నటుడు అధర్వ తనను ర్యాగింగ్ చేశారని పేర్కొన్నారు నటి ఆనంది. నటిగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగింటి ఆడపడుచు అన్న విషయం తెలిసిందే. అయినా తమిళంలో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆనంది కయల్ చిత్రంతో ఇక్కడ మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల త్రిష ఇల్లన్నా నయనతార చిత్రంలో తనను అశ్లీలంగా నటింపచేశారంటూ ఆరోపణలతో కాస్త కలకలం సృష్టించిన ఆనందితో చిట్‌చాట్.
ప్ర: మీ గురించి చెప్పండి?
జ: ప్లస్‌టూ చదువుతుండగానే చిత్ర రంగప్రవేశం చేశాను. నేను నటిని కాక ముందు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. అదంటే నాకు చాలా ఆసక్తి. అయితే చదువు పూర్తి చేయమని అమ్మ హితవు పలకడంతో బీబీఏ కోర్స్‌లో చేరాను. ప్రభుసాలోమన్ దర్శకత్వంలో నటించిన కయల్ చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. ఆ చిత్రం తరువాత పలు మంచి అవకాశాలు వరిస్తున్నాయి. కయల్ చిత్రం 2014 చివరిలో విడుదలైంది. 2015లో అధర్వ, దినేశ్, జీవీ ప్రకాశ్‌కుమార్‌లతో నటించిన చిత్రాలు విజయం సాధించాయి. 2016 నూతన సంవత్సరాన్ని జీవీ ప్రకాశ్‌కుమార్‌తో జత కడుతున్న తాజా చిత్ర షూటింగ్‌లోనే జరుపుకున్నాను. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది విజయవంతంగా సాగుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు పండిగై, పైసల్, జీవీతో చిత్రం అంటూ బిజీగా ఉన్నాను. అలాగే బీబీఏ రెండవ ఏడాది చదువుతున్నాను.
ప్ర: ఒక పక్క నటిస్తూనే బీబీఏ చదువుతున్నారు. కళాశాలలో ర్యాగింగ్‌ను ఎదుర్కొన్నారా?
జ: లేదు. కళాశాలలో ర్యాగింగ్‌ను ఎదుర్కొన్న సందర్భాలు ఎదురవ్వలేదు. అయితే మూడవ ఏడాదిలోకి అడుగు పట్టిన తరువాత నేనే ర్యాగింగ్ చేయాలని అనుకుంటున్నాను. ఇక కళాశాలలో నాకు ర్యాగింగ్ అనుభవం లేదు గానీ చండీవీరన్ చిత్ర షూటింగ్ సమయంలో హీరో అధర్వ, ఆ చిత్ర టీమ్ నన్ను ర్యాగింగ్‌తో అల్లరి పెట్టేవారు.
ప్ర: విచారణై చిత్రంలో నటించడానికి సందేహించారట?
జ: నిజమే. కారణం ఆ చిత్రంలో నా పాత్ర పరిధి చాలా తక్కువ. అందుకే అమ్మ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో కయల్ చిత్రంతో నాకు మంచి లైఫ్ ఇచ్చిన దర్శకుడు ప్రభుసాలోమన్ సలహా అడిగాను. అప్పుడాయన ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని హితవు పలికారు. ఆ చిత్రంలో తెలుగమ్మాయిగానే నటించాను. అందువల్ల నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. ఇక పండిగై చిత్రంలో కృష్ణకు జంటగా నటిస్తున్నా ను. నటి విజయలక్ష్మి నిర్మాత. ఆమె భర్త ఫి రోజ్ దర్శకుడు. చిత్ర టైటిల్ మాదిరిగానే షూటింగ్ అంతా ఒక ఫెస్టివల్‌లాను జరుగుతోంది. మరో చిత్రం పైసల్. ఇది హారర్ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం. తా జాగా జీవీ ప్రకాశ్‌కుమార్‌తో నటిస్తున్నాను.
ప్ర: త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం తరువాత జీవీతో కాంప్రమైజ్ అయినట్లున్నారే?
జ: హలో సార్ త్రిష ఇల్లన్నా నయనతార చిత్రానికి సంబంధించి జీవీ ప్రకాశ్‌కుమార్‌తో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. ఆ చిత్ర దర్శకుడిపైనే నాకు ఇప్పటికీ కోపం. జీవీ నాకు మంచి ఫ్రెండ్. సాధారణంగా నేనెవరితోనూ స్నేహం చేయను. జీవీ షూటింగ్ స్పాట్‌లో చాలా జాలీగా ఉంటారు. నాకు చాలా సపోర్టివ్‌గా ఉండేవారు.
ప్ర: నటి శ్రీదివ్య మీకు పోటీ అట?
జ: శ్రీదివ్య నేను ఒక తెలుగు చిత్రంలో కలిసి నటించాం. తను నాకు మంచి స్నేహితురాలు. ఇక నటనా పరంగా ఆరోగ్యకరమైన పోటీ ఉండడం మంచిదేగా.
Post a Comment