స్మాల్‌స్టాంప్స్.. ఇదో స్టార్టప్ గూగుల్!
► ఒక్క వెబ్ పేజీలోనే 50కిపైగా సంస్థల సమాచారం
► వినూత్న సేవలందిస్తున్న స్మాల్‌స్టాంప్స్.కామ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మనకెలాంటి సమాచారం కావాలన్నా ముందుగా వెతికేది గూగుల్‌లోనే. అయితే ఈ-కామర్స్ సంస్థలకు ప్రధాన సమస్య దీంతోనే. ఎలాగంటే గూగుల్‌లో సెర్చ్ చేస్తే... టాప్‌లో ఉండే కొన్ని సంస్థలు తప్ప అన్ని ఈ-కామర్స్ సంస్థల పోర్టల్స్ కనిపించవు. అలాంటప్పుడు చిన్న సంస్థలు, కొత్త సంస్థల గురించి జనాలకెలా తెలుస్తుంది? పోనీ గూగుల్‌తో ఒప్పందం చేసుకుందామంటే వాటికి అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించేంత లాభాలుండవు. దీనికి పరిష్కారం చూపిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్‌స్టాంప్స్.కామ్.
మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ ప్రతాప్ రాజేష్ మాటల్లోనే..
గతంలో సొంతంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను నడిపించేవాడిని. ఆ సమయంలో ఎంత లాభాలొచ్చినా... ఎంత ప్రచారం చేసినా నా కంపెనీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మొదటి పేజీలో కనిపించేది కాదు. చాలా మందిసెర్చ్ ఇంజిన్ రెండో పేజీ, మూడో పేజీలోకి వెళ్లరు. అలా వెళతారనే నమ్మకం నాక్కూడా ఉండేది కాదు. అప్పుడే అనిపించింది! అసలు కంటెంట్ ఆధారంగా కాకుండా ఇమేజెస్ ఆధారంగా సెర్చ్ ఇంజిన్ ఉంటే ఎలా ఉం టుందా అని! అలా రూ.4 లక్షల పెట్టుబడితో ఇటీవలే ఇమేజెస్ బ్రౌజింగ్ మిషన్‌ను ప్రారంభించా.
బ్యాంకింగ్, ఫ్యాషన్, ట్రావెల్స్, షాపింగ్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, హాస్పిటల్స్, ఫుడ్, రియల్టీ, ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్స్.. అన్ని విభాగాల్లో ఇమేజెస్ ఆధారంగా బ్రౌజింగ్ చేయొచ్చు. వాటి మీద క్లిక్ చేయగానే సంబంధిత కంపెనీ వెబ్‌సైట్ కి లాగిన్ అవుతుంది. దేశ వ్యాప్తంగా సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ కేంద్రంగా 30 మంది క్లయింట్లు రిజిస్టర్ అయ్యారు.
ప్రతీ పేజీలో 50 మంది క్లయింట్లు కనిపిస్తుంటారు. ఇందుకు గాను ఒక్కో క్లయింట్‌కు ఏడాదికి రూ.15 వేలు చార్జీ ఉంటుంది. సంబంధిత కంపెనీలు తమకు అవసరమైనప్పుడల్లా ఆ ఇమేజీలను మార్చుకోవచ్చు కూడా. అంటే ఆఫర్లు, పండగ సందర్భాల్లో ఇమేజీలను మార్చుకునే వీలుం టుంది. భాగస్వాముల కోసం చూస్తున్నాం. ఆ తర్వాతే నిధుల సమీకరణ మీద దృష్టి పెడతాం.
Post a Comment