రెండు రోజుల కిందట కరాచీలోని డిఫెన్స్ మార్కెట్ ప్రాంతానికి వెళ్లిన ఖాన్ కు ఓ వృద్ధుడు తారసపడ్డాడు. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డంతో యాచకుడిలా కనిపించిన అతనికి అంతోఇంతో ఇవ్వబోయాడట ఖాన్. 'డబ్బులొద్దు. ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి' అని ఆ వృద్ధుడు ఇంగ్లీష్ లో అడిగేసరికి ఖాన్ డంగైపోయాడట! వెంటనే తన మొబైల్ ఫోన్ తీసి ఆ ముసలాయను ఇంటర్వ్యూచేశాడు. స్వచ్ఛమైన బ్రిటిష్ ఇంగ్లీష్, మధ్యమధ్యలో హాస్యోక్తులు, అక్కడక్కడా హిందీ షాయరీలతో సాగిన ఆ ఇంటర్వ్యూను హీరో ఖాన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ఆ వీడియో సంచలనం సృష్టించింది.
కారు ప్రమాదంలో భార్య సహా ఏడుగురు పిల్లల్ని పోగొట్టుకున్న ఆ లాహోర్ వృద్ధుణ్ని అన్నదమ్ములు మోసం చేసి ఇంటి నుంచి గెంటేశారట. దిక్కుతోచని స్థితిలో కరాచీకి వచ్చి, అక్కడే ఓ ఇంటి వసారాలో ఉంటున్నాడట. కంప్యూటర్లు తప్ప మిగతా ఏపనైనా సరే ఇట్టే చేసేస్తానన్న ఆ వృద్ధుడి మాటలకు ఫిదా అయిన వేల మంది నెటిజన్లు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. పాక్ లో పేరుమోసిన 'ఆమ్ టెక్ సిస్టమ్స్' అనే సాఫ్ట్ వేర్ కంపెనీ అయితే ఏకంగా ఓ క్వార్టర్స్ ఇచ్చిమరీ పనిలో పెంట్టుకుంటానని ప్రకటించింది. ఇలా పేరున్న నటుడి ఫేస్ బుక్ పోస్ట్ తో అనాథ వృద్ధుడి ఆకాంక్ష నెరవేరింది. 'బీయింగ్ హ్యుమన్' బ్రాండ్ అంబాసిడర్ కాకున్నా మీ హ్యుమానిటీ ప్రశంసనీయం' అంటూ అహసాన్ ఖాన్ ను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
Post a Comment