-->

లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి..!!

April 08, 2016

అష్టరుచుల సమ్మేళనం....!!




► రేపటి నుంచి ఐపీఎల్ పండగ
► నేడు ప్రారంభోత్సవ వేడుకలు
► మే 29న ఫైనల్
ట్వంటీ 20 క్రికెట్‌లో చేజారిందనుకున్న మ్యాచ్‌లో ఆఖరి క్షణాల్లో విజయం నడిచి వస్తే అది తీపి... అంతా బాగుందనిపించినా అర క్షణంలో చిన్న  తప్పుతో మ్యాచ్ చేజారిపోతే అది చేదు...  టి 20 అంటే ఎన్నో రుచులు... మ్యాచ్ సాగుతున్నప్పుడు  కొన్ని సార్లు పుల్లగా, ఉప్పగా కూడా కనిపిస్తే...  మరికొన్ని కీలక క్షణాల్లో, ఉత్కంఠపోరులో  ఆట కారంగా, వగరుగా కూడా అనిపించేస్తుంది...  ప్రతీ ఏటా వచ్చే పండగే అయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ మళ్లీ పాత జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. కొత్త కొత్త ఆలోచనలతో కొత్తగా చూడమని కోరుతుంది. పూతకొచ్చిన కొత్త మామిడిలా... ఆహా అనిపించే ఆవకాయలా వినోదపు మజాను అందిస్తుంది. మన ఉగాదికి ఆరు రుచులు ఉంటే ఎనిమిది జట్లతో  ఐపీఎల్ అష్ట రుచులను అందిస్తుంది. ఇక ఈ మండే ఎండల్లో మరోసారి వేసవి పండగకు సిద్ధం కావడమే.

 ఉగాది అంటే కొత్త సంవత్సరం... పండగ సంబరం, పచ్చడి రుచి, ఆదాయ వ్యయాల గణనం, పంచాంగ శ్రవణం... ఇక ఐపీఎల్‌లో ఉగాది మాత్రం అంతా అంకెలు, పరుగులే... అక్కడా ఆదాయ, వ్యయాలు, లాభం, అవమానాలు... ఇలా చాలా ఉంటాయి. దాదాపు ఏడు వారాల పాటు ఎనిమిది జట్లు హోరాహోరీగా పోరాడే ఐపీఎల్‌లో టైటిల్ ఒక్కటే అందరి లక్ష్యం. ఆ కప్‌ను అందుకోవాలని ప్రతి కెప్టెన్ తహతహలాడుతుంటాడు. మరి కప్ ఏమనుకుంటుంది..? ఆయా జట్లకు ట్రోఫీయే పంచాంగం చెబితే ఎలా ఉంటుందంటే...


కింగ్స్ ఎలెవన్ పంజాబ్              
ఆదాయం: మిల్లర్, మ్యాక్స్‌వెల్
వ్యయం:   జట్టులో సగంకంటే ఎక్కువ మందికి కనీస అనుభవం లేదు. భారత రెగ్యులర్ జట్టులోని ఆటగాడు లేడు.
యజమాని:   నెస్ వాడియా, ప్రీతీ జింటా, కరణ్ పాల్
ఉత్తమ ప్రదర్శన:  2014 రన్నరప్
కెప్టెన్: డేవిడ్ మిల్లర్
కోచ్ :   సంజయ్ బంగర్
2014లో అద్భుతంగా ఆడి ఫైనల్లోకి చేరిన మీ జట్టు తర్వాతి ఏడాదే చివరి స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. అందుకే కావచ్చు దాదాపు మొత్తం టీమ్‌ను మార్చి పడేశారు. అయినా సరే స్టార్ పవర్ లేదు. మ్యాక్స్‌వెల్ ఎలా ఆడతాడో ఎప్పుడూ సందేహమే. ఏదైనా ఒకటి, రెండు అనూహ్య ఫలితాలు రావచ్చేమో గానీ మీపై పెద్దగా నమ్మకం లేదు.


సన్‌రైజర్స్ హైదరాబాద్
ఆదాయం: వార్నర్, ధావన్, విలియమ్సన్, నెహ్రా
వ్యయం: యువరాజ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరం.
కెప్టెన్: డేవిడ్ వార్నర్
కోచ్: టామ్ మూడీ
యజమాని: కళానిధి మారన్
ఉత్తమ ప్రదర్శన: ప్లే ఆఫ్ (2013)
లెఫ్ట్ హ్యండ్ ఆటగాళ్లతోనే మీ తుది జట్టును నింపేయవచ్చేమో అనిపిస్తుంది. ఈ సారి కూడా మంచి బౌలర్లను తీసుకున్నారు గానీ ఎప్పటిలాగే ఒకరిద్దరు తప్ప విధ్వంసకర బ్యాట్స్‌మెన్ లేరు. మంచి బౌలింగ్ చేయడం, బ్యాటింగ్‌లో విఫలమయ్యే సాంప్రదాయాన్ని ఆపేయండి. జట్టు ఎలా ఉన్నా మీరు గెలవాలని హైదరాబాదీలు బలంగా కోరుకుంటున్నారు.

ముంబై ఇండియన్స్
ఆదాయం: రోహిత్ శర్మ, పొలార్డ్, బుమ్రా, సిమన్స్, భారీ కోచింగ్ బృందం
వ్యయం: ప్రధాన పేసర్ మలింగకు గాయాలు, ఫామ్‌లో లేని హర్భజన్ సింగ్.
కెప్టెన్: రోహిత్ శర్మ
కోచ్: రికీ పాంటింగ్
యజమాని: ముకేశ్ అంబానీ
ఉత్తమ ప్రదర్శన: 2013, 15లో విజేత
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నారు. ప్రపంచకప్‌లో ఆకట్టుకోని రోహిత్ శర్మ ఇక్కడ చెలరేగాలి. అదే విధంగా ఎలాగూ భారత జట్టులోకి వచ్చేసామని అతి ధీమా ప్రదర్శించకుండా కుర్ర బుమ్రా, హార్దిక్ పాండ్యా మరింత మెరుగ్గా ఆడాలి. ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌పై ఆడిన తరహాలో ఆ సిమ్మన్స్‌ను సీజన్ అంతా ఆడమనండి. మరోసారి మీ యాజమాన్యాన్ని విజయంతో మెప్పిస్తే, ఇక మీకు ఏడాదంతా పండగే.


రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్
కెప్టెన్: ఎంఎస్ ధోని
కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్
యజమాని: సంజీవ్ గోయెంకా
ఉత్తమ ప్రదర్శన: ఇదే తొలి లీగ్
ఆదాయం: ధోని, స్మిత్, రహానే, అశ్విన్
వ్యయం: ఇటీవలి కాలంలో ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. టి20 స్పెషలిస్ట్ పేసర్ ఎవరూ లేరు.
మీ జట్టును చూస్తే అంతా కెప్టెన్ ధోనియే అనిపిస్తోంది.  కొత్తగా చేరిన ఆటగాళ్లు ఉన్నా సమర్థంగా నడిపించగల అతని నాయకత్వమే గెలిపించగలదు. పీటర్సన్‌లాంటి ఆటగాడిని జట్టుకు పనికొచ్చేలా చేసుకోవాలి. అన్నట్లు మిషెల్ మార్ష్‌ను తీసుకొని మంచి పని చేశారు. వరల్డ్ కప్ గురించి మరచిపోయి అశ్విన్ బాగా ఆడితే మంచిది. చూస్తే చెన్నై బృందమే కనిపిస్తోంది కాబట్టి ఆ జట్టులాగా ముందుకు వెళ్లగలరని నమ్మకముంది.


గుజరాత్ లయన్స్
కెప్టెన్: సురేశ్ రైనా
కోచ్: బ్రాడ్ హాడ్జ్
యజమాని: కేశవ్ బన్సాల్ (ఇంటెక్స్ టెక్నాలజీస్)
ఉత్తమ ప్రదర్శన: ఇదే తొలి లీగ్
ఆదాయం: బ్రేవో, మెకల్లమ్, జడేజా.
వ్యయం: రైనాకు కెప్టెన్‌గా చెప్పుకోదగ్గ అనుభవం లేదు.
ఐపీఎల్ వేలం ముగియగానే మీ ఒక్క జట్టే అన్నీ సరిపోయే విధంగా కొలతలు వేసినట్లు సరిగ్గా ఆటగాళ్లను ఎంచుకుంది అనే మాట వినిపించింది. ఇప్పుడు మైదానంలో చూపించాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ యజమానిని చూస్తే మీలో చాలా మందికంటే కుర్రాడిగా, ఉత్సాహంగా ఉన్నాడు. బాగా ఆడి అతని ఆశలు నిలబెట్టండి. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మాకు జట్టు లేదని బాధపడిన గుజరాతీలు మీ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. సమష్టిగా ఆడితే ప్లే ఆఫ్ ఖాయమని మా పంచాంగం చెబుతోంది.


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
కెప్టెన్: విరాట్ కోహ్లి
కోచ్: వెటోరి
యజమాని: విజయ్ మాల్యా
ఉత్తమ ప్రదర్శన: 2009, 11ల్లో రన్నరప్
ఆదాయం: కోహ్లి, గేల్, డివిలియర్స్, వాట్సన్
వ్యయం: గాయంతో స్టార్క్ దూరం. స్టార్లను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లు అంతంత మాత్రమే.
ఐపీఎల్ మొదలైన దగ్గరినుంచి అందరికంటే ఎక్కువగా హడావిడి చేసే జట్టు మీదే అయినా... ఇప్పటి వరకు విజయానందం మాత్రం దరి చేరలేదు. ఉన్న ముగ్గురు భారీ హిట్టర్లకు తోడు ఇప్పుడు వాట్సన్ కూడా వచ్చాడు. మరి అతడిని సరైన రీతిలో మీరు వాడుకోవాలి. అన్నట్లు మీ యజమాని మాల్యా ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు. తొమ్మిదో ప్రయత్నంలోనైనా టైటిల్ సాధిస్తే ఆయనకు ఆనందం కలిగించినవారవుతారు. కోహ్లి ఇప్పుడున్న ఫామ్‌లో జట్టును గెలిపిస్తాడని అనిపిస్తోంది.



కోల్‌కతా నైట్ రైడర్స్
కెప్టెన్: గౌతం గంభీర్
కోచ్: ట్రెవర్ బేలిస్
యజమాని: షారుక్ ఖాన్, జూహీచావ్లా
ఉత్తమ ప్రదర్శన: 2012, 14 విజేత
ఆదాయం: మనీశ్ పాండే, రసెల్, షకీబ్, మున్రో
వ్యయం: చెప్పుకోదగ్గ భారత ఆటగాళ్లు లేరు. దేశవాళీ కుర్రాళ్లనుంచి పెద్దగా ఆశించలేం.
రెండేళ్ల క్రితం గెలిపించారు కాబట్టి అదే ఆటగాళ్లను కొనసాగిస్తున్నారు. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంలో అతి జాగ్రత్తకు పోయినట్లు కనిపిస్తున్నారు. గంభీర్ ఏడాది మొత్తం ఆడకుండా ఐపీఎల్‌లో ఏం చేస్తాడో చూడాలి. రసెల్‌ను తప్పిస్తే ఒంటి చేత్తో గెలిపించగల విదేశీ ఆటగాళ్లు లేరు. ఎప్పుడో కళ తప్పిన యూసుఫ్ పఠాన్, ఉతప్పలతో మీ జట్టు ఏం సాధిస్తుందనేది సందేహమే.


ఢిల్లీ డేర్ డెవిల్స్
కెప్టెన్: జహీర్ ఖాన్
కోచ్: ప్యాడీ ఆప్టన్
యజమాని: జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రై.లిమిటెడ్
ఉత్తమ ప్రదర్శన: ప్లే ఆఫ్ (2012), సెమీస్ (2008, 09)
ఆదాయం: బ్రాత్‌వైట్, షమీ, అయ్యర్, మోరిస్, తాహిర్
వ్యయం: చాలా కాలంగా క్రికెట్ మానేసి కామెంటరీ చేస్తున్న జహీర్‌ఖాన్‌ను కెప్టెన్‌ను చేయడం ఆశ్చర్యకరం. ఫిట్‌గా లేకపోతే 10 మందితో ఆడినట్లే.

గత మూడేళ్లుగా చివరి స్థానాల్లో నిలుస్తున్న మీ ఆటను చూసి ఇక ఇంతే అనుకున్నాం. కానీ ఎందుకో కుర్రాళ్లతో కూడిన, సరిగ్గా టి20 ఫార్మాట్‌కు సరిపోయే ఆటగాళ్లను చూస్తే ఈ సారి మీ జట్టుగా చాలా బాగా ఆడవచ్చని నమ్మకం కుదురుతోంది. ఇక ద్రవిడ్ మార్గనిర్దేశనం ఎలాగూ ఉంది కాబట్టి దానిని వాడుకుంటే డేర్ డెవిల్స్ పేరుకు తగినట్లుగా కాస్త దూకుడు చూపించవచ్చు.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

About the Author

Unknown

Author & Editor

No.1 Online Local Advertising services, Online marketing, Social media marketing, Travel services, Jobs, News, Online shopings..!!!

Post a Comment

మీకు ఈ వెబ్సైటు ఉపయోగపడుతుందా..?

 
All In One Store © 2015 - Designed by K. Mahesh Babu