయోగపడే టైప్‌రైటింగ్‌, షార్ట్‌ హ్యాండ్‌ వంటివి నేర్చుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేవారు. ఆ తర్వాత.. చదువుతూ పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయడమే చాలా గొప్పగా అనుకునేవారు. నేటితరం మరింతగా ముందుకెళ్లి.. డిగ్రీల్లోనే ఏకంగా వ్యాపారవేత్తలవుతున్నారు. ప్రియాంకా అడుసుమిల్లి.. ఈతరానికి విశిష్ట ప్రతినిధి. డిగ్రీ పూర్తి చేయకుండానే ‘మంచినీళ్ల సీసాపై కస్టమైజ్డ్‌ లేబుల్స్‌’ అంటూ సరికొత్త ఆలోచన చేసింది. ఇంతకీ ఏమిటది? ఆ విశేషాలు తన మాటల్లోనే..
మీ ఇంట్లో పుట్టినరోజు వేడుక ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్లందరికీ స్వీట్స్‌ పెట్టాక.. వాళ్లు తాగే నీళ్ల సీసా ప్రతిదానిపైనా మీ పాపాయి ఫొటో ఉంటే ఎలా ఉంటుంది? మీ అన్నయ్యో.. అక్కయ్యో పెళ్లి జరుగుతోంది. వాళ్లని సర్‌ప్రైజ్‌ చేసేలా భోజనాల వేళ ప్రతి నీళ్లబాటిల్‌పైనా కంపెనీ లేబుల్‌కి బదులుగా వధూవరుల పేర్లు పెట్టి సరఫరా చేశారు!! ‘ఐడియా అదిరిపోయింది..’ అనరా అందరూ!! ఇదే నేను చేసే పని. మార్కెట్‌లో దొరుకుతున్న మినరల్‌ వాటర్‌ బాటిళ్ల లేబుళ్లని మీ కోసం.. మీ కార్యక్రమాలకు తగ్గట్టు ప్రత్యేకంగా డిజైన్‌ చేసి ఇవ్వడం. దీన్నే ‘కస్టమైజ్డ్‌ వాటర్‌బాటిల్‌’ అంటున్నా నేను. మా బిగ్‌ డ్రాప్‌ సంస్థ ఇలా పెళ్లిళ్లకే కాదు.. ఇతర ప్రత్యేక సందర్భాల్లో, కార్పొరేట్‌ సదస్సుల్లోనూ ఈ ఆలోచన అమలుచేస్తున్నాను. మంచి స్పందన వస్తోంది.

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు లక్షల రూపాయాలు సంపాదించుకోగలిగా. ఇది పెద్ద మొత్తం కానప్పటికీ మనసుంటే ఏదయినా చేయగలననే ఆత్మవిశ్వా సాన్నిచ్చింది.
వ్యాపారమే జీవితమనుకున్నా..
మాది హైదరాబాద్‌. నాన్న విజయ్‌కుమార్‌ సినిమాటోగ్రాఫర్‌. అమ్మ గృహిణి. పదో తరగతి వరకూ వైద్యవిద్యలోకి వెళ్లాలన్నదే నా కల. రోజులో ఎక్కువ గంటలు చదివితే కానీ.. అందులోకి వెళ్లడం సాధ్యం కాదని అర్థమైపోయింది. దాంతో వ్యాపార ఆలోచనలపై దృష్టిపెట్టా. అందుకు తగ్గట్టే ఇంటర్‌లో కామర్స్‌ గ్రూపు ఎంచుకున్నా. హైదరాబాద్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌లో చేరాను. డిగ్రీలో చేరడానికి ముందే..ఈ మూడేళ్లలో వ్యాపారం చేసి తీరాలనే ఆలోచనకొచ్చాను. మొదట్లో ప్రజలకు బాగా ఉపయోగపడగల ‘యాప్‌’ తయారీలోకి వెళ్దామనుకున్నా. కానీ ఇప్పుడు రోజుకి వేలాది కొత్త యాప్‌లొస్తున్నాయి. కాబట్టి.. గుర్తింపు రావడం అంత సులభం కాదనిపించింది. అప్పుడే ‘కస్టమైజ్డ్‌’ ఉత్పత్తులపై నా దృష్టిపడింది. చాక్లెట్‌ నుంచి లాకెట్‌ వరకూ అన్నింటా తమదైన ప్రత్యేకత ఉండాలని కోరుకుంటున్నారిప్పుడు..! నేనూ దానిపై దృష్టిసారించాను. మామూలుగా కీచెయిన్‌లూ, చాక్లెట్‌లాంటివే కాకుండా వేరే ఇంకేదైనా ప్రజల చేతిలో ఎక్కువగా ఉండే వస్తువులను దీనికోసం ఎంచుకుందామని రకరకాలుగా ఆలోచించా. అప్పుడే నీళ్లసీసా ఆలోచనొచ్చింది. ‘వావ్‌.. బ్రహ్మాండమైన ఐడియా!’ అనుకున్నా. కానీ అందులో దిగాకగానీ కష్టనష్టాలేమిటో అర్థంకాలేదు.
డిగ్రీ కూడా కాలేదన్నారు..
ఏడాదిన్నర కిందట ‘బిగ్‌ డ్రాప్‌’ పేరుతో నా సంస్థను ప్రారంభించా. ఇందుకోసం ముందుగా ఓ ఫేస్‌బుక్‌ పేజీనీ ఏర్పాటు చేశా. మొదట మినరల్‌ వాటర్‌ తయారీదారులు కలిశా. వారికిదేమిటో అర్థంకాలేదు. బ్రాండ్‌ లేబుల్‌ స్థానంలో ఇంకెవరివో పేర్లూ, ­ర్లూ రావడం ఏమిటని సందేహించారు. అయితే దీనివల్ల వారికెలాంటి నష్టం రానివిధంగా నా లేబుల్‌ డిజైనింగ్‌ ఉంటుందని ప్రయోగాత్మకంగా చేసి చూపించాను. వీటివల్ల వాళ్ల బ్రాండ్‌ ప్రజలకి మరింతగా దగ్గరవుతుందని వివరించా. మూతపైనా.. కిందా వారి వాటర్‌మార్కు ఎలాగూ ఉంటుందని చెప్పా. నేను చెప్పేది వాళ్లకి నచ్చినా.. ‘ఇంకా డిగ్రీ కూడా పూర్తిచేయని ఈ అమ్మాయి. ఇంత పక్కాగా చేయగలదా?’ అన్నట్టు చూసేవారు. అయినా ఓపిగ్గా వివరించేదాన్ని. ఆ కష్టం వృథా కాలేదు. ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఈవెంట్‌ మేనేజర్‌లూ, వెడ్డింగ్‌ ప్లానర్లూ, కార్పొరేట్‌ సంస్థల ప్రతినిధుల్ని కలిశా! వారి కార్యక్రమాల్లో నా ‘కస్టమైజ్డ్‌ బాటిల్స్‌’ ఉపయోగిస్తానని చెప్పాను. అలా పుట్టిన రోజులు, పెళ్లివేడుకలు, సీమంతాలు, బారసాల, కార్పొరేట్‌ మీటింగ్‌లు, గేదరింగ్‌లు అన్నింటికీ మా ‘బిగ్‌ డ్రాప్‌’ సేవలు అందించడం మొదలుపెట్టా. వినియోగదారులకు ఏ పరిమాణంలో మినరల్‌ వాటర్‌కావాలీ..నీళ్ల నాణ్యత.. లాంటివన్నీ తెలుసుకుంటా. వాళ్లు ప్రతిపాదించే సంస్థ నుంచి ఏకమొత్తంలో మంచినీళ్ల సీసాలు కొని వాటిపై వినియోగదారులు కోరుకున్నట్లు లేబుళ్లు డిజైన్లు చేసి ఇస్తాం. ఇదీ మా పద్ధతి!
ఆ రోజు మరిచిపోలేను..
ఓ వేడుక కోసం నీళ్ల సీసాలు కావాలంటూ ఓ వాటర్‌బాటిల్‌సంస్థను సంప్రదించా. వాళ్లేమో ‘మీ లేబుళ్లు మాకు పంపండి. మేమే అతికించి మీకిస్తాం!’ అన్నారు. ఇచ్చాం. అక్కడే తప్పుచేశాం. వాళ్లు ఏ లేబుల్‌ని ఏ పరిమాణంలో ఉన్న సీసాకు అతికించాలో తెలియక అన్నింటినీ వృథా చేశారు. దాంతో అక్షరాలు ఒకదానికొకటి అలుక్కుపోయాయి. ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్క ఆర్డరిచ్చిన క్లయింటు ఫోన్‌ల మీద ఫోన్‌లు చేస్తున్నారు. సమయం చాలా తక్కువగా ఉంది. ముందు కాస్త భయపడినా.. వెంటనే స్పందించా. స్నేహితులూ, కుటుంబసభ్యుల సాయం తీసుకుని పనిలోకి దిగాను. రెండు రోజుల పాటు కష్టపడి అనుకున్న సమయానికే ఆర్డరు అందించా ! ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో అడుగూ వేసుకుంటూ వెనక్కి చూస్తే అప్పుడే ఏడాదిన్నర గడిచిపోయింది. ఇప్పటిదాకా నలభై ఈవెంట్లు చేశా. 50 వేల కస్టమైజ్డ్‌ బాటిళ్లు అందించా. చదువూ, పరీక్షలకి అడ్డంకి కాకుండా సమన్వయం చేసుకుంటూనే ఇంతా చేయాలి కాబట్టి.. ముందస్తు ప్రణాళిక చేసుకుంటా.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu