సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్ తో మరోసారి పండుగ రేస్ లో నిలిచాడు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్ లో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ లో తెరకెక్కిన డిక్టేటర్ మరో రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతోంది. మరి నందమూరి అందగాడు సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సక్సెస్ సాధించాడా...? డిక్టేటర్ గా బాలయ్య బాక్సాఫీస్ కలెక్షన్లను శాసించాడా..?
కథ :
చంద్రశేఖర్ ధర్మ ( బాలకృష్ణ) ఢిల్లీలో పెద్ద బిజినెస్ మేన్. తన సంపదతో దేశ ఆర్ధిక వ్యవస్థనే శాసించే స్ధాయి వ్యాపార వేత్త. అప్పటి వరకు మాఫీయా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారవేత్తలకు తను అండగా ఉంటూ అందరినీ కాపాడుతుంటాడు. అదే సమయంలో తన పవర్ తో రాజకీయాలను, మాఫీయాను శాసిస్తుంటుంది మహిమా రాయ్(రతీ అగ్నిహోత్రి). ఒక ఫ్యాక్టరీ విషయంలో చంద్రశేఖర్ ధర్మ, మహిమా రాయ్ లకు గొడవ అవుతుంది. ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవటం కోసం చంద్రశేఖర్ ధర్మకు కావాల్సిన వ్యక్తిని మహిమా రాయ్ అల్లుడు చంపేస్తాడు. దీంతో చంద్రశేఖర్ ధర్మ అతన్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు.
ఈ గొడవల్లో చంద్రశేఖర్ ధర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాత్యాయని (అంజలి)ని మహిమారాయ్ మనుషులు పొడిచేస్తారు. చంద్రశేఖర్ ధర్మకు మహిమా రాయ్ తో ఉన్న గొడవలు కారణంగా తాము కూడా చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో కుటుంబం కూడా చంద్రశేఖర్ ధర్మను దూరం చేస్తుంది. అలా ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్ ధర్మ మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు. చివరకు మహిమారాయ్, ఆమె అనుచరులు ఏం అయ్యారు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
చంద్రశేఖర్ ధర్మగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించిన బాలకృష్ణ మరోసారి తన మార్క్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. భారీ డైలాగ్ లతో ఆడియన్స్ తో విజిల్స్ వేయించాడు. ఫస్టాఫ్ లో కూల్ గా, సెకండాఫ్ లో పవర్ ఫుల్ గా రెండు షేడ్స్ తో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలలోనే కనిపించే బాలకృష్ణ ఈ సారి స్టైలిష్ గా కనిపించి మెప్పించాడు. తొలిసారిగా బాలయ్యతో జోడి కట్టిన అంజలి మరోసారి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో మెప్పించింది. ఇక కథతో సంబంధం లేకపోయినా కేవలం అందం కోసమే పెట్టుకున్న సోనాల్ చౌహాన్ బాగానే గ్లామర్ ఒలకబోసింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రతీ అగ్నిహోత్రి విలన్ గా మెప్పించింది. నాజర్, సుమన్, శియాజీ షిండే, 30 ఇయర్స్ పృధ్వీలు తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక నిపుణులు :
ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ టచ్ ఉన్న కథలు మాత్రమే డీల్ చేసిన శ్రీవాస్. బాలయ్య స్టామినాకు తగ్గ సినిమా చేయటంలో కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా రెండున్నర గంటల పాటు చెప్పేంత కథ లేకపోవటంతో ఫస్టాఫ్ అంతా కథతో సంబంధం లేని సీన్స్ తో నింపేశాడు. ఇక అసలు కథలో ఎంటర్ అయిన తరువాత కూడా సినిమాలో వేగం కనిపించలేదు.
కోన వెంకట్, గోపి మోహన్ లు మరోసారి రొటీన్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. చాలా పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎం. రత్నం మాటలు బాగున్నాయి. బాలయ్య అభిమానులతో విజిల్స్ వేయించే పంచ్ డైలాగ్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. థమన్ సంగీతం ఫరవాలేదనిపించింది. పాటలు విజువల్ గా బాగున్నాయి. చిన్నా అందించిన నేపధ్య సంగీతం చాలా చోట్ల ఆకట్టుకుంటుంది. శ్రీవాస్ సినిమాలలో ఆశించే స్థాయి కామెడీ ఎక్కడా కనిపించలేదు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ
సినిమాటోగ్రఫి
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరి
మ్యూజిక్
ఫస్టాఫ్
ఓవరాల్ గా డిక్టేటర్ బాలయ్య అభిమానులను అలరించే కమర్షియల్ ఎంటర్ టైనర్
Post a Comment