బ్యాంకు డిఫాల్టర్లపై మోదీ
♦ అది ప్రజల సొమ్ము..ప్రతి పైసా వసూలు చేస్తాం
♦ దళారులను అడ్డుకున్నందుకే విషప్రచారం
రంగపార/ఖరగ్‌పూర్: బ్యాంకులను మోసం చేసి భారీ రుణాలు ఎగ్గొట్టాలనుకునేవారి ఆటలు ఇకపై చెల్లవని.. ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. విజయ్ మాల్యా పారిపోయేందుకు ఎన్డీయే ప్రభుత్వమే కారణమన్న విమర్శలపై మోదీ మండిపడ్డారు. ఆదివారం అస్సాంలోని రంగపారలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ధనికులు దోచుకునేందుకు వీలుగా బ్యాంకుల తలుపులు తెరిచిందని.. తన ప్రభుత్వం ఎక్కడికక్కడ నిబంధనలు కఠినతరం చేయటంతో.. తప్పుచేసిన వారంతా జైలుకెళ్తామన్న భయంతోనే పారిపోతున్నారని మోదీ తెలిపారు.
ధనికుల ఖజానా నింపేలా వ్యవహరించిన కాంగ్రెస్ కూడా దీని ప్రతిఫలం అనుభవించక తప్పదన్నారు. ‘ప్రజాధనాన్ని కొందరు ధనవంతులు కొల్లగొట్టారనే విషయం మీకు తెలుసు. బ్యాంకులనుంచి భారీగా రుణాలు తీసుకున్నారు. అలాంటి డీఫాల్టర్ల చుట్టూ ఉచ్చుబిగించాం. జైలు పాలవుతామనే భయంతో వారు చెమటలు కక్కుతున్నారు. ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదు. వారు లూటీ చేసింది ప్రజల సొమ్ము. ఆ ప్రతి ఒక్క పైసాను ప్రజలవద్దకు చేర్చటమే మా లక్ష్యం’ అని అన్నారు. ‘గతంలో ప్రభుత్వాలను దళారులే నడిపేవారు. నేను వచ్చాక వీరి ఆటలు సాగటం లేదు. అందుకే విష ప్రచారం చేస్తున్నారు’ అని మోదీ అన్నారు.
బెంగాల్‌లో బాంబుల తయారీ పరిశ్రమే
పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ.. నేరుగా తృణమూల్, సీపీఎం-కాంగ్రెస్‌లపై ఎదురుదాడి చేశారు. ఐదేళ్లుగా బెంగాల్‌కు కొత్త పరిశ్రమలేవీ రాలేదని.. నడుస్తున్నవల్లా బాంబుల తయారీ పరిశ్రమలేనని అన్నారు. శారదా (స్కాం) నుంచి నారద (ఇటీవలి స్టింగ్ ఆపరేషన్) వరకు బెంగాల్‌లో అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు.
మోదీ మంచి నటుడు: గొగోయ్
మోదీ చాలా బాగా నటిస్తారని, ఆయన నటన చూసేందుకు ప్రజలు ఇష్టపడతారని అస్సాం సీఎం తరుణ్ గొగోయ్ ఎద్దేవా చేశారు. అయితే మోదీ మాటలను అస్సామీలు నమ్మరని ఓ ఎన్నికల సభలో అన్నారు. మోదీ ప్రభుత్వం పేదలకు ఏమీ చేయదని.. రోహిత్ వేముల, కన్హయ్య వంటి పేదలను వేధించటమే వీరి పనని విమర్శించారు.
5 లక్షల నీటికుంటలు
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి
♦ భూగర్భ జలాలు పడిపోవడంపై ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు భారీగా అడుగంటిపోతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నీటి సమస్యను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ఐదు లక్షల నీటి కుంటలను నిర్మిస్తున్నామని చెప్పారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందా నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. నీటి సంరక్షణకు ప్రజలు కూడా పాటుపడాలని, చిన్నరిజర్వాయర్ల ఏర్పాటు వంటి నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు. రైతాంగం తక్కువ మోతాదులో ఎరువులు వాడాలని, ఫార్మర్స్ యాప్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు.
ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’లో (నెలవారీ రేడియో కార్యక్రమం) నీటి సంరక్షణ ఆవశ్యకత సహా వివిధ అంశాలపై మోదీ తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. ఆదివారం ఈస్టర్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది అండర్-17 ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు అతిథ్యమివ్వడం ద్వారా భారత్ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ క్రీడకు దేశ యువత అంతా బ్రాండ్ అంబాసిడర్లు కావాలన్నారు. గ్రామ స్థాయిలోనూ ఫుట్‌బాల్‌పట్ల ఆసక్తి పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులంతా సెలవుల్లో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవాలని సూచించారు. దేశంలో టీబీని అరికట్టేందుకు ప్రజలంతా కృషి చేయాలన్నారు. దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని (ఏప్రిల్ 14న) ఆయనకు సంబంధించిన ఐదు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment