అనంతపురం: కాన్పు కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ మహిళ మగబిడ్డకు జన్మనివ్వగానే శిశువును అక్కడే వదిలి ఎటో వెళ్లిపోయింది. దీంతో శిశువును ఎవరికి అప్పగించాలో తెలియక ఆస్పత్రి వర్గాలు సతమతమవుతుండగానే శ్వాస అందక కళ్లు కూడా తెరవని పసికందు శాశ్వతంగా కన్నుమూశాడు. మంజుల అనే మహిళ తన తల్లిని వెంటబెట్టుకుని కడుపునొప్పి అంటూ మంగళవారం రాత్రి 9 గంటలకు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది.
డ్యూటీ వైద్యులు పరీక్షించి ఏడు నెలల గర్భవతి అని చెప్పి ప్రసూతి వార్డుకు పంపారు. అక్కడ అరగంటకే పురిటినొప్పులు రావడంతో ఆమె మగ బిడ్డను ప్రసవించింది. అదే రోజు రాత్రి 10 గంటలకు సాధారణ ప్రసవం కావడంతో ఇంటికి వెళ్లి దుస్తులు తెమ్మని తన తల్లికి మంజుల చెప్పింది. అలా తల్లిని సాగనంపుతూ వార్డు బయటకు వచ్చిన మంజుల తల్లితో పాటూ ఎటో వెళ్లిపోయింది. వారు ఎంతసేపటికీ రాకపోయేసరికి ఆస్పత్రి వర్గాలు కంగారుపడ్డాయి. బుధవారం ఉదయం విచారణ జరిపించారు.
ఆస్పత్రి రికార్డులో కదిరి సమీపంలోని కుమ్మరవాండ్లపల్లి అని, తన భర్త రాజేష్ అని రాయించడంతో వైద్యసిబ్బంది ద్వారా అక్కడ కూడా విచారణ చేపట్టారు. అయితే మంజుల అనే ఆమె ఎవరూ లేదని తేలడంతో చిరునామా తెలియక సతమతమయ్యారు. సాధారణంగా 2.25 కిలోల బరువు ఉండాల్సి ఉండగా శిశువు కేవ లం 1.5 కిలోల బరువు ఉన్నట్లు హెడ్‌నర్స్ వసలాదేవి తెలిపారు. శిశువుకు పాల కోసం బత్తలపల్లి ఆర్డీటీ లేదా, అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించాలని నిర్ణయించామన్నా రు. మరోవైపు చైల్డ్‌లైన్ వారు కూడా వచ్చి వీలైతే శిశువును తమ సంరక్షణలో ఉంచుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆలోగానే శ్వాస అందక శిశువు మృతి చెందాడు.
Post a Comment