-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

February 06, 2016

మన సైన్యం సిద్ధం...!!


⇒ టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన
⇒ ఆసియాకప్‌కూ అదే జట్టు
⇒ షమీ పునరాగమనం, నేగికి అవకాశం
⇒ రహానేకే సెలక్టర్ల ఓటు
⇒ భువనేశ్వర్, మనీశ్ పాండే అవుట్

న్యూఢిల్లీ: సొంతగడ్డపై టి20 ప్రపంచకప్ పోరులో తలపడే భారత జట్టును సెలక్టర్లు శుక్రవారం ప్రకటించారు. సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది.

ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ పునరాగమనం, లెఫ్టార్మ్ స్పిన్నర్ పవన్ నేగి ఎంపిక మినహా ఇతర సంచలన నిర్ణయాలేమీ లేవు. ఊహించినట్లుగా ఆసీస్‌ను చిత్తు చేసిన జట్టుకే సెలక్టర్లు ఓటు వేశారు. శ్రీలంకతో సిరీస్ కోసం ఎంపికైన మనీశ్ పాండే, పేసర్ భువనేశ్వర్ కుమార్‌లపై మ్యాచ్ ఆడకుండానే వేటు పడింది. వీరిద్దరిని వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదు. పాండేకంటే గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్‌లలో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న అజింక్య రహానే అనుభవంపైనే సెలక్షన్ కమిటీ నమ్మకముంచింది.

ఇక షమీ రాకతో భువనేశ్వర్ కుమార్‌ను పక్కన పెట్టి అతని పుట్టినరోజున సెలక్టర్లు నిరాశలో ముంచెత్తారు. ముందుగా ప్రకటించినట్లుగా వరుసగా ఆరో టి20 ప్రపంచకప్‌లోనూ టీమిండియా ధోని నాయకత్వంలోనే బరిలోకి దిగనుంది. వరల్డ్‌కప్‌కు ముందు సన్నాహకంగా జరగనున్న ఆసియా కప్‌లో కూడా ఇదే జట్టు పాల్గొంటుంది. ఫిబ్రవరి 24నుంచి మార్చి 6 వరకు బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, మార్చి 8నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్‌లో వరల్డ్ కప్ జరుగుతుంది.
 
షమీ కోలుకుంటాడా!
వన్డే వరల్డ్‌కప్ తర్వాత మోకాలి గాయంతో జట్టుకు దూరమైన పేసర్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. అయితే గాయం తిరగబెట్టడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తిరిగొచ్చాడు. అతని ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత లేకపోయినా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ‘షమీ మన అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు చాలా సమయముంది. ఆలోగా అతను కోలుకుంటాడని నమ్ముతున్నాం.

ప్రస్తుతం అతను మెరుగవుతున్నాడు. బౌలింగ్ చేయడం కూడా ప్రారంభించాడు’ అని పాటిల్ వెల్లడించారు. అప్పటికి షమీ కోలుకోకపోతే అతని స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు అవకాశం ఉంది. జడేజా, యువరాజ్‌లు జట్టులో ఉన్న తర్వాత కూడా నేగి ఎంపిక ఆశ్చర్యం కలిగించింది. లోయర్ ఆర్డర్‌లో ధాటిగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం కూడా నేగికి ఉంది. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే అతనికి నేరుగా వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కడం విశేషం.

ఆస్ట్రేలియా పర్యటనలో సాధ్యమైనన్ని ప్రయోగాలు చేశామని... ఆ తర్వాతే ఎవరు తుది జట్టులో ఉండాలి, వారి ప్రత్యామ్నాయాలు ఏమిటనేదానిపై అంచనాకు వచ్చినట్లు పాటిల్ స్పష్టం చేశారు.

టి20 వరల్డ్ కప్, ఆసియా కప్‌కు భారత జట్టు
ధోని (కెప్టెన్), రోహిత్, శిఖర్ ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, పాండ్యా, అశ్విన్, బుమ్రా, నెహ్రా, రహానే, హర్భజన్, షమీ, నేగి.
 
కెప్టెన్ కోరుకున్నట్లే...
టి20 స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ నేగి ఈ ఫార్మాట్‌లో 56 మ్యాచ్‌లు ఆడి 26.28 సగటుతో 46 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 135 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. ఐదేళ్ల దేశవాళీ కెరీర్‌లో ఢిల్లీ తరఫున నేగి 19 వన్డేలు, 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
 
ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ విజయం అంకెలపరంగానే కాదు కెప్టెన్‌గా ధోని ఆత్మవిశ్వాసం అంబరాన్ని తాకేంతగా అద్భుతాలు చేసింది. ఆ ప్రభావం వల్లే కావచ్చు తాజాగా ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేయడంలో ధోని ముద్ర గట్టిగా కనిపించింది. వన్డే సిరీస్ ఓడిన తర్వాత తీవ్రమైన ఒత్తిడిలో కనిపించిన అతను ఈ ఎంపికలో మాత్రం తన మాటను నెగ్గించుకున్నట్లు అర్థమవుతోంది.

రెండు ఆశ్చర్యకర నిర్ణయాల్లో ధోని ప్రాధాన్యతలకు సెలక్టర్లు పట్టం కట్టారు. మొహమ్మద్ షమీపై ధోనికి ఉన్న అపార నమ్మకం కారణంగానే పూర్తి ఫిట్ కాకపోయినా అతను మళ్లీ ఎంపికయ్యాడు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా ప్రధాన పేసర్‌గా షమీ బెస్ట్ అని కెప్టెన్ భావించాడు. ఇక నేగి ఎంపిక కూడా పూర్తిగా కెప్టెన్ చాయిస్! నాకు ఆల్‌రౌండర్లు కావాలి అంటూ పదే పదే చెబుతున్న ధోనికి తన చెన్నై జట్టు సహచరుడు నేగి ఆటపై మంచి అవగాహన ఉంది. లెఫ్టార్మ్ స్పిన్‌తో పాటు చివర్లో ధాటిగా ఆడగల నేగికి ఒకటి రెండు మ్యాచ్‌లలో జడేజాకంటే ముందు బ్యాటింగ్ అవకాశం కూడా ఇచ్చాడు. దేశవాళీ ప్రదర్శనకంటే ఐపీఎల్‌లో రాణించడమే నేగి ఎంపికకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
 
తుది జట్టు ఎలా ఉండొచ్చు?
ఆసీస్‌తో సిరీస్ ఆడిన 11 మందే దాదాపుగా మొదటి చాయిస్‌గా తుది జట్టులో ఉండవచ్చు. వరల్డ్ కప్ జట్టును చూస్తే రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, ధోని రూపంలో ఐదుగురు రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ ఉండగా, రహానేకు కూడా తుది జట్టులో చోటు కష్టమే. ధావన్ విఫలం లేదా ఎవరికైనా గాయమైతే ప్రత్యామ్నాయంగా రహానే ఉంటారు. యువరాజ్, జడేజా, పాండ్యా రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్నారు.

ఇప్పుడు వీరికి జత కలిసిన నేగికి అవకాశం లభించాలంటే జడేజాను పక్కన పెట్టడం తప్ప మరో మార్గం లేదు.  అశ్విన్ ఉండగా, ప్రత్యర్థి జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటేనే భజ్జీ ఆడతాడు. షమీ వస్తే నెహ్రాను తప్పించవచ్చు. మొత్తంగా ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప డగౌట్‌కు పరిమితమయ్యే నలుగురు రహానే, హర్భజన్, నేగి, నెహ్రా అవుతారు. ధోని ఆలోచనల ప్రకారం జడేజా, నేగి ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడకపోయినా వేర్వేరుగానైనా ఇద్దరినీ ఉపయోగించుకునే అవకాశం ఉంది.  జట్టులో వైవిధ్యం కోసం లెగ్‌స్పిన్నర్‌ను తీసుకుంటే బాగుండేది. కానీ కుదురుగా ఆడుతున్న జట్టును మార్చడం అనవసరమని భావించి ఉంటారు.          
 -సాక్షి క్రీడావిభాగం
 
మార్పుల్లేని మిథాలీ సేన
మహిళల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన జట్టులో ఒక్క మార్పు కూడా చేయకపోవడం విశేషం. హైదరాబాదీ మిథాలీ రాజ్ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతుంది.
 
జట్టు వివరాలు: మిథాలీరాజ్ (కెప్టెన్), జులన్ గోస్వామి, స్మృతి మందన, వేద కృష్ణమూర్తి, హర్మన్‌ప్రీత్ కౌర్, శిఖా పాండే, రాజేశ్వర్ గైక్వాడ్, సుష్మ వర్మ, పూనమ్ యాదవ్, వీఆర్ వినీత, అనూజ పాటిల్, ఏక్తా బిస్త్, తిరుష్‌కామిని, దీప్తి శర్మ, నిరంజన నాగరాజన్.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu