నందమూరి వారసులకు పంగనామమే!
♦ మంత్రి పదవి కావాలంటున్న నందమూరి బాలకృష్ణ
♦ ఆయనకు పదవి ఇచ్చేందుకు ఇష్టపడని చంద్రబాబు
♦ లోకేష్ పేరు తెరపైకి తేవడం ద్వారా వియ్యంకుడికి మొండిచేయి
♦ రాజ్యసభకు ప్రయత్నిస్తున్న నందమూరి హరికృష్ణ
♦ ఇప్పటివరకూ స్పష్టమైన హామీ ఇవ్వని టీడీపీ అధినేత
♦ బాలకృష్ణను రాజ్యసభకు పంపడం ద్వారా బావమరిదికి చెక్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వారసులకు పదవులివ్వకుండా పంగనామం పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమారుడు, తన వియ్యంకుడు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వకుండా చెక్ పెట్టేందుకు తన కుమారుడు, బాలకృష్ణ అల్లుడైన లోకేష్ పేరును తెరపైకి తెచ్చారు. తనకు నచ్చనివారిని తప్పించేందుకు అస్మదీయ పత్రికల్లో వార్తలు రాయించడం, నచ్చినవారికి పదవి కట్టబెట్టాలనుకున్నప్పుడు పార్టీ నేతలతో డిమాండ్ చేయించడం చంద్రబాబుకు బాగా తెలిసిన విద్య. ఇప్పుడు అదే విద్యను ప్రదర్శిస్తూ.. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ నేతలతో మాట్లాడిస్తున్నారు. అదే సమయంలో బాలకృష్ణను రాజ్యసభకు పంపించడం ద్వారా ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించుకోవడంతోపాటు హరికృష్ణ డిమాండ్‌ను కూడా తప్పించుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
మరో అధికార కేంద్రానికి బాబు నో!
బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం పరిధిలోని పర్యాటక కేంద్రం లేపాక్షి ఉత్సవాలను ఫిబ్రవరి నెలాఖరులో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తనకు పర్యాటక శాఖ కేటాయిస్తే మరింత న్యాయం చేస్తానని కొద్ది రోజుల క్రితం ముగిసిన అసెంబ్లీ సమావేశాల సమయంలో సన్నిహిత ఎమ్మెల్యేలతో చెప్పారు. ఇదే విషయాన్ని తన వియ్యంకుడు చంద్రబాబు వద్ద ప్రస్తావించినా ఎలాంటి స్పష్టమైన హామీని ఇవ్వకపోగా... ‘ఇప్పట్లో మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల ఆలోచన లేదు, ఒకవేళ ఉంటే అపుడు ఆలోచిద్దా’మని దాట వేశారని తెలిసింది. బాలకృష్ణ తన రాజకీయ వారసుడని ఎన్టీఆర్ 1980ల్లోనే ప్రకటించారు.
ఇప్పుడు కూడా బాలకృష్ణతో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన ఓ అధికార కేంద్రంగా తయారవుతారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తన కుమారుడు లోకేష్‌కు మంత్రి పదవి కట్టబెట్టాలని అధినేత భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల సమాచారం. లోకేష్‌ను హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించి, ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న నందమూరి బాలకృష్ణను రాజ్యసభకు పంపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా హరికృష్ణకు రాజ్యసభ అవకాశం ఇవ్వకుండా, మంత్రివర్గంలో వియ్యంకుడికి అవకాశం కల్పించకుండా తప్పించుకోవచ్చని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లు అవుతోందని చంద్రబాబు భావిస్తున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. ఆ వ్యూహంలో భాగంగానే లోకేష్ కోసం తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను త్యాగం చేస్తామని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చెప్పిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.
రాజ్యసభపై యనమల కన్ను..
మరోవైపు రాజ్యసభ సభ్యత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కన్నేశారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన రె ండో స్థానంలో ఉన్నా పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా సొంత జిల్లాలో వైఎస్సార్‌సీపీ నుంచి నేతలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవటం ఆయనకు రుచించటం లేదు. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి ఇచ్చేట్లయితే రాజ్యసభకు వెళ్లాలని యనమల యోచిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పి. అశోక్ గజపతిరాజు, వై. సుజనా చౌదరిలకు ప్రాతినిధ్యం ఉంది. అశోక్ కేబినెట్, సుజనా సహాయ మంత్రి హోదాలో ఉన్నారు. దీంతో మరో కేబినెట్ పదవి రాష్ట్రానికి దక్కే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో స్వతంత్ర హోదాలో కీలకమైన శాఖ ఇస్తే రాజ్యసభకు వెళ్లేందుకు యనమల సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment