ఐపీఎల్‌లో మిగిలిన చాలా జట్లతో పోలిస్తే హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు అభిమానుల సంఖ్య తక్కువ. చెన్నై, ముంబైలాంటి జట్లతో పోలిస్తే హైదరాబాద్ కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారి సంఖ్యా తక్కువే. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి... స్టేడియానికి అభిమానులను భారీగా రప్పించే భారత స్టార్ క్రికెటర్ లేకపోవడం. రెండు... ఆట పరంగా అద్భుతాలు చేయకపోవడం. ఈసారి సీజన్‌లో యువరాజ్ సింగ్‌ను తీసుకోవడం వల్ల తొలి సమస్యను దాదాపుగా అధిగమించారు. మరి మైదానంలో ఏం చేస్తారనేదే అసలు ప్రశ్న.
రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులకూ కలిపి హైదరాబాద్ సన్‌రైజర్స్ ఒకటే ఐపీఎల్ జట్టు. కాబట్టి అభిమానుల సంఖ్య భారీగా ఉండాలి. కానీ కచ్చితంగా మా జట్టే గెలవాలని కోరుకునేలా... విధేయంగా ఉండే అభిమానుల సంఖ్య మాత్రం ఆ స్థాయిలో లేదు. 2013లో ఈ జట్టు లీగ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఇప్పటివరకూ స్టేడియానికి ఫ్యాన్స్‌ను రప్పించే స్టార్ లేకపోవడం లోటు. ఎంతమంది విదేశీ స్టార్స్ ఉన్నా.. కచ్చితంగా భారత జట్టులోని స్టార్ క్రికెటర్ ఉంటేనే అభిమానులు చూస్తారు. శిఖర్ ధావన్ రూపంలో భారత ఓపెనర్ జట్టులో ఉన్నా... మైదానానికి జనాలను రప్పించే స్థాయి అతనికి లేదనేది వాస్తవం. ధోని, కోహ్లి, గేల్, సెహ్వాగ్, డివిలియర్స్ లాంటి వారి స్థాయిలో కాకపోయినా ఒక పెద్ద క్రికెటర్ జట్టులో ఉండాల్సింది.
ఈ లోటును ఈ ఏడాది సన్‌రైజర్స్ కొంతవరకు పూడ్చుకుంది. యువరాజ్ సింగ్‌ను తీసుకోవడం ద్వారా అభిమానులకు చేరువయ్యే అవకాశం లభించింది. కాబట్టి ఒక పెద్ద సమస్య తీరింది. స్థానిక ఆటగాళ్లకు పెద్దగా తుది జట్టులో అవకాశాలు ఇవ్వకపోవడం కూడా ఈ జట్టు మీద ఉన్న పెద్ద ఫిర్యాదు.
ప్రదర్శన అంతంత మాత్రం
2008లో ఐపీఎల్ మొదలైన తొలి ఏడాదే హేమాహేమీల్లాంటి ఆటగాళ్లతో డెక్కన్ చార్జర్స్ జట్టు ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన ఈ జట్టు2009లో విజేతగా నిలిచినా ఆ తర్వాత చాలా పేలవ ప్రదర్శనతో లీగ్‌లో కొనసాగింది. 2012 తర్వాత డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో సన్‌రైజర్స్ వచ్చింది. 2013లో తొలి ఏడాది ప్లే ఆఫ్ దశకు వెళ్లింది. దీంతో ఫర్వాలేదనిపించినా... వరుసగా రెండేళ్ల పాటు ఎనిమిది జట్ల లీగ్‌లో ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.
