♦ సుప్రీం కోర్టుకు తెలిపిన ప్రభుత్వం
♦ నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా వ్యవహారం రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది. ఓవైపు మాల్యా కంపెనీకిచ్చిన రుణాలు రాబట్టుకోవడానికి బ్యాంకులు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే.. మరోవైపు ఆయన మాత్రం చడీ చప్పుడు లేకుండా చల్లగా జారుకున్నారు. వారం రోజుల క్రితమే దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. రుణాల రికవరీ చర్యల్లో భాగంగా బ్యాంకుల కన్సార్షియం వేసిన కేసును విచారణ చేస్తున్న సుప్రీం కోర్టుకు ప్రభుత్వం బుధవారం ఈ విషయాలు తెలిపింది. ‘మాల్యా మార్చి 2నే దేశం వీడి వెళ్లినట్లు నాకు సీబీఐ చెప్పింది’ అంటూ.. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్‌తో కూడిన బెంచ్‌కు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వివరించారు. బహుశా ఆయన ఇంగ్లండ్ వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు. దీంతో కన్సార్షియం వేసిన కేసులపై రెండు వారాల్లోగా స్పందించాల్సిందిగా మాల్యాకు బెంచ్ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయినందున.. అధికారిక రాజ్యసభ ఈమెయిల్ ఐడీ, లండన్‌లోని భారత హై కమిషన్ ద్వారా, వివిధ కోర్టుల్లో ఆయన తరఫు వాదిస్తున్న లాయర్ల ద్వారా మాల్యాకు నోటీసులు అందేలా చూడాలన్న అటార్నీ జనరల్ విజ్ఞప్తిని బెంచ్ మన్నించింది.
అటు మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్ల కేసులో తుది వాదనలు వినిపించేందుకు ఏప్రిల్ 24వ తేదీని ఢిల్లీ హైకోర్టు ఖరారు చేసింది. 1995లో కింగ్‌ఫిషర్ లిక్కర్ బ్రాండ్ ప్రమోషన్‌కి బెనెటన్ ఫార్ములా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో విదేశీ మారక నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈడీ సమన్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని ఆయనపై అభియోగాలున్నాయి. మరోవైపు, తమ జీతాల బకాయిలు సత్వరం వచ్చేలా ప్రభుత్వం, సుప్రీంకోర్టు చూడాలని కోరుతూ కింగ్‌ఫిషర్ ఉద్యోగులు .. ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్ వద్ద నిరసన ప్రదర్శన జరిపారు.
బ్యాంకులన్ని రుణాలెలా ఇచ్చాయ్ ..
వివిధ బ్యాంకులకు మాల్యా నుంచి దాదాపు రూ. 9,000 కోట్ల పైగా మొత్తం రావాల్సి ఉందని, కానీ ఆయన రకరకాల సాకులు చెబుతూ వాటిని తీర్చకుండా తప్పించుకు తిరిగారని రోహత్గీ న్యాయస్థానానికి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మాల్యాకు బ్యాంకులు అసలు రుణాలెలా ఇచ్చాయంటూ బెంచ్ ప్రశ్నించింది. ఇంతకీ కేసుల ద్వారా బ్యాంకులు ఏం కావాలని కోరుకుంటున్నాయో స్పష్టంగా చెప్పాలని సూచించింది. కింగ్‌ఫిషర్ బ్రాండ్‌ను, కంపెనీకి ఉన్న విమానాలు మొదలైనవి చూసి బ్యాంకులు రుణాలిచ్చినట్లు రోహత్గీ తెలిపారు. మాల్యా తీసుకున్న రుణాల కంటే అధిక విలువ చేసే స్థిర, చరాస్తులు దేశ, విదేశాల్లో ఉన్నాయని వివరించారు. మాల్యా ఆస్తులు పూర్తిగా వెల్లడి కావాలని, ఆయన స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని, మాల్యా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవడంతో పాటు డియాజియో నుంచి ఆయనకు రావాల్సిన సొమ్మును నిలుపుదల చేయాలని బ్యాంకులు న్యాయస్థానాన్ని కోరుతున్నట్లు రోహత్గీ తెలిపారు. అటు మాల్యాకు ఇవ్వాల్సిన 75 మిలియన్ డాలర్లలో ఇప్పటికే 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 275 కోట్లు) ఇచ్చేసినట్లు వస్తున్న వార్తలను డియాజియో ధ్రువీకరించింది. మిగతాది అయిదేళ్లలో విడతలవారీగా చెల్లించనున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. మార్చి 28 దాకా చెల్లింపులు ఆపాలంటూ డీఆర్‌టీ ఇచ్చిన ఆదేశాలు తమకు ఇంతవరకూ చేరలేదని వివరించింది.
వివాద నేపథ్యమిదీ..
విజయ్ మాల్యా ప్రమోటరుగా ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాలను రాబట్టుకునే దిశగా ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని బ్యాంకులు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్లు మాల్యాతో పాటు యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి కూడా. మాల్యా పాస్‌పోర్టును జప్తు చేసి అరెస్టు వారంట్ జారీ చేయాలని, యునెటైడ్ స్పిరిట్స్ నుంచి వైదొలగినందుకు గాను డియాజియో ఆయనకు చెల్లించాల్సిన 75 మిలియన్ డాలర్లు తమకు దఖలు పడేలా ఆదేశాలివ్వాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో నాలుగు దరఖాస్తులు వేశాయి బ్యాంకులు. కానీ అందులో ఒక్క అంశాన్ని డీఆర్‌టీ ముందుగా విచారణకు తీసుకోవడంతో.. అటుపైన బ్యాంకులు కర్ణాటక హైకోర్టుకెళ్లాయి. ఎక్స్‌పార్టీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి మార్చి 4న హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. కాగా.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఆర్థిక అవకతవకలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐవో) విచారణ చేపట్టగా.. ఐడీబీఐ బ్యాంకు ఇచ్చిన రూ. 900 కోట్ల రుణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ).. మనీలాండరింగ్ కేసు దాఖలు చేసింది.
ఇంతవరకూ ఎల్‌ఆర్‌లు పంపని సీబీఐ..
ఐడీబీఐ బ్యాంకు నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రుణాల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదై ఎనిమిది నెలలైనా కూడా సీబీఐ ఇంతవరకూ ఏ దేశానికీ లెటర్ ఆఫ్ రొగేటరీ (ఎల్ ఆర్) పంపలేదు. ఎల్‌ఆర్ పంపే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ఐడీబీఐ బ్యాంకు ఇచ్చిన రుణాలు ముందుగా యాక్సిస్ బ్యాంకులోకి, ఆ తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ అద్దెలు, విడిభాగాల కొనుగోళ్లు మొదలైన వాటికోసం వివిధ దేశాల్లోకి ప్రవహించాయని సీబీఐ భావిస్తోంది. దీనిపై విచారణ ముందుకు సాగేందుకు ఆయా దేశాల సహకారం కోరుతూ ఎల్‌ఆర్‌లు పంపాల్సి ఉంటుంది. గతేడాది జూలై 28నే ఇన్‌స్పెక్టర్ వర్ష వర్మ ప్రాథమిక విచారణ జరిపిన మర్నాడే దీనిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. కానీ మూణ్నెల్లకు గానీ సోదాలు జరగలేదు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.

Post a Comment