గోరఖ్ పూర్: 'ఫేస్ బుక్' కొడుకు పెళ్లి కోసం ఓ అమెరికా మహిళ భారత్ కు వచ్చింది. కుమారుడి పెళ్లిని కనులారా వీక్షించి వారిని అమెరికాకు ఆహ్వానించింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జనవరి 30న జరిగిన తన కుమారుడి వివాహంలో సంప్రదాయ దుస్తులు ధరించి అనుబంధాలకు 'కట్టు'బాట్లు లేవని రుజువు చేసింది. అంతేకాకుండా విలువైన కానుకలు ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తింది.
చిన్నతనంలోనే కన్నతల్లిని పోగొట్టుకున్న కృష్ణమోహన్ త్రిపాఠి(26)కి ఫేస్ బుక్ లో అమెరికాకు చెందిన డెబ్ మిల్లర్(60) పరిచయమైంది. వీరిద్దరి మధ్య అనుబంధం క్రమంగా పెరిగింది. ఆమెను కృష్ణమోహన్ అమ్మ అని సంబోధించడం మొదలుపెట్టాడు. సంతానం లేని డెబ్ మిల్లర్ అతడి పిలుపుతో కరిగిపోయింది. కృష్ణమోహన్ ను తనకు దేవుడు ఇచ్చిన కుమారుడిగా భావించింది.
కృష్ణమోహన్ పెళ్లి విషయం తెలుసుకుని రెక్కలు కట్టుకుని ఇండియాకు వచ్చేసింది. కాలిఫోర్నియా నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చింది. అక్కడి నుంచి రైలులో గోరఖ్ పూర్ చేరుకుంది. రైల్వే స్టేషన్ లో ఆమెకు కృష్ణమోహన్, అతడి బంధువులు ఆత్మీయ స్వాగతం పలికారు. బెనారస్ చీర కట్టుకుని పెళ్లిలో సందడి చేసింది. రూ. 25 లక్షల విలువైన కానుకలు ఇచ్చింది. బ్రిటన్ వేలంలో దక్కించుకున్న 129 ఏళ్ల ఉంగరాన్ని కూడా వధూవరులకు బహుకరించింది. ఫైజాబాద్ లోని అవధ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేస్తున్న కృష్ణమోహన్ లాయర్ అవుతానని చెబుతున్నాడు. 'ఫేస్ బుక్' అమ్మ ఆహ్వానం మేరకు త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్టు వెల్లడించాడు.
Post a Comment