ముంబై: ఇటీవల టీమిండియా జట్టులో పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లు సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. చత్తీస్ గడ్ కు చెందిన ఓ పెర్ల్స్ గ్రూప్ పొంజీ స్కీమ్ ద్వారా కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన వారి జాబితాలో యువరాజ్, హర్భజన్ సింగ్ లకు పరోక్షంగా సంబంధాలున్నట్లు తెలుస్తోంది. దీని నుంచి యువీ, హర్భజన్ సింగ్ లు మొహాలీలోని ప్రముఖ ప్రాంతాల్లో పలు ప్లాట్లను బహుమతులుగా పొందినట్లు సమాచారం. ఈ వివాదానికి సంబంధించి విచారణ చేపట్టిన సీబీఐ ఇప్పటికే పలువురు ప్రముఖులతో కూడిన జాబితాను సిద్ధం చేసింది.
ఈ పెర్ల్స్ గ్రూప్ ను అక్రమంగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పెట్టుబడిదార్లను మోసగించారనే ఆరోపణలపై ఈనెల 9వ తేదీన ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల్ సింగ్ భానుగోను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో యువీ, హర్భజన్ ల పేర్లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా, పెర్ల్స్ గ్రూప్ వ్యవహారంతో తమ కుమారుడు ఎటువంటి సంబంధం లేదని యువీ తల్లి సబ్నామ్ పేర్కొన్నారు. 2011 లో వరల్డ్ కప్ కు గెలిచిన భారత క్రికెట్ జట్టులోని సభ్యులకు ప్లాట్లను గిఫ్ట్ లుగా ఇస్తున్నట్లు ఆ పెర్ల్స్ గ్రూప్ ప్రకటించిన మాట వాస్తవమేనని.. అయితే తాము వారి నుంచి ఎటువంటి కానుకలు తీసుకోలేదన్నారు.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో ఈ గ్రూప్ కు బ్రాండ్ అంబాసిండర్ గా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ ఉండటం గమనార్హం. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ పంజాబ్ కు పెర్ల్స్ గ్రూప్ ఒక స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. దాదాపు నలభై అయిదు వేల కోట్ల రూపాయిల మేర కొల్లగొట్టడమే కాకుండా, చట్ట విరుద్ధంగా ఈ గ్రూప్ ను ఏర్పాటు చేయడమే తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
Post a Comment