-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

May 09, 2016

అనన్యసామాన్య...?


కుమార్ మంగళం బిర్లా! వ్యాపార సామ్రాజ్యానికి మహారాజు. ‘ఆదిత్యా గ్రూప్’ ఆయన మకుటం. ఈ మహారాజు పెద్ద కూతురు అనన్య.  అనన్య పోస్ట్‌గ్య్రాడ్యుయేషన్ కాగానే ముద్దుగా కిరీటం పెట్టి ‘గ్రూప్’ ఫోటో దిగాలనుకున్నారు కుమార్ మంగళం. అనన్య ఒప్పుకోలేదు. సెల్ఫీ తీసుకుంటానంది. అది కూడా గ్రూప్‌తో కలసి కాదు! తనకు తానుగా ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుని ఆ సామ్రాజ్యంలోని పురజనులతో సెల్ఫీ దిగుతానంది. కొత్త కంపెనీ పెట్టుకుంటానంది. ‘అప్పు ఇవ్వగలిగితే ఇవ్వండి. తీర్చేస్తాను.

ఇవ్వలేకపోతే చెప్పండి, నా తిప్పలు నేను పడతాను’ అంది.  ఆ అమ్మాయి స్వతంత్రంగా నిలబడదలచుకుంది.  తన కంపెనీకి కూడా ‘స్వతంత్ర’ అన్న పేరే పెట్టుకుంది.

జనవరి 2016. ముంబైలో పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతోంది. అందులో వేత్తలు మాత్రమే కాదు. ఓ వరుసలో లేత పిందెలూ ఉన్నాయి. కొత్తగా కంపెనీలు (స్టార్టప్స్) పెట్టిన పిల్లలు వాళ్లు. అందులో ఒకరు అనన్య. పెద్ద కంపెనీల్లో చేరిపోయి ఆ అనుభవంతో సొంత కంపెనీలు పెట్టడంలో రిస్క్ తక్కువగా ఉంటుంది అని ఎవరో డయాస్ మీది నుంచి టిప్ ఇచ్చారు. ఆ టిప్‌ని పట్టుకుని అనన్య ధైర్యంగా డయాస్ మీదికి వెళ్లారు. టిప్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. కానీ మా స్టార్టప్‌లకు టిప్స్ అవసరం లేదు అని సవినయంగా మనవి చేశారు.

పెద్దలంతా ఆశ్చర్యపోయారు. స్టార్టప్‌లు వచ్చి మీలో చేరడం వల్ల మాకు అనుభవం వస్తుంది. మా నెట్‌వర్క్ మీకు ఉపయోగపడుతుంది. ఇద్దరికీ ప్రయోజనమే. కానీ ఎక్కువ ప్రయోజనం పెద్ద కంపెనీలకే. మా నెట్‌వర్క్‌ని, మా కష్టాన్ని, మా వ్యూహాన్ని మాకే ఉంచుకుని మీకు పోటీగా ఎదగడం మాకు ఇష్టం అన్నారు అనన్య!
 అంతా షాక్ తిన్నారు.
 ఎవరీ అమ్మాయి?
 కుమార్ మంగళం బిర్లా కూతురు.
 ఇంత పెద్ద కూతురుందా?
 ‘అవును.. స్టార్టప్..’ ఎవరో పెద్దగా నవ్వారు కాంప్లిమెంటగా. ఆ దృశ్యం చూసి పుత్రికోత్సాహంతో కుమార్ మంగళం ఆనందించేవారే కానీ, అప్పుడు ఆయన ఆ సదస్సులో లేరు.
  
ఈమధ్య అనన్య ఇండోర్ వెళ్లారు. అక్కడి ఐ.ఐ.ఎం.లో క్యాంపస్ ఇంటర్వ్యూలు. వాళ్లలోంచి తనక్కావలసిన వాళ్లను ఎంచుకోవాలి అనన్య. ఎవరైనా ఏం ఆలోచిస్తారు? వీళ్లు నా కంపెనీకి పనికొస్తారా అని కదా! అనన్య ఇంకో రూట్‌లో ఉన్నారు. ఇంతమంది వచ్చారు. ఆలోచించుకునే వచ్చారా? ‘ఈ చిన్న కంపెనీ... లైఫ్‌లో నేను ఎదగడానికి నిచ్చెన కాగలదా? నేనేం కావాలనుకున్నానో దాన్ని నాకు సమకూర్చి పెట్టడానికి ఈ కంపెనీ ఒక ప్లాట్ ఫామ్ అవగలదా?’ - అని ప్రశ్నలు వేసుకునే వచ్చారా వీళ్లంతా.. అని ఆలోచిస్తున్నారు అనన్య.

కంపెనీకి నేనిది ఇవ్వగలను అని సీవీ పట్టుకుని రావడం కాదు. కంపెనీ నాకేం ఇవ్వగలదు అని అడగ్గల చురుకుదనం క్యాండిడేట్స్‌లో ఉండాలి. ఆ చురుకుదనం అనన్యకు కావాలి. ఆ రోజు ఇంటర్వ్యూలో అందరి సీవీలు బరువుగా ఉన్నాయి. అనన్య కొందరినే ఎన్నుకున్నారు.. సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ బరువుగా ఉన్నవాళ్లను! ఉద్యోగానికి వచ్చిన వాళ్లలో దుడుకుతనం ఉంటే... కంపెనీని దూకుడుగా నడిపించవచ్చని అనన్య నమ్మకం.

ఆమె కోరుకుంటున్నది కొత్తకొత్త ఐడియాలతో పోటీ సంస్థలకు దడ పుట్టించే దడుకుతనం. దానికి కొంచెం అంకితభావం, టెక్నికల్ నాలెజ్డ్ తోడైతే... మిరకిల్స్ చెయ్యొచ్చు. అలాంటి ఓ మిరకిలే.. అనన్య స్టార్టప్ కంపెనీ. గ్రామీణ ప్రాంత మహిళల కోసం ఆమె ‘స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్’ స్థాపించారు. చిన్న చిన్న మహిళా పారిశ్రామికులకు తక్కువ వడ్డీకి రుణాలిచ్చి ఉన్నవాళ్లు లేనివాళ్ల మధ్య అంతరం తగ్గించడం ‘స్వతంత్ర’ సంకల్పం.

ఆరంభాలకు ఆదర్శం
స్కూల్లో అనన్య చెస్ ఛాంపియన్. స్కూలు బయటికి వచ్చాక ఛెస్‌ను ఆమె వదిలేశారు కానీ, ఛెస్ ఆమెను వదల్లేదు. ఆ ఆటలోని ఎత్తులు, వ్యూహాలు జీవిత చదరంగంలో  ఆమెను ముందుకు నడిపిస్తున్నాయి. 17 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ నుంచి ‘మాస్టర్స్ ఇన్ ఎకనమిక్స్ అండ్ మేనేజ్‌మెంట్’ పట్టా అందుకున్నారు. 19 ఏళ్ల వయసులో ‘స్వతంత్ర’ను స్థాపించారు. ముంబైలో ఇప్పుడు స్టార్టప్ కంపెనీలు పెట్టే యువతీయువకుల ఐకన్.. అనన్య. ‘కుదురుగా ఉండిపోతే ఎదగలేరు’ అన్నది ఆమె సిద్ధాంతం.

మరో రోమ్ సిద్ధం అవుతోంది!
స్వతంత్ర మైక్రోఫైనాన్స్‌ను ఆరంభించేనాటికి.. రోజువారీ ఖర్చులకైనా డబ్బును వెంటబెట్టుకుని వెళ్లడం ఇష్టం లేని ఒక అమ్మాయి అనన్య. చెస్‌ను వదిలేశాక ఆమె గిటార్‌ను పట్టుకున్నారు. ఒక ఆర్ అండ్ బి (రిథమ్ అండ్ బ్లూస్) ఆల్బమ్‌ను కూడా విడుదల చేసే పనుల్లో ఉన్నారు. అన్నిటికన్నా ఆమె గురించి  చెప్పుకోవలసింది ఆమె తన చేతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్న ‘కాంకర్’ అనే అక్షరాల గురించి. కాంకర్ అంటే జయించడం.

‘దేనినైనా జయించడానికి కరికులమ్ విటే కాదు.. కరేజ్ ముఖ్యం’ అని అనన్య పనిగట్టుకుని ఏమీ చెప్పరు కానీ, అమె తన కంపెనీ కోసం ఎంపిక చేసుకునే అభ్యర్థులలో కరేజ్ కాస్త ఎక్కువ పాళ్లలోనే కనిపిస్తుంటుంది. అనన్య ఇప్పుడు మరో స్టార్టప్‌కు రెడీ అవుతున్నారు. అనన్య తర్వాతి వెంచర్.. అపురూపమైన ఆర్ట్‌వర్క్‌ని ఆన్‌లైన్‌లో అమ్మడం. ఇలా ఆమె ఎంతవరకు వెళతారు? అనుకున్నది సాధించేవరకు. లక్ష్య సాధనలో అనన్యకు స్ఫూర్తి.. అమె తల్లి ఎప్పుడూ అంటుండే మాట.. ‘రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే’.

తాజ్  తన ఫ్యావరెట్
అనన్య ఇష్టాలు కూడా ఆమెలా భిన్నంగా, కళాత్మకంగా ఉంటాయి. ఆమె ఎక్కువగా బ్లూ డెనిమ్స్, గ్రే షర్ట్‌తో ప్రత్యక్షం అవుతారు. రాగిరంగు పాయలతో మిక్స్ అయిన జలపాతం లాంటి జుట్టు కూడా ఆమెకొక ప్రత్యేకతను ఇస్తుంటుంది. ఇక  వీలైనంత వరకు ముంబైలో ఆమె ‘తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్’కు మాత్రమే వెళతారు. ముఖ్యంగా 22వ అంతస్థులో ఉండే రూఫ్‌టాప్ రెస్టారెంట్ ‘సౌక్’ ను అమె ఎంచుకుంటారు. అక్కడి నుంచి అరేబియా సముద్రపుటలలు, గేట్‌వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంటాయి.

ఆహారం.. సంగీతం.. అవిశ్రాంతం
లంచ్‌కి కూర్చుంటే ఈ స్టార్టప్ కంపెనీ ఓనరమ్మ స్టార్టర్‌గా వెజిటేరియన్ సలాడ్ ‘టబోలా’ తెప్పించుకుంటారు. ప్రధాన భోజనంగా ఫెలాఫోల్ హూమస్ (మసాలా దట్టించి వేయించిన సెనగగుళ్ల వేపుడు) ఆమెకు ఇష్టమైన డిష్. దానికి వర్జిన్ మోజిటో (నిమ్మరసం)ను లంచ్‌కు కొనసాగింపుగా సేవిస్తారు. ఇష్టమైన ఆహారం.. ఇష్టమైన సంగీతం.. ఇష్టమైన పని.. ఈ మూడూ ఉంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు అనన్య. మన లైఫే కాదు, మన ఇష్టాల వల్ల మన చుట్టుపక్కల వాళ్ల జీవితం కూడా అందంగా మారుతుందని బిర్లా వంశంలోని ఈ నాలుగవ తరం అమ్మాయి నమ్ముతున్నారు. 

విహరించే పక్షి అనన్య
రిచర్డ్ బాక్ రాసిన ‘జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్’ నవల అనన్యను ఓ పక్షిలా మార్చింది. ‘‘జీవితం ఒక ఉల్లాసకరమైన ప్రయాణం. వ్యక్తుల్ని చూసి, ప్రాంతాలను చూసి నేర్చుకోవడం నేను పరిపూర్ణంగా మారేందుకు తోడ్పడుతుంది’’అంటారు అనన్య. జెఫ్రీ ఆర్చర్ మొదటి నవల ‘నాట్ ఎ పెన్నీ మోర్, నాట్ ఎ పెన్నీ లెస్’ అనన్య అభిమాన రచనల్లో ఒకటి. ఆస్టెరిక్స్ ఒబెలిక్స్ కామిక్స్ కూడా ఆమెను పడీపడీ నవ్వేలా చేస్తాయి. ప్రస్తుతం అనన్య గ్రీకు పురాణాలను చదువుతున్నారు.

పోస్ట్ గ్యాడ్యుయేషన్ అయ్యాక అక్కడితో నేర్చుకోవడం ఆపేశారు అనన్య. ప్రాక్టికల్స్‌లోకి వచ్చేశారు. అంటే నేర్చుకున్న దానిని ప్రాక్టీస్‌లో పెట్టడం కాదు. ప్రాక్టికల్‌గా నేర్చుకోవడం. రెండు మూడు డిగ్రీలు అదనంగా చేయడం కన్నా బయటి ప్రపంచంలోకి వచ్చి నేర్చుకుంటూ, నలుగురికి నేర్పించడం వల్ల ఒక కొత్త ప్రపంచానికి భిన్నమైన నాయకత్వాలు లభిస్తాయని అనన్య ఉద్దేశం. ఇంత చిన్న వయసులో ఇంత క్లారిటీ ఏమిటి? అది వాళ్ల నాన్నగారి నుంచి వచ్చింది. ‘‘నేను అదృష్టవంతురాలైన కూతుర్ని. అయితే ఆ అదృష్టం నా స్వయంకృషిని ఓ నీడలా ఉంచడాన్ని మాత్రం అంగీకరించలేను’ అంటారు అనన్య.        

మాట వినే పిల్ల కాదు
ఓసారి కుమార్ మంగళంని ఎవరో అడిగారు. ఈ వ్యాపారదక్షణ పుట్టుకతో వస్తుందా, కష్టపడితే వస్తుందా అని. పుట్టుకతో 10 పర్సెంట్. బుద్ది పుట్టడంతో 90 వస్తుంది అన్నారు మంగళం. ఆయన ఉద్దేశం.. జన్యువుల్లో పిసరంత ఉంటే.. మిగతాదంతా నేర్చుకుంటే వస్తుందని. ఆ సందర్భంలోనే ఆయన ఓ ఉదాహరణ చెప్పారు.

‘‘నా కూతుర్నే చూడండి. మాట వినదు. తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటుంది. వారసత్వంలోని స్పార్క్ పదిశాతం అయితే, తక్కిన 90 శాతం స్కిల్స్ అన్నీ తను డెవలప్ చేసుకున్నవే. హోటల్ నుంచి బయటికి వస్తామా.. నేను, నా భార్య, కొడుకు, చిన్న కూతురు పార్కింగ్‌లోంచి కారు బయటికి రావడం కోసం ఎదురుచూస్తూ ఉంటాం. అప్పుడు అనన్య మా దగ్గర ఉండదు. పార్కింగ్ ప్లేస్ నుంచి కారు త్వరగా బయటికి రావడం కోసం లైన్ క్లియర్ చేస్తూ కనిపిస్తుంది. అదే ఆమెలోని టెన్ పర్సెంట్ స్పార్క్’ అని చెప్తారు కుమార్. 

స్కై.. నా చిన్న చెల్లి
పేరు :    అనన్య (పూర్తి పేరు అనన్యశ్రీ)
జన్మదినం :    జనవరి 1
వయసు :    22
తల్లిదండ్రులు :    కుమార్ మంగళం బిర్లా, నీరజ
తోబుట్టువులు :    తమ్ముడు ఆర్యమన్ విక్రమ్ (19) చెల్లి అద్వైతేశ (13)
కంపెనీ :     స్వతంత్ర మైక్రోఫైనాన్స్
స్థాపన  :     2013 మార్చి 1 
కారు    :     బిఎండబ్ల్యు జడ్4 (75 లక్షలు)
పెట్     :     స్కై (నా చిన్నచెల్లి అని చెప్తారు అనన్య)

అనన్య కోట్స్
* డబ్బు అవసరమే కానీ ముఖ్యం కాదు.
* సద్వినియోగం కాని డబ్బు సంతోషాన్ని, మనశ్శాంతిని హరిస్తుంది.
* అందరూ మనలా ఉండరు. కాంప్రమైజ్ అయితే మనం మనలా ఉండం.
* ఎదురు దెబ్బలు తగిలితేనే  జీవితంలో పరిణతి వస్తుంది.



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Visit::page::https://www.facebook.com/freshdeals365 Join::Group::https://www.facebook.com/groups/freshdeals365 Fallow::https://www.twitter.com/freshdeals365

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu