► పనితీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై థర్డ్ పార్టీ విచారణ
► నివేదికల ఆధారంగా పీఎస్‌లకు గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్: నేరగాళ్లను పట్టుకునేందుకు నిఘా ఉంచే పోలీసులపైనే మూడో కన్ను కాపు కాస్తోంది. ఠాణాలకు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా? కేసుల విచారణ తీరు ఎలా ఉంది? కాసులకు కక్కుర్తి పడుతున్నారా? పోలీసు స్టేషన్లకు నిర్వహణ వ్యయం కింద ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగిస్తున్నారా... వంటి పోలీసు పనితీరును తెలిపే అంశాలపై ‘థర్డ్ పార్టీ’ నిఘా వేసి వివరాలు సేకరిస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు మదింపు చేసి ఉన్నతాధికారులకు చేరవేస్తోంది. ఈ నివేదిక ఆధారంగా పోలీసు స్టేషన్లకు గ్రేడింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
డెలాయిట్, ఐఎస్‌బీలతో విచారణ
శాంతిభద్రతలు అదుపులో ఉంటే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడంతో పాటు దేశంలో మంచి గుర్తింపు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెద్దఎత్తున నిధులు కేటాయించి, అన్ని వసతులూ కల్పిస్తోంది. అదే విధంగా ప్రజలతో పోలీసులు సత్సంబంధాలు కలిగుండేలా ‘పీపుల్స్ ఫ్రెండ్లీ’ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే కొన్ని చోట్ల పోలీసుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది.
అంతేకాదు కొన్ని ఠాణాల్లో మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన పోలీసు ఉన్నతాధికారులు లోపాలపై అధ్యయనం చేయాలని భావించారు. ఇందుకు ఠాణాల నుంచి ముఖ్య కార్యాలయాల వరకు చోటు చేసుకుంటున్న ఘటనలు, అంశాలపై డెలాయిట్, ఐఎస్‌బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) సంస్థలతో విచారణ జరిపించాలని నిర్ణయించారు.
నిశిత పరిశీలన..
థర్డ్ పార్టీ సంస్థలు అన్ని పోలీసు స్టేషన్లలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ‘పీఫుల్స్ ఫ్రెండ్లీ’ విధానానికి అనుగుణంగా వారి ప్రవర్తన ఉంటుందా... లేదా అనేది పరిశీలిస్తున్నాయి. అలాగే అన్ని ఠాణాల్లో రిసెప్షన్, నిఘా, పెట్రోలింగ్... మూడు విభాగాలుగా నివేదిక తయారు చేస్తున్నాయి. శిక్షణ పొందిన పోలీసులు అందుకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తున్నారా.. లేదా అనే దానిపైనా దృష్టి పెట్టాయి. స్టేషన్లతో పాటు కార్యాలయాలలో పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు.
వీటిలో సైతం ఏమైనా లోపాలు ఉన్నాయా... లేదా అని తెలుసుకోవాల్సిందిగా థర్డ్ పార్టీకి పోలీసు ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా పోలీసు స్టేషన్ల స్టేషనరీ ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా నగరాలు, పట్టణాలు, రూరల్ ప్రాంతాలను బట్టి రూ.75 వేలు, రూ.50 వేలు, రూ.25 వేలు మంజూరు చేస్తోంది. వీటి ఖర్చులకు సంబంధించి ఎలాంటి ఆడిటింగ్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించి... థర్డ్ పార్టీ సంస్థలు నివేదిక ఇస్తాయి. ఈ నివేదికల ఆధారంగానే పోలీస్ స్టేషన్లకు గ్రేడింగ్ ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Post a Comment