ఆస్కార్ బరిలో ఉత్తమ నటి విభాగంలో ఆసక్తికరమైన పోటీ నడుస్తోంది. ఎన్నో అంచనాలున్న నటీమణులకుకాక వూహించని విధంగా కొత్తవారికి నామినేషన్ దక్కడం ఆశ్చర్యపరిచింది. ఏడు నామినేషన్లు పొందిన నటితో తొలిసారి నామినేషన్ పొందిన భామలు పోటీపడుతుండటం విశేషం. ఈ నెల 28న ఆస్కార్ వేడుక జరగనున్న నేపథ్యంలో ఏయే నాయికలు ఏ చిత్రాలతో బరిలో ఉన్నారో చూద్దాం.
చార్లొట్ ర్యాంప్లింగ్: ఈ ఏడాది ‘45 ఇయర్స్’ చిత్రంతో ఉత్తమ నటిగా ఆస్కార్ బరిలో నిల్చొంది చార్లొట్ ర్యాంప్లింగ్. ఈమె కెరీర్‌లో ఇదే తొలి నామినేషన్. ఈ చిత్రంలో కేట్ మెర్సెర్ అనే మహిళ 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఆ సమయంలో వూహించని ఓ వార్త ఆమెను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అప్పుడు ఆమె ఎలా ప్రతిస్పందించిందన్న అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. తన పాత్రలో అద్భుతమైన నటనతో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది చార్లొట్.
కేట్ బ్లాంచెట్: ఈ ఏడాది ఉత్తమ నటి విభాగంలో పోటీపడుతున్న వారిలో నామినేషన్ల విషయంలో అగ్రస్థానంలో ఉంది కేట్ బ్లాంచెట్. గతంలో ఆమె ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి విభాగాల్లో మూడు చొప్పున ఆరు నామినేషన్లు సాధించింది. ఉత్తమ నటిగా ఓసారి, ఉత్తమ సహాయ నటిగా ఓసారి మొత్తం రెండు పురస్కారాలు దక్కించుకుంది. ఇప్పుడు ‘కరోల్’ చిత్రంతో ఏడో నామినేషన్ సాధించి బరిలో నిలిచింది. ఈ చిత్రంలో కరోల్ ఎర్డ్ అనే పాత్రలో ఒక బిడ్డకు తల్లిగా నటించింది బ్లాంచెట్. భర్త నిరాదరణతో ఆమె వేరే మహిళతో సన్నిహితంగా మెలుగుతుంటుంది. దీని వల్ల తన బిడ్డ తనకు దూరమవుతుందనే భయంతో సతమతమయ్యే తల్లిగా బ్లాంచెట్ మెప్పించింది. ఈ ఏడాది బ్లాంచెట్‌కు పురస్కారం దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
సవోర్సె రోనన్: ‘బ్రూక్లిన్’ చిత్రంతో తొలిసారిగా ఉత్తమ నటి విభాగంలో పోటీ పడుతోంది సవోర్సె రోనన్. గతంలో ‘అటోన్‌మెంట్’తో ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ సాధించింది. అయితే పురస్కారం దక్కలేదు. ‘బ్రూక్లిన్’లో అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండ్ యువతిగా నటించింది రోనన్. కొత్త దేశంలో ఆమెకెదురైన అనుభవాలు, ప్రేమ, స్వదేశం తిరిగొచ్చాక జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. బరువైన పాత్రలో భావోద్వేగాలు పండించి శెభాస్ అనిపించింది రోనన్.
జెన్నిఫర్ లారెన్స్: ఈ సారి ఉత్తమ నటి పురస్కారం కోసం బరిలో ఉన్న వారిలో బ్లాంచెట్ తర్వాత అత్యధిక నామినేషన్లు పొందింది జెన్నిఫర్ లారెన్స్. గతంలో ఉత్తమ నటి విభాగంలో రెండు, ఉత్తమ సహాయ నటి విభాగంలో ఒకటి చొప్పున మొత్తం మూడు నామినేషన్లు సాధించింది జెన్నిఫర్. ఉత్తమ నటిగా ఓసారి పురస్కారం కైవసం చేసుకుంది. ఇప్పుడు ‘జాయ్’ చిత్రంతో నాలుగో నామినేషన్ దక్కించుకుంది. భర్తతో విడిపోయిన ముగ్గురు పిల్లల తల్లి జాయ్ మంగానో స్వశక్తితో కష్టాలను ఎలా అధిగమించిదన్నది ఇందులో చూపించారు. ఎన్నో గృహోపకరణాలను కనిపెట్టి ధనవంతురాలైన వ్యాపార వేత్తగా ఎదిగింది జాయ్. ఆమె పాత్రలో జెన్నిఫర్ ప్రశంసాపూర్వక నటన ప్రదర్శించింది.
బ్రీ లార్సన్: ‘రూమ్’ చిత్రంతో తొలిసారి ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని ఉత్తమ నటి విభాగంలో పోటీపడుతోంది బ్రీ లార్సన్. తన చిన్నారితో పాటు ఏడేళ్లు గృహనిర్బంధానికి గురై నరకయాతన అనుభవించే మా అనే తల్లి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తన బిడ్డ స్వేచ్ఛ కోసం పోరాడే తల్లిగా లార్సన్ ఆకట్టుకుంది. తమకు విముక్తి కలిగాక బిడ్డకు తొలిసారి బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేసే సన్నివేశాల్లో ఉత్తమ నటన కనబర్చింది. తన కృషికి పురస్కారం వస్తుందనే నమ్మకంతో ఉంది లార్సన్.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FreshDeals365.Com....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Post a Comment