డబ్బులకు కక్కుర్తి పడ్డారు
►ముందు 2 కోట్లు ఇచ్చా... ఇంకా 4 కోట్లు కావాలన్నారు
►ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి అందుకే విరమించుకున్నా
►వైఎస్సార్ దయతో జెడ్పీ చైర్మన్ అయ్యా ..
►జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి
వినాయక్‌నగర్: రాజకీయాల్లో అవినీతి అందలానికి ఎక్కిందని, నిజాయితీగా ఉండే నేతలకు.. డబ్బులేని వారికి అవకాశాలు ఉండటం లేదని నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అభ్యర్థులు లేక మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ తదితరులు తనవద్దకు వచ్చి పోటీ చేయమని మొరపెట్టుకోవడంతో బరిలో దిగానన్నారు. పార్టీ అభివృద్ధికి రూ.2 కోట్లు అడిగితే స్నేహితుల వద్ద అప్పుగా తీసుకొచ్చి ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ శాసనమండలి పక్ష నేత షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీ మధుయూష్కీగౌడ్, జిల్లాలోని ఇతర నేతలతోపాటు డీసీసీబీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ కూడా మరో రూ.4 కోట్లు ఖర్చుపెడితే కానీ గెలిచే పరిస్థితి లేదని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేశారని ఆరోపించారు. ఆ సమయంలో మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అండగా నిలిచినా.. మిగతా వారి ఒత్తిళ్లను తట్టుకోలేక ఎమ్మెల్సీ బరి నుంచి విరవించుకున్నానన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తన రాజకీయ జీవితాన్ని చూసి నీతివంతమైన పాలన చేస్తానన్న నమ్మకంతో జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీలో కూర్చొబెట్టారని ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి గుర్తు చేసుకున్నారు. సొమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు డబ్బుల విషయమై సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Post a Comment