వైవిధ్యమైన ఎంపిక
మిగిలిన జట్లతో పోలిస్తే ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ఆటగాళ్లను ఎంచుకునే విధానం చాలా వైవిధ్యంగా ఉంటుంది. స్టెయిన్‌లాంటి స్టార్ బౌలర్ జట్టులో ఉన్నా బౌల్ట్ (న్యూజిలాండ్)ను భారీ మొత్తం ఇచ్చి గత ఏడాది తీసుకొచ్చారు. అలాగే అవసరాన్ని మించి ఫాస్ట్ బౌలర్లతో జట్టును నింపారు. గత ఏడాదినే ఉదాహరణగా తీసుకుంటే... భువనేశ్వర్, ఇషాంత్, ప్రవీణ్ కుమార్, బౌల్ట్, స్టెయిన్, ఇర్ఫాన్ పఠాన్, ప్రశాంత్‌ల రూపంలో ఏడుగురు పేసర్లపై డబ్బులు వెచ్చించారు. టి20 క్రికెట్‌లో భారత పిచ్‌లపై తుది జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లు ఉంటే చాలు. కానీ ఇంత మందికి ఎందుకు డబ్బు పెట్టారో తెలియని పరిస్థితి. వేలంలోనే నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఆటగాళ్లను తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈసారి కూడా...
ఈసారి ఐపీఎల్ వేలానికి ముందు స్టెయిన్, ఇర్ఫాన్‌లను జట్టు వదిలేసింది. వేలంలో మంచి బ్యాట్స్‌మెన్ కోసం చూస్తారనుకుంటే ఈసారి ఆశ్చర్యకరంగా ఎడమచేతి వాటం పేసర్ల మీద డబ్బు ఖర్చు చేశారు. ఇప్పటికే జట్టులో బౌల్ట్ ఎడమచేతి వాటం పేసర్. ఈసారి కొత్తగా ఆశిష్ నెహ్రా, ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్), బరిందర్ శరణ్‌లను తెచ్చారు. నలుగురు ఎడమచేతి వాటం బౌలర్లు జట్టులో ఎందుకున్నారో తెలియదు. అన్నట్లు బ్యాటింగ్‌లోనూ ఎడమచేతి వాటం స్టార్సే ఎక్కువ. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్, ఇయాన్ మోర్గాన్‌లతో పాటు జట్టులో కచ్చితంగా ఉండే ఆల్‌రౌండర్ కరణ్ శర్మ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే.
కూర్పు ఎలా ఉందంటే...
యువరాజ్, ధావన్ జట్టులో ఉన్నా.. దేశవాళీ బ్యాట్స్‌మెన్ విషయంలో ఇంకా కొంత లోటు కనిపిస్తోంది. రికీ భుయ్, తిరుమలశెట్టి సుమన్ మాత్రమే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. వార్నర్, మోర్గాన్, విలియమ్సన్ రూపంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో వార్నర్ కెప్టెన్ కాబట్టి కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. విలియమ్సన్ కూడా ఆడే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లు ఏడుగురు ఉన్నారు. ఇందులో హెన్రిక్స్, బెన్ కటింగ్ విదేశీ క్రికెటర్లు. ఈ ఇద్దరిలో ఒకరు తుది జట్టులోకి రావచ్చు. దీపక్ హుడా, కరణ్ శర్మ దాదాపుగా తుది జట్టులో ఉంటారు. ఆశిష్ రెడ్డి, బిపుల్ శర్మ, విజయ్ శంకర్‌లకు అవకాశం కొద్దిగా కష్టమే.
ఇక బౌలర్లలో ఏడుగురూ పేస్ బౌలర్లే. బౌల్ట్, ముస్తాఫిజుర్‌లలో ఒకరు... నెహ్రా, భువనేశ్వర్ ఇద్దరూ దాదాపు అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం ఉంది. దేశవాళీ బ్యాట్స్‌మెన్ సంఖ్య ఎక్కువగా ఉన్న జట్లు ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాయి. ఈ విషయంలో సన్‌రైజర్స్ ఇంకా మెరుగుపడలేదు. గత ఏడాది జట్టు ప్రధానంగా వార్నర్ మీద ఆధారపడి సాగింది. ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. తనతో పాటు కనీసం మరో ఇద్దరైనా సీజన్ అంతా నిలకడగా ఆడితే అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చు. మిగిలిన జట్లతో పోలిస్తే హైదరాబాద్ తుది జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తున్నా... ఏదైనా అద్భుతం జరిగి సన్ ‘రైజ్’ కావాలని ఆశిద్దాం.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.
Post a Comment