తమిళసినిమా:క్రేజీ నటి నయనతారకు అమితాబ్ బచ్చన్ యూత్ ఐకాన్ అవార్డుతో పాటు ఉత్తమ నటిగా ప్రఖ్యాత దర్శకుడు కే.బాలచందర్ స్మారక అవార్డు ఏక కాలంలో వరించాయి. ఎనిమిది రోజులుగా 13వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు చెన్నై సినీ ప్రజానీకాన్ని అలరిస్తున్నాయి.ఈ నెల ఆరో తేదీ నుంచి 13వ తేదీ వరకూ 37 దేశాలకు చెందిన 184 ఉత్తమ చిత్రాలను తిలకించి పులకించారు.
ఇండో సినీ అప్రిషియేషన్ ఫైండేషన్ సంస్థ నిర్వహించిన ఈ చిత్రోత్సవాల చివరి రోజు బుధవారం సాయంత్రం ప్రఖ్యాత దర్శకుడు కే.బాలచందర్, నటి మనోరమల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అదే విధంగా ఉత్తమ తమిళ చిత్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న 12 తమిళ చిత్రాల్లో ఉత్తమచిత్ర అవార్డును క్రిమి గెలుచుకుంది.
ఈ చిత్ర దర్శకుడు అనుచరణ్‌కు ధృవపత్రంతో పాటు రెండు లక్షల నగదు బహుమతిని, నిర్మాతలు ఏ.రాజేందర్, జయరామన్,పృథ్వీరాజ్, రే.జయరామన్‌లకు లక్ష నగదు బహుమతిని అందించారు. రెండో ఉత్తమచిత్రంగా రేడియోపెట్టి చిత్రం ఎంపికైంది. ఈ చిత్ర దర్శకుడు విశ్వనాథ్,నిర్మాతలకు తలా లక్ష నగదు బహుమతిని అందించారు.ఈ చిత్రంలో బధిరుడు పాత్రలో నటించిన లక్ష్మణ్‌కు స్పెషల్ జూరీ అవార్డుతో పాటు లక్ష నగదు బహుమతిని అందించారు.
ప్రతి ఏడాది అమితాబ్ బచ్చన్ పేరుతో అందించే యూత్ ఐకాన్ అవార్డు,కే.బాలచందర్ స్మారక అవార్డు నటి నయనతారను వరించాయి. జ్ఞాపికలతో పాటు ఒక్కో అవార్డుకు లక్ష రూపాయల నగదు బహుమతిని నయనతార అందుకున్నారు.అదే విధంగా నటుల విభాగంలో కే.బాలచందర్ స్మారక అవార్డును నటుడు అరవింద్‌సామి అందుకున్నారు. సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Post a Comment