వి‘లాస్’ జీవితాలు!
⇒ డబ్బుల కోసం అడ్డదారులు
⇒ ఇద్దరు యువతుల అరెస్టు చెప్పిన నిజాలు
⇒ తల్లిదండ్రులకు పోలీస్ హెచ్చరికలు
విజయవాడ సిటీ: సినీ వ్యామోహం.. టీవీ ప్రభావం..యువతను విలాసాల వైపు మళ్లిస్తోంది. విలాస జీవితం గడిపేందుకు కావాల్సిన డబ్బు కోసం యువత అడ్డదారులు తొక్కుతోంది. అవతలివాళ్లు స్నేహితులు..బంధువులైనా ఫర్వాలేదు.. అవకాశం ఉంటే ఎక్కడో ఒకచోట డబ్బులు కొట్టేసేందుకు వెనుకాడడం లేదు. సీసీఎస్ అధికారులు బుధవారం అరెస్టు చేసిన ఇద్దరు మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించే విద్యార్థులే నిదర్శనం. ఇంటర్ నుంచి కలిసి చదువుకున్న వారు విలాసాల కోసం అప్పులు చేశారు. ఆ అప్పు తీర్చుకోవడంతోపాటు సులువుగా డబ్బులు సంపాదించేందుకు షేర్లలో పెట్టుబడు లు పెట్టాలని భావించారు. ఇందులో ఒకరి దూరపు బంధువు నగదు చోరీకి పథక రచన చేసి పోలీసులకు చిక్కారు. కట్‌చేస్తే విలువైన విద్యా ర్థి జీవితం జైలు ఊచలు లెక్కిస్తుండగా.. కుటుం బ సభ్యులను తీరని వ్యధకు గురిచేస్తున్నారు.
అప్పులకుప్పలు..
ఇంటర్ నుంచే బొబ్బా షీలా, గూడూరు శిరీష అలియాస్ సోనీ విలాస జీవితానికి అలవాటుపడినట్టు సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. వీరి రెండు కుటుంబాలు కూడా సాధారణ మధ్యతరగతికి చెందినవే. ఇందుకు భిన్నంగా వారు ఖరీదైన మొబైల్స్, సినిమాలు, షికార్లు..ఇలా తమదైన రీతిలో జీవితం గడిపేవారని తెలిసింది. వీటిని తీర్చుకునేందుకు ఆన్‌లైన్ వ్యాపారాలతోపాటు షేర్ల క్రయవిక్రయాలు చేస్తుంటారు. తడబడిన వీరి జీవితంలో అప్పులే మిగిలినట్టు పోలీసులు గుర్తించారు. ఉయ్యూరుకు చెందిన ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడికి రూ.2 లక్షలు షీలా బాకీపడింది. ఇటీవల అత్యవసరమంటూ మరో రూ.30 వేలు శిరీష ద్వారా సర్దుబాటు చేయించుకుంది. పెరుగుతున్న అప్పులతో పా టు విలాసాలు వీరిని దోపిడీకి పురిగొల్పాయి. ఎక్కడో దోపిడీ చేయడమంటే కష్టమని భావించిన శిరీష తన దూరపు బంధువు రమేష్ వద్దనే కొట్టేయాలనుకుంది. పనిచేస్తున్న సంస్థ ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే అతడివద్ద ల క్షల్లో నగదు ఉంటుందని గుర్తించారు. ఇందుకు ఇద్దరు కలిసి పథకాన్ని వేసి అమలు చేశారు.
ఇలా చేశారు..
పథకంలో భాగంగా ఈ నెల 7న ఇద్దరూ కలిసి బందరురోడ్డులోని మాంటిస్సోరి కాలేజీ సమీపంలో కలుసుకున్నారు. నగదు బ్యాగు ఎలా కొట్టేయాలనేది నిర్ణయించుకున్నారు. తమ పథకం అమలులో భాగంగా శిరీష.. రమేష్‌కు ఫోన్ చేసి రమ్మని కోరింది. అప్పటికే మరో స్నేహితుడి కారు తెప్పించుకొని షీలా సమీపంలో వేచిచూస్తోంది. రమేష్ కారులో శిరీష ఎక్కి వెళుతుండగా వెనుక మరో కారులో షీలా అనుసరించింది. రమేష్‌తో పాటు శిరీష నిర్మలా జంక్షన్ వద్ద ఏటీఎంలోకి వెళ్లి వెంటనే రావడంతో నగదు దొంగిలించడం సాధ్యపడలేదు. ఆపై తాము లెనిన్ సెంటర్ వెళుతున్నట్టు శిరీష ఇచ్చిన మెసేజ్ ఆధారంగా ఆమెను అనుసరించింది. అక్కడ శిరీష మాత్రమే కారు దిగగా రమేష్ లోపలే ఉండడంతో పాచిక పారలేదు. గుణదల సెంటర్, నిర్మలా కాన్వెంట్ జంక్షన్లలో కూడా రెండు మార్లు విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు మధ్యాహ్నం మ్యూజియం రోడ్డులోని రెస్టారెంట్‌లో ఫుడ్ పార్సిల్ చేయించుకొచ్చేందుకు రమేష్ వెళ్లగా, షీలా పంపిన డ్రైవర్‌కు నగదు బ్యాగు ఇచ్చేసింది. తిరిగి తనను ఆకాశవాణి కేంద్రం వద్ద దించాలనిచెప్పగా రమేష్ అనుసరించాడు ఆమె దిగే సమయంలో పుస్తకం మరిచిపోవడంతో చోరీ విషయం వెలుగు చూసి పోలీసు స్టేషన్‌కి చేరింది.
ఇలా చిక్కారు..
నగదు చోరీపై రంగంలోకి దిగిన సీసీఎస్ అధికారులు శిరీష, రమేష్‌ను వేర్వేరుగా విచారించారు. బంధుత్వంపై పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పాటు వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని నిజాలు వెలుగు చూశాయి. శిరీషపై అనుమానం వచ్చిన అధికారులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో చేసిన నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా షీలాను అదుపులోకి తీసుకోవడంతో పాటు కాల్వ ఒడ్డున పాతిపెట్టిన నగదు, ఇంటర్నెట్ నిర్వహకుడికి ఇచ్చినది స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.
కన్నేసి ఉంచండి..
విద్యార్థి దశలో పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి. వారి నడవడిక, తిరిగే తిరుగుళ్లు తదితర వాటిని గుర్తిస్తూ తగిన మార్గంలో వెళ్లేలా చూడాలి. స్థోమతకు మించిన జీవనశైలి గడుపుతుంటే నిలువరించాలి. లేకుంటే ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతాయి. తద్వారా పిల్లల భవిష్యత్ మధ్యలోనే ఆగి కడుపు కోత మిగులుతుంది.
- జి.రామకోటేశ్వరరావు, అదనపు డీసీపీ (క్రైమ్స్)
Post a Comment