సెల్ఫీ యువత పాలిట సెల్ప్ కిల్లింగ్ మారుతోంది. స్మార్ట్ ఫోన్ తో తమకు తాముగా ఫొటోలు తీసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిలో యువతీయువకులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మనదేశంలో సెల్ఫీ మరణాలు అత్యధికంగా సంభవిస్తుండడం మరింత భయాందోళన రేకిత్తిస్తోంది. స్వీయ చిత్రం తీసుకుని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో సన్నిహితులతో పంచుకోవాలన్న వెర్రితో యువత ప్రాణాలను ఫణంగా పెట్టడం ప్రమాదకర పరిణామం. తాజాగా చెన్నైలో వేగంగా వస్తున్న రైలు ముందు పరిగెత్తుతూ సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ 16 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలవడం సంచలనం రేపింది.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా 27 సెల్ఫీ మరణాలు నమోదు కాగా, ఇందులో సగం మనదేశంలోనే చోటుచేసుకున్నాయని అమెరికా అగ్రశేణి దినపత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' వెల్లడించింది. ఇటీవల ముంబైలోని బండ్ స్టాండ్ ప్రాంతంలో అరేబియా సముద్రం ఒడ్డున నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు సముద్రంలోకి దూకిన వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. సెల్ఫీల పిచ్చి ముదిరిపోవడంతో నిరుడు నాసిక్ కుంభమేళాలో పలు చోట్ల నాన్-సెల్ఫీ జోన్స్ ఏర్పాటు చేశారు.
సెల్ఫీ మరణాలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. స్వీయ చిత్రాలు తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వుంది. సెల్ఫీలపై ప్రజలకు అప్రమత్తం చేసేందుకు ముంబై పోలీసులు తమ వంతు ప్రయత్నం మొదలుపెట్టారు. కొన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని 'నో సెల్ఫీ జోన్స్' గా గుర్తించారు. ఫొటో కంటే ప్రాణాలు ముఖ్యమని 'సెల్ఫీ'షులకు హితబోధ చేస్తున్నారు.
గతేడాది చోటుచేసుకున్న సెల్ఫీ మరణాలు
- జనవరిలో ఆగ్రాకు వెళుతూ ముగ్గురు విద్యార్థులు రైల్వే ట్రాక్ పై నిలబడి వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డారు.
- మార్చిలో నాగపూర్ లో ఓ సరస్సులో ప్రయాణిస్తూ బోటులో నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో అది తిరగబడడంతో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడులో కొల్లి హిల్స్ లో స్వీయచిత్రం తీసుకుంటూ ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. అతడు నిలుచున్న బండరాయి పైనుంచి పడిపోవడంతో తలకు గాయమై మృతి చెందాడు.
- నవంబర్ లో గుజరాత్ లో ఇద్దరు విద్యార్థులు సెల్ఫీ తీసుకుంటూ నర్మదా నదిలోకి పడిపోయారు. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
Post a Comment