బెంగళూరు: నేటి రోజుల్లో అడుక్కోవడం ఆకర్షణీయమైన వృత్తిగా మారిపోయింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు కూడా ఈ వృత్తినే ఆశ్రయించడం మరింత ఆశ్చర్యకర విషయం. ముఖ్యంగా భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరంలో పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు వీధుల్లో తిరుగుతూ, ఫుట్‌పాత్‌లపై కూర్చొని నిర్మొహమాటంగా అడుక్కుంటున్నారు. ఎందుకని ఆరాతీస్తే... తాను ఓ కంపెనీలో పనిచేసినప్పుడు నెలకు ఆరువేల రూపాయల జీతం వచ్చేదని, ఇప్పుడు అడుక్కోవడం వల్ల నెలకు 12 వేల రూపాయలకుపైగా సంపాదిస్తున్నానని ఓ పోస్ట్‌గ్రాడ్యుయేట్ వెల్లడించాడు. తన కుటుంబం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల గురించి ఏకరవు పెట్టడం ద్వారా తనకు కుటుంబ పోషణానికి సరిపడ సంపాదన వస్తోందని ఆయన వివరించాడు. ఏదైనా కంపెనీల్లో ఎనిమిది గంటలు పనిచేసినా ఇంతకన్నా ఎక్కువ సంపాదిస్తానన్న నమ్మకం లేదని అన్నాడు.
ఆధునిక సాంకేతిక విప్లవం పరిఢవిల్లిన నేటి ఐటీ యుగంలో సాధారణ చదువులు పూర్తి చేసిన తమకు సరైన ఆధరణ, సరిపడ ఉద్యోగావకాశాలు లేవని బెగ్గింగ్ ప్రధాన వృత్తిగా చేసుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు చెబుతున్నారు. అక్షరాస్యులు, ముఖ్యంగా ఉన్నత విద్యావేత్తలు కూడా వీధుల్లో అడుక్కుంటున్నారన్న విషయం ఓ ప్రభుత్వ అధ్యయనంలో వెల్లడవడంతో కర్ణాటక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ రంగంలోకి దిగి అడుక్కుంటున్న విద్యావేత్తలకు కౌన్సిలింగ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా వారు ఇలాంటి విషయాలు వెల్లడించారు. ఉద్యోగార్హులకు ప్రైవేటు కంపెనీల్లో గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని అధికారులు చెబుతున్నా వారు వినిపించుకోవడం లేదు. 14, 15 వేల రూపాయల ఉద్యోగం ఇప్పిస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు. చిన్నదైన ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినా అడుక్కోవడం మానేస్తామని చెబుతున్నారు. వారందరిని జన జీవన స్రవంతిలోకి తీసుకొచ్చేవరకు కౌన్సిలింగ్ ఇస్తామని, ఈ విషయంలో స్వచ్ఛంద సేవా సంస్థల సహాయ సహకారాలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 10,680 మంది అడుక్కోవడంపైనే జీవిస్తున్నారు. రాజధాని నగరం బెంగళూరులోనే 1,368 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,547 మంది అక్షరాస్యులు అడుక్కుంటుండగా, వారిలో 459 మందిలో గ్రాడ్యుయేట్ల నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నవారు ఉన్నారు. 23 మంది వివిధ సాంకేతిక వృత్తి కోర్సుల్లో డిప్లొమా చేసిన వారున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే 77 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 25 మంది డిప్లొమా హోల్డర్లు, 206 మంది ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ చదవుకున్న వారు ఉన్నారు. వీరంతా ఎక్కువ వరకు నగరంలోని ఎంజీ రోడ్డులో, ఇతర వాణిజ్య ప్రాంతాల్లోనే అడుక్కుంటున్నారు.
ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక నగరంగా ప్రసిద్ధి చెందిన పొరుగు నగరం మైసూరులో కూడా ఉన్నత విద్యావంతులు బెగ్గింగ్‌నే వృత్తిగా పెట్టుకున్నారు. వారిలో 169 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారు. వారిలో 68 మంది మహిళలు ఉండడం గమనార్హం. తాగుడుకు బానిసలై, పనిచేసే జవసత్వాలు ఉడిగిపోయిన కారణంగా అడుక్కోవడంలో అర్థముంది. కేవలం కుటుంబ పోషణార్థమే అడుక్కుంటున్నారంటే నిజంగా ఆలోచించాల్సిన అంశమే.
Post a Comment