* ‘డిక్టేటర్’ సినిమాపై నందమూరి బాలకృష్ణ
* తిరుపతి, చంద్రగిరిలలో ప్రేక్షకులమధ్య కూర్చుని సినిమాను తిలకించిన బాలయ్య
తిరుపతిసిటీ/చంద్రగిరి: అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ‘డిక్టేటర్’ చిత్రంలో నటించానని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో కలసి బుధవారం తన వియ్యంకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చారు. గురువారం ఉదయం తానే స్వయంగా కారు నడుపుకుంటూ తిరుపతిలోని కృష్ణతేజ థియేటర్‌కు వచ్చిన ఆయన తాను నటించిన డిక్టేటర్ సినిమాను ప్రేక్షకుల మధ్య కూర్చుని కొద్దిసేపు తిలకించారు.
ముఖ్యమైన సన్నివేశాలు వచ్చినపుడు అభిమానులతోపాటు బాలయ్య కూడా ఈలలేశారు.. చప్పట్లు కొట్టారు. దీంతో థియేటర్‌లో సందడి నెలకొంది. అనంతరం థియేటర్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిక్టేటర్ సినిమాకు అభిమానులనుంచి అపూర్వ స్పందన లభిస్తోందని చెప్పారు. తమన్ మంచి మ్యూజిక్, కోన వెంకట్ ఆకట్టుకునే సంభాషణలు ఇచ్చారన్నారు. ‘అంతా అనుకుంటే దైవమని, అంతే అనుకుంటే డిక్టేటర్’ అని చిత్రంలోని ఓ డైలాగ్‌ను చెప్పారు. అనంతరం తన కుమారుడు మోక్షజ్ఞతో కలసి చంద్రగిరిలోని జీవీ సినిమాస్ థియేటర్‌కు వెళ్లి అక్కడా కొద్దిసేపు సినిమాను చూశారు. తర్వాత అక్కడినుంచి నారావారిపల్లెకు చేరుకున్నారు.
Post a Comment