ముంబై: రాజకీయ, మత సంబంధిత విషయాల గురించి తాను మాట్లాడనని బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అన్నాడు. ఈ రెండు విషయాల గురించి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోనని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ గజల్ గాయకుడు గులాం అలీ కచేరిని ముంబైలో జరగనివ్వకుండా అడ్డుకున్న విషయం గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షారుక్ పైవిధంగా స్పందించాడు. 'రాజకీయ, మత విషయాల గురించి నేను మాట్లాడినపుడు విమర్శలు వస్తున్నాయి. అందుకే ఈ విషయం గురించి స్పందించను' అని షారుక్ అన్నాడు.
దేశంలో అసహనం పెరిగిపోతోందని షారుక్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో క్షమాపణలు చెప్పాడు. దీని ప్రభావం తన తాజా సినిమా 'దిల్ వాలే' కలెక్షన్లపై పడిందని అన్నాడు. తాను ఆశించిన స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు రాలేదని, భారత్ లో కంటే విదేశాల్లోనే బాగా ఆడిందని చెప్పుకొచ్చాడు. ఇక ముంబై పోలీసులు తన భద్రతను కుదించడంపై కూడా షారుక్ సమాధానం దాటవేశాడు.
Post a Comment