ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్... సచిన్ టెండూల్కర్. బంతిని ప్లేస్‌మెంట్ చేయడంలో అత్యుత్తమ ఆటగాడు... బ్రియాన్ లారా. ఇవన్నీ గతం. ఇప్పుడు క్రికెట్‌లో అన్ని బిరుదులూ, అన్ని ఘనతలూ విరాట్ కోహ్లి సొంతం. ఆస్ట్రేలియాపై సంచలన ఇన్నింగ్స్ తర్వాత ప్రపంచం అంతా కోహ్లిని వేనోళ్ల కొనియాడుతోంది. సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల వరకూ అందరూ విరాట్‌ను చూసి మురిసిపోతున్నారు. ఒత్తిడి లేనప్పుడు, ప్రాధాన్యత లేని మ్యాచ్‌లలో, ముందుగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చెలరేగి ఆడే వీర విధ్వంసకారులు ఎంతో మంది ఉన్నారు. కానీ నాకౌట్ మ్యాచ్‌లలో పటిష్ట ప్రత్యర్థులపై ఒత్తిడిలోనూ లక్ష్యాలను మంచినీళ్ల ప్రాయంలా ఛేదించడం కోహ్లికి మాత్రమే సాధ్యం.
అద్భుతాలు సృష్టించలేం. అవి జరిగిపోతాయంతే... ఇది సాధారణంగా అందరూ చెప్పే మాట. కానీ ఈ మాట విరాట్ కోహ్లి విషయంలో చెల్లదు. ఎందుకంటే అతను అద్భుతాలు సృష్టించడానికే పుట్టాడు. ‘ఒక్కసారి సాధ్యమైతే చాలు’ అనుకునే దానిని అతను పదే పదే చేసి చూపిస్తున్నాడు. ఒకప్పుడు స్కోరు అడిగే అభిమానులు ‘సచిన్ ఉన్నాడా’ అని అడిగేవారు. ఇప్పుడు కోహ్లి ఉన్నాడంటే అందరిలో అదే ధీమా. లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు, బౌలర్లు ఎలాంటివారైనా, రన్‌రేట్ ఎంత ఎక్కువ ఉన్నా కోహ్లికి పట్టింపులేదు.
‘మేం భారత జట్టు చేతిలో ఓడిపోలేదు. ఒక క్రికెట్ మేధావి చేతిలో పరాజయం పాలయ్యాం’ ఇది మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్‌వెల్ వ్యాఖ్య. ‘ఇలా ఆడితే ప్రత్యర్థి ఎవరైనా ఏమీ చేయలేరు. ఆ ఆటను దగ్గర్నించి చూస్తూ ఆస్వాదించడం మాత్రమే చేయగలం’ ఇది ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ అభిప్రాయం. ఈ రెండు మాటలు చాలు కోహ్లి ఎంత గొప్ప ఇన్నింగ్స్ ఆడాడో మరోసారి చెప్పడానికి. ఇక సోషల్ మీడియాలో అయితే కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అదరగొట్టే అంకెలు
రెండో ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ టి20ల్లో కోహ్లి సగటు 91.80. అదే జట్టును గెలిపించిన సందర్భాల్లో ఇది 122.83. టి20 ఫార్మాట్‌లో ఇది అసాధారణ సగటు. మరెవరూ కనీసం దరిదాపుల్లో కూడా లేరు. ఏకంగా తొమ్మిదిసార్లు నాటౌట్‌గా ఉండి మ్యాచ్‌లు గెలిపించిన ఘనత కూడా విరాట్‌దే. గణాంకాలే కాదు ఆసియా కప్‌లో పాక్‌పై, ప్రపంచకప్‌లో పాక్‌పై, ఇప్పుడు ఆసీస్‌పై అతని ఆట చూస్తే అంకెలకు మించి అతని ఇన్నింగ్స్ స్థాయి ఏమిటో, అవి ఎలాంటి సందర్భంలో వచ్చాయో చూస్తే వాటి గొప్పతనం అర్థమవుతుంది.
శ్రమ జీవి...
కఠిన పరిస్థితుల్లోనూ కోహ్లి ఇంకా బాగా ఆడటానికి ప్రత్యేకంగా కారణం అవసరం లేదు. అతను తన ఆటను నమ్ముతాడు. తను బాగా ఆడగలననే నమ్మకాన్ని నమ్ముతాడు. ఫోర్లు కొట్టకపోయినా ఫర్వాలేదు, ప్యాడ్లు కట్టుకొని తనకంటే వేగంగా ఈ ప్రపంచంలో పరుగెత్తలేరని గట్టిగా నమ్ముతాడు. ఇలాంటి క్షణాల కోసమే తాను కష్టపడతానని అతను చెబుతాడు. గంటల కొద్దీ జిమ్‌లో శ్రమించడం, కఠినమైన డైట్, స్ట్రెంత్ ట్రైనింగ్, వేల సంఖ్యలో నెట్స్‌లో ఎదుర్కొనే బంతులు... ఇదంతా తాను మైదానంలో బరిలోకి దిగినప్పుడు చూపించేందుకు అతను చెమటోడుస్తాడు. తాను మొదటి పరుగు తీసేటప్పుడు ఎంత చురుగ్గా ఉంటాడో చివరి పరుగు తీసే సమయంలో కూడా అలాగే ఉండాలని కోరుకుంటానని కోహ్లి తన శ్రమ గురించి స్వయంగా చెప్పుకుంటాడు. ఆటలో అతను అంతా నేర్చుకున్నాడు. కానీ ప్రతీ మ్యాచ్‌ను పరీక్షగా భావించే అతను దాని కోసం విద్యార్థిలా చేసే సన్నద్ధతలోనే ఈ గొప్పతనమంతా దాగి ఉంది.
మరిన్ని రావాలి...
విరాట్ కోహ్లి బ్యాటింగ్ గొప్పతనాన్ని వర్ణించాలంటే ఇప్పుడు నిఘంటువులో కొత్త పదం వెతుక్కోవాలేమో. ఎందుకంటే అద్భుతం, అసాధారణం, అనితరసాధ్యంలాంటి విశేషణాలు అన్నీ ఇప్పుడు పాతబడిపోయాయి. ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనే ఘనతను సొంతం చేసుకున్న విరాట్... క్రికెట్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాడిగా మారే రోజు కూడా చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పుడే కాదు ఇక ముందు కూడా కోహ్లి క్రీజ్‌లో ఉన్నంత వరకు ప్రత్యర్థులు విజయం గురించి మర్చిపోతారేమో.
కోహ్లికి కోపమొచ్చింది
అనుష్కపై మాట్లాడడం సిగ్గుచేటు
‘మా కోహ్లిని తిరిగి మాకు ఇచ్చినందుకు థ్యాంక్యూ అనుష్క’... ఆస్ట్రేలియాపై భారత్ గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో కనిపించిన పోస్ట్ ఇది. ఇదే కాదు... కోహ్లి, అనుష్క విడిపోయారంటూ ప్రచారం జరిగిన తర్వాత కూడా చాలామంది అభిమానులు అనుష్కను వదిలిపెట్టలేదు. గతంలో కోహ్లి విఫలమవ్వడానికి అనుష్క కారణం అంటూ పోస్ట్‌లు చేసిన వాళ్లు... ఇప్పుడు విరాట్ బాగా ఆడటానికి అనుష్కతో విడిపోవడం కారణమంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీంతో కోహ్లికి చిర్రెత్తుకొచ్చింది. అలాంటి పోస్ట్‌లు చేస్తున్న వారిపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘షేమ్’ అనే అక్షరాలు రాసి ఉన్న ఫొటోతో పాటు కామెంట్ రాశాడు. ‘అనుష్క శర్మపై అదే పనిగా వ్యాఖ్యలు చేస్తున్న వారు సిగ్గుపడాలి. తమకు తాము విద్యావంతులుగా భావించేవారు చేయాల్సిన పని ఇదేనా? ఆమె నాకు చాలా సానుకూలత ఇచ్చింది. నా ఆటతీరును ఆమెతో ఎందుకు ముడిపెడుతున్నారు.? చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఇలాంటి చెత్త పోస్టులు మానుకుని ఆమెను గౌరవించండి. తన స్థానంలో మీ కుటుంబసభ్యుల్లో ఒకరు ఉంటే ఎలా మదనపడతారో ఆలోచించండి’ అని ఘాటుగా స్పందించాడు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::MAHESH BABU::9966392211.

Post a Comment