బ్రిస్బేన్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా భారీ పరుగులు చేసినా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను అడ్డుకోలేక చతికిలబడింది. ప్రత్యేకంగా కెప్టెన్ స్టీవ్ స్మిత్, జార్జ్ బెయిలీలు మూడో వికెట్ కు 242 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా విజయాన్ని అడ్డుకున్నారు. టీమిండియా బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కళాత్మక ఇన్నింగ్స్ ఆడితే.. ఆ మ్యాచ్ ద్వారా వన్డేల్లో ఆరంగేట్రం చేసిన హర్యానా మీడియా పేసర్ బరీందర్ శ్రవణ్ మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా జట్టు బ్యాటింగ్ విభాగంలో బలంగానే కనబడుతున్నా.. బౌలింగ్ విషయంలో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేదు. భారత ప్రధాన బౌలర్లలో అశ్విన్ ఫర్వాలేదనిపించినా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ పేస్ కు అనుకూలించే పిచ్ లో కనీసం రాణించలేదు. తొలి వన్డేలో ఇషాంత్ శర్మను పక్కకు పెట్టడం కూడా ఓటమి కారణమనే విమర్శలు వినిపించాయి. ఈ విమర్శలకు సమాధానం చెప్పాలంటే టీమిండియా కచ్చితంగా రెండో వన్డేలో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం బ్రిస్బేన్ వేదికగా గబ్బా స్టేడియంలో ఇరు జట్లు మధ్య రెండో వన్డే జరుగనుంది. రేపు ఉదయం గం.8.50 ని.లకు(భారత కాలమానప్రకారం) మ్యాచ్ ప్రారంభం కానుంది.
తుది జట్టులో ఇషాంత్!
కీలకమైన రెండో వన్డేకు భారత పేసర్ ఇషాంత్ శర్మ ఆడే అవకాశాలు కనబడుతున్నాయి. బ్రిస్బేన్ కూడా పెర్త్ మాదిరే ఫాస్ట్ పిచ్ కావడంతో ఇషాంత్ ను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. ఇప్పటికే తాను రెండో వన్డేకు ఫిట్ గా ఉన్నట్లు ఇషాంత్ ప్రకటించడంతో అతని ఎంపిక దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇషాంత్ ను జట్టులోకి తీసుకుంటే భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ లను ఒకర్ని పక్కకు పెట్టక తప్పదు. ఇక స్పిన్నర్లలో రవీంద్ర జడేజా, రవి చంద్రన్ అశ్విన్ లు రెండో వన్డేలో కూడా ఆడే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లు,ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాతో ముందుకు వెళతామన్న ధోని.. అశ్విన్, జడేజాలకు విశ్రాంతినిచ్చే సాహసం చేయకపోవచ్చు. భారత క్రికెట్ లో అత్యంత నమ్మకమైన బౌలర్ గా పేరుతెచ్చుకున్న అశ్విన్ వికెట్లను తీయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఇక జడేజా విషయానికొస్తే బౌలింగ్ తో పాటు, బ్యాటింగ్ చేయడం అతనికి ప్రధాన బలం. ప్రస్తుతం ఉన్న భారత జట్టులో జడేజా ఒక్కడే కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ ఆల్ రౌండర్ కావడం అతనికి కలిసొచ్చే అంశం.
రెండు మార్పులతో ఆసీస్ జట్టు
ఆసీస్ జట్టు రెండు మార్పులతో రెండో వన్డేకు సన్నద్ధమవుతుంది. డేవిడ్ వార్నర్ భార్య ప్రసవం కారణంగా సెలవుపై వెళుతుండటంతో మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాజాను ఎంపిక చేశారు. మరోవైపు మిషల్ మార్ష్ కు విశ్రాంతినివ్వనున్నారు. ఆటగాళ్ల రోటేషన్ పద్ధతిలో భాగంగా మార్ష్ స్థానంలో జాన్ హేస్టింగ్ కు అవకాశం కల్పించనున్నారు. ఏది ఏమైనా తమ సొంత గడ్డపై మంచి రికార్డు కలిగి ఉన్న ఆసీస్ ను అడ్డుకోవడం ధోని సేనకు కత్తిమీద సామే. ఈ సిరీస్ లో ధోని సేన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలంటే రెండో వన్డేలో విజయం ముఖ్యం. మరి ధోని సేన ఇక్కడైనా గెలిచి శుభారంభం చేస్తుందో?లేదో? చూడాల్సిందే.
Post a Comment