తెలంగాణలో తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీల బలవంతపు కాపురం ఎంతో కాలం సాగదా..? రెండు పార్టీల మిత్రబంధం తెగిపోనుందా..? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఉభయ పార్టీల్లో అంతర్మథనం జరుగుతోందా..? కలిసి పరాజయాలు చవిచూడటం కంటే విడిపోయి గెలుపుబాట పట్టడం మంచిదనే భావనకు వచ్చాయా..? గ్రేటర్ ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి పంపిన నివేదిక ఏమిటి..? పరిశీలిద్దాం పదండి...
బలవంతపు కాపురం ఎంతోకాలం నిలవదు.. అధిపత్యాలు..అవమానాలు కాపురంలో చిచ్చు పెట్టేస్తాయి.. తెలంగాణలో తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీల మధ్య ఇలాంటి సమస్యలే వచ్చాయి.. భవిష్యత్తులో రెండు పార్టీలు కలసి పని చేస్తాయా అన్న సందేహం వస్తోంది.. టీడీపీ-బీజేపీల పొత్తు ప్రశ్నార్థకంగా మారింది... వరుస ఓటములతో రెండు పార్టీలు కుంగిపోయిన మాట వాస్తవమే అయినా...ఎక్కువగా బాధపడుతున్నది మాత్రం బీజేపీనే! తెలుగుదేశంతో చెలిమి కారణంగానే తమకు పరాజయాలు ఎదురవుతున్నాయన్నది తెలంగాణ బీజేపీ నేతల భావన! వరంగల్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ... తమ దయనీయమైన పరిస్థితికి తెలుగుదేశం పార్టీనే కారణమని చెప్పింది ఆనాడు.. టీడీపీ శ్రేణులు నిండుమనసుతో పని చేయలేదని బీజేపీ నేతలు ఈసడించుకున్న వైనం తెలిసిందే.. అదే సమయంలో వరంగల్‌లో తాము పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలుగుదేశం పార్టీ అనడాన్ని కూడా విన్నాం.. తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చిపడ్డాయి.. గ్రేటర్ కోటలో పాగా వేయాలంటే పొత్తు తప్పనిసరి అని రెండు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి.. సాధారణ ఎన్నికల్లో సాధించిన ఫలితాల మాదిరిగానే విజయం సాధింవచ్చనుకున్నాయి.. 150 డివిజన్‌లను పంచుకున్నాయి.. తెలుగుదేశం పార్టీ 90 డివిజన్‌లలో పోటీ చేసింది.. బీజేపీ 65 డివిజన్‌లలో బరిలో దిగింది.. కొన్ని స్థానాల్లో తమ అభ్యర్థులకు రెండు పార్టీలు బీఫామ్ ఇవ్వడంతో కాసింత గందరగోళం చెలరేగినప్పటికీ... స్నేహపూర్వక పోటీ అని చెప్పి సర్దుబాటు చేసుకున్నాయి ఉభయ పార్టీలు! అలా చెప్పిన రెండు పార్టీలు స్నేహంగా ఉన్నాయా అంటే లేదు.. హద్దులు దాటి తమ డివిజన్‌లో అడుగు పెట్టినందుకు తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకోవడం.. వెనక్కి పంపించడం జరిగాయి.. స్నేహపూర్వక పోటీనే అయినా ఇరు పార్టీలు పోటీ చేసిన స్థానాల్లో చాలా సీరియస్‌గా ప్రచారం చేశాయి. ఫలితాలపై కొండంత ఆశలు పెట్టుకున్నాయి.. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత రెండు పార్టీలు డీలా పడ్డాయి.. బీజేపీ కేవలం నాలుగు డివిజన్‌లలో మాత్రమే విజయం సాధించగా....తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క స్థానాన్నే గెల్చుకుంది. కలసి పోటీ చేసినా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో బీజేపీ ఆలోచనలో పడింది.. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే తమకు నష్టం జరుగుతుందన్న అభిప్రాయానికి వచ్చింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొని... పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసి... తెలంగాణ వాదాన్ని వాడవాడలా వినిపించిన తమను తెలంగాణ ప్రజలు ఓన్ చేసుకోకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీతో పోత్తేనని అనుకుంటోంది బీజేపీ.. ఇదే విషయాన్ని తాజాగా జాతీయ నాయకత్వం దృష్టికి తెచ్చారు కొందరు నేతలు.. ఓ వారం కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారు.. సుమారు గంటపాటు ఎయిర్‌పోర్టులో వున్నారు.. ఆ గంటసేపూ తెలంగాణ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితిపై చర్చించారు.. కొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలను చర్చించారు. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడుతోందని అమిత్‌షాతో కొందరు కుండబద్దలు కొట్టారట! గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ తమకు బలహీనమైన స్థానాలను కట్టబెట్టిందని.. బీజేపీ గెలిచే అవకాశమున్న స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీనే పోటీ చేసిందని చెప్పుకొచ్చారట! ముఖ్యంగా బీజేపీకి సీట్లు ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ కూడా టీడీపీ తమ అభ్యర్థులకు బీఫామ్‌లు ఇచ్చిందని కంప్లయింట్ చేశారు.
తెలంగాణ బీజేపీ నేతల అభిప్రాయాలు... వాదనలు.. ఆరోపణలు అన్నింటిని విన్న అమిత్ షా మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదట! ఇది ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయం కాదని తేల్చేశారట! ఈ నెలాఖరుకల్లా మండలాలు, జిల్లాల వారీగా కమిటీలు పూర్తి చేయాలని సూచిస్తూ వెళ్లిపోయారట! అంతే కాకుండా వచ్చే నెల మొదటివారంలో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని చెప్పి విమానం ఎక్కేశారట! అమిత్ షా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ఎంతో ఆశగా వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలు ఉసూరుమంటూ వెనక్కి వచ్చేశారట!
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment